ఢిల్లీలో సీఎంలు బిజీబిజీ

తెలుగు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు ఢిల్లీలో బిజీబిజీగా తిరిగేస్తున్నారు.

Update: 2024-10-08 08:30 GMT
Revanth and Chandrababu at Delhi

తెలుగు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు ఢిల్లీలో బిజీబిజీగా తిరిగేస్తున్నారు. సోమవారం చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి ఏపీకి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు వెంటనే ఇప్పించాలని విజ్ఞప్తులు చేయటంతో పాటు ఏపీ విషయంలో సానుకూలతకు ధన్యవాదాలు చెప్పారు. ఇదే సమయంలో సోమవారం కేంద్ర హోంశాఖ మంత్ర అమిత్ షా తో మావోయిస్టు సమస్య మీద జరిగిన సమవేశంలో పాల్గొన్నారు. ఎలాగూ అమిత్ షా ను కలిశారు కాబట్టి తెలంగాణాకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతుల జాబితాను మంత్రి ముందుంచారు. ఆదిలాబాద్, కుమ్రంభీమ్, మంచిర్యాల జిల్లాలను మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ప్రకటించాలని కోరారు. విభజన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

తర్వాత పట్టణాభివృద్ధి శాఖ మంత్ర మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి 7444 కిలోమీటర్ల సీవరేజి ప్రాజెక్టు నిర్మానికి అవసరమైన రు. 17 వేల కోట్లు మంజూరు చేయాలని అడిగారు. 27 మున్సిపాలిటీలను కలుపుతు ఏర్పాటుచేయబోతున్న రెండో దశ మెట్రో ప్రాజెక్టు ఖర్చు రు. 24,269 కోట్ల ఖర్చును కేంద్రమే భరించాలని, వరదనష్టం పనులకు రు. 5438 కోట్లు వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పెషల్ పోలీసు ఆఫీసర్సుకు చెల్లించాల్సిన నిధులు, 1065 మంది స్పెషల్ పోలీసు ఆఫీసర్సును డ్యూటీలో చేర్చుకోవటంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించాలని, మావోయిస్టు ప్రాంతాల్లో బలోపేతం చేయాల్సిన పోలీసుస్టేషన్లకు నిధులు మంజూరుచేయాలని రేవంత్ కేంద్రమంత్రులకు విజ్ఞప్తులిచ్చారు.

అలాగే 2047కల్లా సాకారం చేయాలని అనుకుంటున్న స్వర్ణాంధ్రకు అన్నీరకాలుగా సహకరించాలని మోడిని చంద్రబాబు కోరారు. డిసెంబర్లో విశాఖ రైల్వేజోన్ నిర్మాణానికి శంకుస్ధాపన చేయాలని, వరదలతో దెబ్బతిన్న ఏపీకి మరిన్ని నిధులు మంజూరు చేయాలని, పోలవరంకు అవసరమైన నిధులిస్తే వెంటనే పనులు మొదలుపెట్టి డెడ్ లైన్ 2026, మార్చిలోగా పూర్తిచేస్తామని చంద్రబాబు చెప్పారు. తర్వాత రైల్వే మంత్ర అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయినపుడు రాష్ట్ర మౌళిక వసతుల ప్రాజెక్టుల్లో రైల్వే పెట్టుబడులు రు. 73,743 కోట్లుగా చెప్పారు. హౌరా-చెన్నై మధ్య నాలుగు లైన్లుగా మార్చాలని, 73 లోకల్ రైల్వేస్టేషన్లను ఆధునీకరించాలని చంద్రబాబు కోరారు.

అవకాశం ఉంటే మోడితో రేవంత్ మంగళవారం భేటీ అవుతారు. అలాగే చంద్రబాబుకు ఈరోజు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ ఉంది. అలాగే గడ్కరీ, గోయల్, పురీల, నిర్మల సీతారామన్ తో కూడా సమావేశమవబోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీ చుట్టూ నిధులు, ప్రాజెక్టులు, అనుమతుల కోసం ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా పెద్దగా ఉపయోగాలు ఉండవు. ఒక రాష్ట్రానికి నిధులు ఇవ్వాలన్నా, కోతపెట్టాలన్నా, పెండింగులో పెట్టాలన్నా మోడి లెక్కలు ఏవేవో ఉంటాయి. మోడీ అనుమతిలేకుండా అమిత్ షా కాని మరో మంత్రికాని చేయగలిగేది ఏమీలేదు. ఈ విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఢిల్లీకి వెళ్ళినపుడల్లా ప్రోటోకాల్ ప్రకారం సీఎంలు మోడితో పాటు అమిత్ షా, కేంద్రమంత్రులను కలుస్తున్నారంతే. మరి తాజా పర్యటనలో ఇద్దరు సీఎంలు తెలంగాణా, ఏపీకి ఏమి సాధించబోతున్నారో చూడాల్సిందే.

Tags:    

Similar News