మహరాష్ట్ర: శివసేన నేతపై చర్య తీసుకోవాలి, లేదంటే..
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివసేన నాయకుడు విజయ్ శివ్ తారేపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
By : The Federal
Update: 2024-03-26 09:21 GMT
లోక్ సభ ఎన్నికల ముందు ఎన్డీఏలో లుకలుకలు మొదలయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలు చీల్చి అధికారం చేపట్టిన బీజేపీకి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నాయకుడు విజయ్ శివ్ తారేను వెంటను పార్టీ నుంచి బహిష్కరించాలని లేకపోతే కూటమి తప్పుకుంటామని ఎన్సీపీ ప్రకటించింది.
ఎన్సీపీ అధికార ప్రతినిధి ఉమేష్ పాటిల్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, మంగళవారం పార్టీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అజిత్ పవార్‌పై శివతారే వాడిన భాష హీనమైనదని, ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరూ సహించరని అన్నారు. అయితే ఎన్నికల సమయం కావడంతో శివసేన అతడిపై చర్యలు తీసుకోవడంపై వెనకాడుతోంది. ఎందుకంటే శివతారే మాజీ మంత్రి, పురంధర ప్రాంతంపై అతడికి గట్టిపట్టుంది. అందుకే జంకుతోంది.
మరోవైపు, అజిత్ పవార్‌పై తాను చేసిన వ్యాఖ్యకు క్షమాపణ చెప్పబోనని, శివతారే అన్నారు. తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు ఉపయోగించలేదని తనని తాను సమర్ధించుకున్నారు. ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాల చర్చలు కొనసాగుతుండగానే శివతారే బారామతి స్థానం నుంచి తాను పోటీ చేస్తామని ప్రకటించారు.
తన అభ్యర్థిత్వాన్ని ఏకపక్షంగా ప్రకటించడంపై ఎన్‌సిపి అజిత్ పవార్ వర్గం కూడా విసిగిపోయింది. శరద్ పవార్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలేపై అజిత్ పవార్ భార్య సునేత్రను పోటీకి దింపేందుకు అజిత్ నేతృత్వంలోని ఎన్‌సిపి ఆసక్తిగా ఉన్నప్పటికీ ఇది జరిగింది. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న శివతారే, బారామతిపై పవార్‌ల ఆధిపత్యానికి స్వస్తి పలకాలని కోరుకుంటున్నానని, అందుకే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నానని చెప్పారు.