దర్శన్‌కు అంత డబ్బు ఎవరిచ్చారు? ఆ డబ్బుతో ఏం చేయాలకున్నాడు?

అభిమానిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్ తన స్నేహితుడి నుంచి రూ. 40 లక్షలు ఎందుకు తీసుకున్నాడు?

Update: 2024-06-21 11:49 GMT

రేణుకాస్వామి మర్డర్ కేసులో నిజాలు ఒకొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విచారణలో పోలీసులు నిందితుల నుంచి వాస్తవాలను కక్కిస్తున్నారు. మొన్నటి వరకు ఈ హత్య కేసులో దర్శన్ అభిమానుల ప్రమేయం కూడా ఉందని భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు.ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు.

స్నేహితుడి నుంచి రూ. 40 లక్షలు తీసుకున్న దర్శన్..

అయితే హత్య కేసులో తనపేరు బయటకు రాకుండా ఉండేందుకు, సాక్ష్యాలను కప్పిపుచ్చడానికి దర్శన్ తన స్నేహితుడు మోహన్ రాజ్ నుండి ₹ 40 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దర్శన్ ఇంటి నుంచి ₹37.4 లక్షలు, అతని భార్యకు ఇచ్చిన ₹3 లక్షలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

'ఎలక్ట్రిక్ షాక్ టార్చ్' స్వాధీనం..

రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు మరో నిందితుడు ధన్‌రాజ్ చెప్పాడు. కరెంటు షాక్‌కు గురిచేశామని అంగీకరించడంతో 'ఎలక్ట్రిక్ షాక్ టార్చ్'ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దాన్ని ఎక్కడ కొన్నాడో నిందితుడు చెప్పలేదని పేర్కొన్నారు.

దొరకని రేణుకస్వామి సెల్‌ఫోన్..

‘‘సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో మరో నిందితుడు ప్రదోష్ ప్రధాన పాత్ర పోషించాడు. అతను మరో వ్యక్తిని నేరం జరిగిన చోటికి తీసుకెళ్లాడు. ఆ ఆ వ్యక్తి ఎవరనేది చెప్పడం లేదు. రేణుకాస్వామి సెల్ ఫోన్ ను విసిరేశానని ప్రదోష్ చెబుతున్నాడు. మరో నిందితుడు దాన్ని డ్రైనేజీలో పడేశామని చెబుతున్నాడు. దాని కోసం వెతుకుతున్నాం’’ అని పోలీసులు తెలిపారు.

గోల్డ్ చైన్, రింగ్ స్వాధీనం..

దర్శన్ ఫ్యాన్స్ క్లబ్‌ సభ్యుడైన రాఘవేంద్ర ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు.రూ. 4.40 లక్షల నగదుతో పాటు రేణుకాస్వామి బంగారు ఉంగరం, గొలుసును స్వాధీనం చేసుకున్నారు. బంగారు ఉంగరం, గొలుసును రేణుకాస్వామి తల్లి గుర్తుపట్టారు.

ఘటనా స్థలంలో లాఠీ, రక్తపు మరకలు..

దర్శన్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడని చెప్పి రేణుకస్వామిని రాఘవేంద్ర బెంగళూరులోని ఆర్‌ఆర్ నగర్‌లోని ఓ షెడ్‌కు తీసుకొచ్చాడని పోలీసులు చెబుతున్నారు. అందులోనే రేణుకస్వామిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని, ఘటనా స్థలం నుంచి లాఠీలు, చెక్క ముక్కలు, వాటర్ బాటిల్, రక్తపు మరకలు, సిసిటివి ఫుటేజీని స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారి చెప్పారు.

రేణుకాస్వామిని ఎందుకు హత్య చేశారు?

దర్శన్‌‌కు దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మితో పెళైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. మోడల్‌, బుల్లితెర, సినీ నటి అయిన పవిత్ర గౌడతో దర్శన్‌ కొన్నేళ్లుగా కలిసి ఉంటున్నారు. ఈ సంబంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో చిత్రదుర్గ జిల్లా కేంద్రానికి చెందిన రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని ఆమెకు అశ్లీల సందేశాల పంపాడు. దర్శన్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించినట్లు పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసింది. జూన్ 9న సుమనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ పక్కనే ఉన్న నీటి కాలువ దగ్గర రేణుకా స్వామి మృతదేహం లభ్యమైంది.

33 ఏళ్ల రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో ఛాలెంజింగ్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న దర్శన్‌, పవిత్ర గౌడ, ఆయన సహచరులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. సాక్ష్యాలు, ఆధారాల కోసం కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News