బీజేపీ నేతలపై రామచంద్రరావు సీరియస్
కొందరు ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పార్టీలోని లోపాలపై గట్టిగానే మాట్లాడారు.
బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు సీరియస్ అయ్యారు. ఆదివారం పార్టీ ఆఫీసులో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈసమావేశంలో నేతలమధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనబడింది. కొందరు ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పార్టీలోని లోపాలపై గట్టిగానే మాట్లాడారు. ప్రజాప్రతినిధుల ఆరోపణలు, ఆక్షేపణలు, సీనియర్ల విమర్శలు చూసిన తర్వాత పార్టీలోని లోపాలన్నీ బహిర్గతమైనట్లు తెలుస్తోంది. దీనిపైన రామచంద్రరావు సీరియస్ అయ్యారు. స్ధానికసంస్ధల ఎన్నికలు, జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగబోతున్న తరుణంలో పార్టీ నేతలమధ్య సమన్వయలోపం బయటపడటంతో ఆందోళన వ్యక్తంచేశారు.
ఈరోజు జరిగిన సమావేశం మొత్తం హాటుహాటుగానే జరిగింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధ్యక్షుల తీరుపై చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. పై రెండుజిల్లాల్లోని అధ్యక్షులకు సీనియర్ నేతల మధ్య సమన్వయలోపం బాగా ఎక్కువగా ఉందన్నారు. అలాగే ప్రజాప్రతినిధులకు జిల్లాలోని సీనియర్ నేతల మధ్య సమన్వయంలేదని మండిపడ్డారు. కామారెడ్డి ఎంఎల్ఏ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతు ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కూర్చుని మాట్లాడుకునే పరిస్ధితులు ఎందుకు లేదని రాష్ట్ర అధ్యక్షుడిని నిలదీశారు. పార్టీ ఆఫీసులో కూర్చుని డిసైడ్ చేసిన కార్యక్రమాలు క్షేత్రస్ధాయిలో ఎందుకు ఆచరణలోకి రావటంలేదని ప్రశ్నించారు. జిల్లాల్లో పార్టీ నేతల మధ్య కూడా సమన్వయం లేదన్న విషయమై కాటిపల్లి చాలా ఆరోపణలు చేశారు.
గ్రౌండ్ లెవల్లో పార్టీ పరిస్ధితి చాలా అధ్వాన్నంగా ఉందని ఎంఎల్ఏ తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ ఆఫీసులో కూర్చుని అంతా బాగుందని అనుకుంటే సరిపోదన్నారు. సమావేశాలకు రావటం, తిరిగి వెళ్ళటమేనా తమపని అని నిలదీశారు. గ్రామ, మండల, నియోజకవర్గాల స్ధాయిలో పార్టీకార్యక్రమాలు అమలుకావటంలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. నేతల మధ్య సమన్వయ లోపాలు ఇలాగే ఉంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో, తర్వాత జరగబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ విజయం ఎలాగ సాధ్యమని కాటిపల్లి నిలదీశారు.
మహబూబ్ నగర్ ఎంపీ డీకేఅరుణ మాట్లాడుతు ఎన్నికల బహిరంగసభల బాధ్యత జిల్లాల ఇంచార్జులకే అప్పగించాలని సూచించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్ధుల ఎంపికపై జిల్లా అధ్యక్షుడు, ఇంచార్జి, పరిశీలకుడితో కమిటి వేయాలని చెప్పారు. ప్రతిజిల్లాలోను బహిరంగసభలు ప్లాన్ చేయాలన్నారు. తక్కువలో తక్కువ 15 జిల్లా పరిషత్ ఛైర్మన్ స్ధానాలను గెలుచుకోవటమే టార్గెట్ గా పెట్టుకుని పనిచేయాలని డీకే చెప్పారు. ఎంపీలు ఉన్నచోట స్ధానికసంస్ధల ఎన్నికల్లో గెలుపును, మిగిలిన ప్రాంతాల్లో పార్టీవిస్తరణను లక్ష్యంగా చేసుకుని పార్టీ ప్రణాళికలు రచించాలని సూచించారు. దాదాపు రెండుగంటలసేపు జరిగిన సమావేశం చాలా హాటుగా ముగిసింది.