ఏపీ విద్యార్ధులకు తెలంగాణాలో తీరని నష్టం

ఏపీ విద్యార్ధులకు తెలంగాణా మెడికల్ కాలేజీల్లో తీరని నష్టం జరగబోతోంది. ఈ నష్టంకూడా చట్టం పరిధిలోనే జరుగుతుండటం ఆశ్చర్యంగా ఉంది.

Update: 2024-06-06 07:36 GMT

ఏపీ విద్యార్ధులకు తెలంగాణా మెడికల్ కాలేజీల్లో తీరని నష్టం జరగబోతోంది. ఈ నష్టంకూడా చట్టం పరిధిలోనే జరుగుతుండటం ఆశ్చర్యంగా ఉంది. పునర్విభజన చట్టం కాలపరిమితి పదేళ్ళు పూర్తయిపోయింది కాబట్టి తెలంగాణా మెడికల్ కాలేజీల్లో 15 శాతం రిజర్వేషన్ రద్దయిపోయింది. దీనివల్ల సుమారు 295 సీట్లను ఏపీ విద్యార్ధులు కోల్పోవాల్సిరావటం బాధాకరమే.

ఏపీ పునర్విభజన చట్టం పదేళ్ళు పూర్తయిపోవటంతో తెలంగాణా మెడికల్ కాలేజీల్లో చదవాలని అనుకుంటున్న ఏపీ విద్యార్ధులకు తీరని నష్టం తప్పటంలేదు. రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ ను తెలంగాణా-ఏపీకి పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా యూపీఏ ప్రభుత్వం చట్టంలో నిర్దేశించింది. దాని ప్రకారం తెలంగాణాలోని అన్నీ విద్యాసంస్ధల్లోను ఏపీ విద్యార్ధులకు రిజర్వేషన్లు కంటిన్యు అయ్యింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు. 2014 పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణాలో ఉన్న 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్ధులకు ప్రత్యేకంగా 15 శాతం రిజర్వేషన్ కేటాయించింది తెలంగాణా ప్రభుత్వం. ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో మాత్రం 15 శాతం రిజర్వేషన్ వర్తింపచేయలేదు.

ఈ రిజర్వేషన్ల ప్రకారం 20 కాలేజీల్లో ప్రతిఏడాది 293 సీట్లు ఏపీ విద్యార్ధులకు మాత్రమే రిజర్వయ్యాయి. ఆల్ ఇండియా కోటాకు ఏపీ 15 శాతం రిజర్వేషన్లు అదనంగా ఉండేవి. పై రెండు రిజర్వేషన్లు పోను మిగిలిన సీట్లను పూర్తిగా కన్వీనర్ కోటాలో తెలంగాణా విద్యార్ధులతోనే భర్తీచేసేవారు. పైన చెప్పిన వివరాల ప్రకారం కన్వీనర్ కోటాలో 1950 సీట్లు భర్తీ అయ్యేవి. అంటే 1950 సీట్లలో 15 శాతం అంటే 293 సీట్లను ఏపీ విద్యార్ధులతోనే తెలంగాణా ప్రభుత్వం భర్తీచేసింది. 2014 తర్వాత చాలా కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు తెలంగాణా వ్యాప్తంగా 56 మెడికల్ కాలేజీలున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో నీట్ ఎంట్రన్స్ ద్వారా 56 కాలేజీల్లో 8490 సీట్లు భర్తీ అయ్యాయి. 27 ప్రభుత్వ కాలేజీల్లో 3,790 సీట్లు, 29 ప్రైవేటు కాలేజీల్లో 4700 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ కాలేజీల్లోని అన్నీ సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాలోనే భర్తీ అవుతాయని తెలిసిందే.

2024-25 విద్యా సంవత్సరంలో మరికొన్ని మెడికల్ కాలేజీలు రెడీ అయ్యాయి. అడ్మిషన్లకు అనుమతి కోరుతు కాలేజీల యాజమాన్యాలు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ను కోరాయి. జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాద్రాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్లో కొత్త కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కొత్త కాలేజీల్లో అడ్మిషన్లకు ఎన్ఎంసీ అనుమతి ఇస్తే తక్కువలో తక్కువ 300 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇదే జరిగితే నీట్ లో మంచి ర్యాంకు తెచ్చుకున్న విద్యార్ధుల్లో ఏపీ విద్యార్ధులకు మళ్ళీ 15 శాతం రిజర్వేషన్లు కేటాయించాల్సుంటుంది. దీని ప్రకారమైతే సుమారు 45 సీట్లు ఏపీ విద్యార్ధులకు రిజర్వు అవుతాయి. కాని పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్ళు పూర్తియిపోయింది కాబట్టి ఏపీ విద్యార్ధులకు ప్రత్యేకంగా ఉన్న 15 శాతం రిజర్వేషన్ వర్తింపచేయకూడదని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

అంటే ప్రత్యేకంగా ఉన్న 15 శాతం రిజర్వేషన్ స్ధానంలో ఆల్ ఇండియా కోటాలోని 15 శాతం సీట్లలోనే ఇతర రాష్ట్రాల విద్యార్ధులతో ఏపీ విద్యార్ధులు పోటీపడి మంచి ర్యాంకు తెచ్చుకుని తెలంగాణా కాలేజీల్లో సీట్లు తెచ్చుకోవాల్సుంటుంది. ఒకరకంగా చూస్తేనేమో పునర్విభజన చట్టానికి పదేళ్ళు పూర్తవ్వటం వల్ల పెద్ద నష్టం జరుగుతోందనే చెప్పాలి. ఇంకోరకంగా చూస్తేనేమో చట్టం కాలపరిమితి పూర్తియిపోయింది కాబట్టి 15 శాతం రిజర్వేషన్ రద్దయితే ఎవరు చేయగలిగేదేమీ లేదు.

Tags:    

Similar News