లిక్కర్ కేసు.. ‘కిషన్ రెడ్డికి ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయి?’

కవిత కేసుపై ఆధారాలు ఉన్నాయన్న కిషన్ రెడ్డిని కూడా ఈడీ విచారించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2024-03-24 14:28 GMT
Source: Twitter

తెలంగాణలో కవిత కేసు హాట్ టాపిక్‌గా ఉంది. శనివారం ఈ కేసుపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, కేసీఆర్‌తో చర్చకు కూడా సిద్ధమని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి స్పందించారు. ‘‘కవితను అరెస్ట్ చేయడానికి ఈడీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఇప్పటికీ ఈడీ అధికారులు వెల్లడించలేదు. కానీ ఈ కేసుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కిషన్ రెడ్డి అంటున్నారు. ఆయనకు ఈ ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయో అన్న అంశంపై ఈడీ విచారణ చేయాలి’’అని డిమాండ్ చేశారు ప్రతిపక్ష నేత జగదీష్ రెడ్డి. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సమగ్ర విచారణ చేపట్టి ఆయన దగ్గరకు సాక్ష్యాలు ఎలా వచ్చాయో తేల్చాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. 

కాంగ్రెస్ పార్టీకి రైతులు కష్టాలు పట్టవంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని అనేక చోట్ల పంట పొలాలు ఎండిపోతున్నా, రైతులు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పట్టనట్లు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో కేఆర్ఎండీ నిరాకరించినా బీఆర్ఎస్ ప్రభుత్వం పంటపొలాలకు సాగునీరు అందించిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కేబినెట్ మంత్రులకు నాగార్జున సాగర్ కట్ట మీదకు వెళ్లాలంటే లాగులు తడుస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీజేపీ ఒకటే
రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఉన్న ప్రజాదరణను తగ్గించడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ప్రజల్లో బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీడానికి రాష్ట్రంలో బలంలేని ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. అనంతరం కవిత కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కవితను ఢిల్లీకి పిలిపించి విచారణ చేసినా ఏం తేలలేదని, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడటంతో బీఆర్ఎస్‌ను దెబ్బతీయడానికే కవితను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత కేసుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కిషన్ రెడ్డి అంటున్నారని, కాబట్టి లిక్కర్ పాలసీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హస్తం కూడా ఉందేమో అన్న కోణంలో ఈడీ విచారణ చేపట్టాలని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News