‘మహాయుతి‘ సర్కార్ లో లుకలుకలు.. అజిత్ పవార్ కూటమిలోనే ఉంటారా?

మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి సర్కార్ లో ముసలం పుట్టే సూచనలు కనిపిస్తున్నాయి. శివసేన కు చెందిన మంత్రి సావంత్ చేసిన వ్యాఖ్యాలతో ఎన్సీపీ( అజిత్ వర్గం) నేతలు

Update: 2024-08-31 07:25 GMT

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ‘మహాయుతి’ సర్కార్ లో లుకలుకలు బయటపడుతున్నాయి. శివసేన నాయకుడు ఆరోగ్యమంత్రి తానాజీ సావంత్ ను మంత్రివర్గం నుంచి తొలగించకపోతే తాము ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, మహాయుతి సర్కార్ కు అల్టిమేటం జారీ చేసింది.

కేబినెట్ సమావేశాల్లో ఎన్సీపీ మంత్రుల పక్కన కూర్చున్న తరువాత బయటకు వచ్చి వాంతి చేసుకున్నట్లు తానాజీ వ్యాఖ్యాలు చేయడంతో ఎన్సీపీ ఈ హెచ్చరిక చేసింది. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో సావంత్ మాట్లాడుతూ, తాను హార్డ్‌కోర్ శివసైనికుడని, ఎన్‌సీపీ నేతలతో ఎప్పుడూ సఖ్యతగా ఉండలేదన్నారు. "మేము క్యాబినెట్‌లో ఒకరి పక్కన ఒకరం కూర్చుంటాం, అయితే బయటకు వచ్చిన తర్వాత నాకు వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది" సావంత్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై ఎన్సీపీ భగ్గుమంది. ‘‘ అతను ఉంటే మేము మంత్రివర్గంలో ఉండబోము. మా జాతీయ అధ్యక్షుడు అజిత్ పవార్, మా సీనియర్ నాయకులందరిని మంత్రివర్గం నుంచి వైదొలగాలని అభ్యర్థిస్తున్నాను ” అని ఎన్‌సిపి అధికార ప్రతినిధి ఉమేష్ పాటిల్ శుక్రవారం పేర్కొన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. సావంత్‌ను తొలగించే వరకు ఎలాంటి క్యాబినెట్ సమావేశానికి హాజరుకావద్దని ఎన్‌సిపి నాయకుడు అజిత్ పవార్‌ను కోరారు.
క్షమాపణలను అంగీకరించం: ఎన్సీపీ
“సావంత్‌ను తొలగించే వరకు మన మంత్రులు కూడా కేబినెట్ సమావేశాలను బహిష్కరించాలి. సావంత్ క్షమాపణలు చెప్పడాన్ని లేదా తప్పుగా అర్థం చేసుకున్నట్లు చేసిన ప్రకటనను మేము అంగీకరించము. ” అధికారి ప్రతినిధి అన్నారు. మహయుతి ప్రభుత్వం లో ఉండాల్సిన వ్యక్తి ఈయన కాదు అని వ్యాఖ్యానించారు.
NCP లెజిస్లేటివ్ కౌన్సిల్ (MLC) సభ్యుడు అమోల్ మిత్కారీ కూడా సావంత్ వ్యాఖ్యను తప్పుబట్టారు. పొత్తు చెక్కుచెదరకుండా ఉంచే బాధ్యత అతని పార్టీకి ఉందని, అది మా బాధ్యత కాదని చెప్పారు.
సావంత్ గతంలో ఎన్సీపీని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. సంకీర్ణ ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే మేం మౌనంగా ఉన్నాం. ఆయన వికారాలకు ముఖ్యమంత్రి మాత్రమే చికిత్స చేయగలడు అని మరో ఎన్సీపీ నేత వ్యాఖ్యానించారు.
అజిత్ బయటకి రాబోతున్నారా?
బిజెపి, శివసేన (షిండే వర్గం), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపితో కూడిన మహాయుతి కూటమిలో చీలిక గురించి నివేదికలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అజిత్ పవార్ ను ఉద్దేశపూర్వకంగా పక్కకు పంపుతున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి.
ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలిక విభాగం కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. అప్పటి నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగింది. ఆర్ఎస్ఎస్ కూడా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్సీపీ వల్లే సీట్లు తగ్గాయని నిందించింది.
ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని ఇంతకుముందే అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యల్లో స్పష్టమైంది. సింధు దుర్గ్ లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కుప్పకూలడంతో ఆయన స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్సీపీ మౌన ప్రదర్శనలు నిర్వహించింది.
అతని పార్టీని తరిమికొట్టండి: శరద్ పవార్ వర్గం
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి (ఎస్‌పి) సావంత్ వ్యాఖ్యను తప్పుబట్టింది, బిజెపి అజిత్ పార్టీని మహాయుతి నుంచి తరిమికొట్టే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించింది. అజిత్ పవార్ "నిద్ర లేచి కాఫీ వాసన చూసే సమయం కూడా ఇదే" అని ప్రత్యర్థి NCP వర్గం పేర్కొంది.
ఎన్సీపీ (ఎస్పీ) అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మాట్లాడుతూ.. మహాయుతికి ఎన్సీపీ అవసరం లేదని సావంత్ చేసిన వ్యాఖ్య తెలియజేస్తోందని అన్నారు. “అజిత్ పవార్‌తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఆర్‌ఎస్‌ఎస్ మౌత్‌పీస్ బిజెపిని ప్రశ్నించింది. బీజేపీ క్యాడర్ కూడా అదే ప్రశ్న వేస్తోంది'' అని అన్నారు.
ఇప్పుడు, షిండే సేన నాయకులు “ఎన్‌సిపి నాయకుల పక్కన కూర్చుంటే వికారంగా అనిపించడం” వంటి అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారని క్రాస్టో అన్నారు. “బీజేపీ నెమ్మదిగా అజిత్ పవార్‌ను మహాయుతి సర్కార్ నుంచి తరిమికొట్టే సమయం ఆసన్నమైంది.అక్కడ ఉన్న పగుళ్లు రోజురోజుకీ పెరిగి పెద్దవవుతున్నాయి.” అని క్రాస్టో అన్నారు.
అజిత్ ఆత్మగౌరవం కోల్పోయాడు: తపసే
అజిత్ తన ఆత్మగౌరవాన్ని కోల్పోయారని, ఎన్‌సిపితో పొత్తుపై షిండే నేతృత్వంలోని సేన శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతోందని మరో ఎన్‌సిపి (ఎస్‌పి) ప్రతినిధి మహేష్ తపసే పేర్కొన్నారు.
"ఒకప్పుడు ఎన్‌సిపిలో అపారమైన గౌరవాన్ని పొందిన అజిత్ దాదా అధికారం కోసం తన ఆత్మగౌరవాన్ని పణంగా పెడతాడని నేను ఎప్పుడూ ఊహించలేదు" అని తపసే అన్నారు. అజిత్ పవార్‌ను ప్రభుత్వంలో చేర్చుకోవడంపై షిండే సేన సభ్యులలో పెరుగుతున్న అసౌకర్యం ఇప్పుడు సావంత్ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా బయటపడిందని తపసే చెప్పారు.
"మంత్రి తానాజీ సావంత్ ప్రకటన అజిత్ దాదా రాజకీయ స్థితిని ఏంటో తెలియజేసింది, అయినప్పటికీ, అతని స్వంత పార్టీ సభ్యులు మౌనంగా ఉన్నారు" అని ఆయన అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీపీకి 25 సీట్లు కూడా రాకపోవచ్చు, ఈ నిరాశే ఇలాంటి అవమానకర మాటలకు దారితీసిందని తపసే పేర్కొన్నారు.
శరద్ పవార్ స్థాపించిన NCP జూలై 2023లో చీలిపోయింది, అజిత్ పవార్, ఆయనకు విధేయులైన ఎమ్మెల్యేలు మహాయుతిలో చేరడానికి విడిపోయారు. తదనంతరం, అజిత్ పవార్ వర్గానికి పార్టీ పేరు, దాని గడియారం గుర్తు వచ్చింది. విడిపోయిన నాటి నుంచి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు.
Tags:    

Similar News