నర్మదా నదీ కాలువలపై వంతెనలు మూసివేత
గంభీర వంతెన కూలిపోయిన తరువాత అలర్ట్ అయిన గుజరాత్ ప్రభుత్వం;
By : The Federal
Update: 2025-07-16 12:36 GMT
గంభీర వంతెన కూలిపోయిన తరువాత గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రమాదకర వంతెనలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా నర్మదా నదీ కాలువలపై ఉన్న ఐదు వంతెనలు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రకటించి వాటిని మూసివేసింది. తనిఖీల అనంతరం వీటిని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
36 వంతెనలకు మరమ్మతులు
కాల్వ నెట్ వర్క్ లోని మరో నాలుగు వంతెనలపై భారీ వాహనాలు తిరగకుండా నిషేధం విధించారు. మరమ్మతులు చేస్తున్న 36 వంతెనలపై కూడా భారీ స్థాయిలో వాహనాలు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ విషయంపై సంబంధిత జిల్లా యంత్రాంగానికి సూచనలు ఇచ్చామని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వివిధ రోడ్లు, వంతెనల మరమ్మతు, నిర్వహణ పనులు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని అది తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని విశాలమైన నర్మదా కాల్వ నెట్వర్క్ పై ఉన్న వివిధ వంతెనల సాంకేతిక తనిఖీని కూడా నిర్వహించిందని తెలిపింది.
రెండు వేల వంతెనలు హైవేలు..
సర్థార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ ప్రకారం.. ఈ కాల్వ నెట్ వర్క్ గుండా వెళ్తున్న జాతీయ, రాష్ట్ర రహదారులను గ్రామ రహదారులను కలుపుతూ దాదాపు 9,110 వంతెనలు ఉన్నాయి.
ఈ వంతెనల ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి, ఈ నిర్మాణాల జీవితకాలాన్ని పొడిగించడానికి ఈ వంతెనలన్నింటిపై ఎస్ఎస్ఎన్ఎన్ఏల్ ఇటీవల సమగ్ర తనిఖీలు నిర్వహించిందని ప్రకటన తెలిపింది.
పూర్తిగా మూసివేసిన ఐదు వంతెనలలో రెండు మోర్బీ జిల్లాలలో ఉండగా, మూడు సురేంద్రనగర్ జిల్లాలో ఉన్నాయని అది తెలిపింది. నర్మదా కాల్వ నెట్ వర్క్ పై ఉన్న వంతెనలు లోడ్ మోసే వాహనాలు, పర్యావరణ కారకాల వల్ల నిరంతరం రిపేర్లకు కారణం అవుతున్నాయి.
ముఖ్యమంత్రి పటేల్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు, వంతెన మరమ్మతు పనులపై సమీక్ష నిర్వహించారు. నాణ్యత తనిఖీ చేయాలని, పౌరుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.