రేసులో దూసుకుపోతున్న రేవంత్

తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డికి మా చెడ్డ సమస్యొచ్చి పడింది. ఇద్దరూ పెద్ద ఇరకాటంలో పడిపోతున్నారు.

Update: 2024-08-16 09:00 GMT
Revanth and Chandrababu

తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి మధ్య రేసు మొదలైంది. రేసు ఎందులో అంటే పెట్టుబడుల ఆకర్షణలో. ఈ రేసులో చంద్రబాబుకన్నా రేవంత్ ముందున్నారు.  విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు, తెలంగాణా ముఖ్యమంత్రిగా రేవంత్ ఇద్దరు పెట్టుబడుల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తాను అధికారంలో ఉంటేనే ఏపీకి పెట్టుబడులు వస్తాయని, పరిశ్రమలు ఏర్పాటవుతాయని చెప్పుకోవటం చంద్రబాబుకు మహాఇష్టం. ఇదే సమయంలో తెలంగాణాకు పరిశ్రమలు, పెట్టుబడులు సాధించటంలో ఇది..తన కృషి అని చెప్పుకోవాల్సిన అగత్యం రేవంత్ ది. అందుకనే ఇద్దరు సీఎంలు ఢిల్లీలో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు.

అమెరికా, దక్షిణకొరియా పర్యటను ముగించుకుని హైదరాబాద్ కు గురువారం ఉదయం వచ్చిన రేవంత్ అర్ధరాత్రికి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళారు. శుక్ర, శనివారాలు పార్టీ పెద్దలతో పాటు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేట్లుగా పారిశ్రామికవేత్తలను ఒప్పించటమే రేవంత్ టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. ఎంతమంది పారిశ్రామికవేత్తలను కలవబోతున్నారన్న వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఇంకా రిలీజ్ చేయలేదు. పనిలోపనిగా సమయం అనుకూలిస్తే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల కోసం కేంద్రమంత్రులను కలిసే అవకాశం కూడా ఉందంటున్నారు.

ఇదే సమయంలో శుక్రవారం మధ్యాహ్నం చంద్రబాబు కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నారు. చంద్రబాబు కూడా ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్ తదితరులతో భేటీ అవుతారు. అలాగే ఏపీలో పెట్టుబడులు పెట్టేట్లుగా ఒప్పించేందుకు పారిశ్రామికవేత్తలతో కూడా చంద్రబాబు సమావేశం అవబోతున్నారు. కేంద్రమంత్రులను కలవటం, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు, నిధుల విడుదల విషయం ఒకఎత్తు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు కోసం పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు.

పారిశ్రామికవేత్తలతో భేటీ సందర్భంలో ఇద్దరు సీఎంలు తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడితే వచ్చే లాభల గురించి వివరించబోతున్నారు. వివరించటంలో రేవంత్ కు చాలా అవకాశాలున్నాయి, మరి చంద్రబాబుకు ఏముంది ? అన్నదే ప్రశ్న. ముఖ్యమంత్రులు వేరు, రాష్ట్రాలు వేరన్నంత మాత్రాన పారిశ్రామికవేత్తలు వేర్వేరుగా ఉండరు కదా. ఇద్దరు సీఎంలు కలవబోయే పారిశ్రామికవేత్తలు దాదాపు కామన్ గానే ఉంటారు. ఇక్కడే చంద్రబాబు, రేవంత్ ఇరకాటంలో పడుతున్నారు. ముఖ్యమంత్రులుగా తమ రాష్ట్రాల గురించి తాము గొప్పగా చెప్పుకోవాల్సిందే. పెట్టుబడులను ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఆకర్షిస్తే ఆ ముఖ్యమంత్రి సక్సెస్ అయినట్లే.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వ్యక్తిగతంగా ఇద్దరూ అత్యంత సన్నిహితులు. వీళ్ళిద్దరిది ఫెవికాల్ బంధమని లోకానికంతా తెలుసు. అయితే ఇద్దరు కూడా వేర్వేరు కూటముల్లో ఉన్నారు. ఎన్డీయే కూటమిలో చంద్రబాబు ఉంటే, ఇండియా కూటమిలో రేవంత్ ఉన్నారు. కాబట్టి వ్యక్తిగతాన్ని పక్కనపెట్టేసి కచ్చితంగా తమ రాష్ట్రాలను గొప్పగా ప్రొజెక్టు చేసుకుని పెట్టుబడులను ఆకర్షించటం ఇద్దరికీ సమస్యగా మారిపోయింది. విదేశీ పర్యటనలో రు. 31500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుని తిరిగొచ్చిన రేవంత్ మంచి జోష్ మీదున్నారు. గురువారం సాయంత్రం కోకాపేటలో కాగ్నిజెంట్ రెండో కేంద్రం విస్తరణకు శంకుస్ధాపన కూడా చేశారు. విదేశీ టూర్ ఫలించి తొందరలోనే మరిన్ని పెట్టుబడులు హైదరాబాద్ కు రాబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.


ఫాక్స్ కాన్ ఛైర్మన్ తో  భేటి


ఢిల్లీ పర్యటనలో రేవంత్ ఫాక్స్ కాన్ ఛైర్మనే యాంగ్ లీ యూన్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో పెట్టుబడులు  పెట్టమని రిక్వెస్టు చేశారు. హైదరాబాద్ లో  పెట్టుబడులు పెట్టడం వల్ల ఫాక్స్ కాన్ కంపెనీతో పాటు తెలంగాణాకు కూడా మంచి జరుగుతుందని రేవంత్ వివరించారు. తొందరలోనే తాను హైదరాబాద్ వస్తానని యాంగ్ హామీ ఇచ్చారు. దాంతో పెట్టుబడుల రేసులో రేవంత్ దూసుకుపోతున్నట్లు అర్ధమవుతోంది. 


విదేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించిన రేవంత్ దేశీయంగా పారిశ్రామికవేత్తలను పెట్టుబడులకు ఒప్పించలేకపోతే అది పెద్ద మైనస్ అవుతుంది. ఇదే సమయంలో పెట్టుబడిదారులను ఒప్పించి ఏపీలో పెట్టుబడులు పెట్టించకపోతే ముఖ్యమంత్రిగా అనుభవం, ఎన్డీయూ కూటమిలో కీలక భాగస్వామిగా చంద్రబాబు ఉండి వృధానే. అందుకనే పెట్టుబడులను ఆకర్షించటంలో ఇద్దరు పెద్ద ఇరకాటంలో పడ్డారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News