‘తెలంగాణలో విద్య ప్రమాణాల నాణ్యత పెరగాలి’

విద్యార్థులు, బోధ‌న సిబ్బందికి ఫేషియ‌ల్ రిక‌గ్నేష‌న్ త‌ప్ప‌నిస‌రి అని చెప్పిన సీఎం.;

Update: 2025-08-29 12:27 GMT

తెలంగాణ రాష్ట్రంలో విద్యాప్రమాణాలను మరింత నాణ్యంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యాకేంద్రాల్లో మెరుగైన, నాణ్యమైన విద్యాబోధన సాగాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్య ప్రమాణాలను మరింత పెంచాలని ఆదేశించారు. ఇందుకోసం తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని, ప్రతి అడుగులో అధికారులకు సహకరిస్తామని, అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. విద్యా శాఖ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగానే పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, ప్రొఫెషిన‌ల్ కోర్సులు బోధించే క‌ళాశాల‌ల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బందికి ఫేషియ‌ల్ రిక‌గ్నేష‌న్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని సీఎం ఆదేశించారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగ‌వ‌డంతో పాటు ప్రొఫెష‌న‌ల్ విద్యా సంస్థ‌ల్లో లోటుపాట్ల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌న్నారు.

విద్యా శాఖ ప‌రిధిలో అద‌న‌పు గ‌దులు, వంట గ‌దులు, మూత్ర‌శాల‌లు, మ‌రుగుదొడ్లు, ప్ర‌హారీల నిర్మాణం వివిధ విభాగాలు చేప‌ట్ట‌డం స‌రికాద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ నిర్మాణాల‌ నాణ్య‌త‌ప్ర‌మాణాలు, నిర్మాణ ప‌ర్య‌వేక్ష‌ణ‌, నిధుల మంజూరు, జ‌వాబుదారీత‌నానికి గానూ ఒకే విభాగం కింద ఉండాల‌న్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వ‌స‌తుల అభివృద్ధి సంస్థ (EWIDC) కింద‌నే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థ‌ల నిర్మాణాలు కొన‌సాగాల‌ని సీఎం ఆదేశించారు. ఈ సంస్థ‌కు అవ‌స‌ర‌మైన ఇంజినీరింగ్‌, ఇత‌ర సిబ్బందిని ఇత‌ర విభాగాల నుంచి వెంట‌నే డిప్యూటేష‌న్‌పై తీసుకోవాల‌ని సూచించారు.

మ‌ధ్యాహ్న భోజ‌న బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛాన‌ల్‌లో చేప‌ట్టాల‌ని... ఈ విష‌యంలో ఎటువంటి అల‌స‌త్వం చూపొద్ద‌ని సీఎం అన్నారు. తెలంగాణ‌లోని మ‌హిళా కళాశాల‌లు, బాలికల పాఠ‌శాల‌ల్లో మూత్ర‌శాల‌లు, మ‌రుగుదొడ్లు, ప్ర‌హ‌రీల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని సీఎం ఆదేశించారు. కంటైన‌ర్ కిచెన్ల‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని.. కంటైన‌ర్ల‌పైన సోలార్ ప్యానెళ్ల‌తో అవ‌స‌ర‌మైన విద్యుత్ వినియోగించుకోవ‌చ్చ‌ని సీఎం తెలిపారు. ప్ర‌తి పాఠ‌శాల‌లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అవ‌స‌ర‌మైతే కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిన వ్యాయామ ఉపాధ్యాయుల‌ను నియ‌మించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల కింద పాఠ‌శాల‌ల్లో పారిశుద్ధ్య ప‌నులకు సంబంధించిన బిల్లులు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని సీఎం ఆదేశించారు. సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లోని బాలిక‌ల‌కు వివిధ అంశాల‌పై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మ‌హిళా కౌన్సెల‌ర్ల‌ను నియ‌మించాల‌ని సీఎం సూచించారు. విద్యా రంగంపై పెడుతున్న ఖ‌ర్చును తాము ఖ‌ర్చుగా కాక పెట్టుబ‌డిగా చూస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల‌తో పాటు విద్యా రంగం అభివృద్ధికి తీసుకునే రుణాల‌ను ఎఫ్ఆర్‌బీఎం ప‌రిమితిలో లేకుండా చూడాల‌ని ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశార‌ని సీఎం తెలిపారు. ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో చదువుతున్న వారిలో 90 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నార‌ని, ఈ విష‌యాన్ని నిర్ధారించేందుకు గ‌త ప‌దేళ్ల‌లో ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో చ‌దివిన వారి వివ‌రాల‌పై నివేదిక రూపొందించాల‌ని సీఎం ఆదేశించారు.

Tags:    

Similar News