‘రేడియో విశ్వాస్ 90.8’ఏంటా విజయగాథ!

కాలంతో పోటీపడలేక మెల్లగా కనుమరుగైనా రేడియో.. లాక్ డౌన్ సమయంలో విద్యార్థులకు ఏవిధంగా సాయం చేసింది. ప్రజల మన్ననలు ఎలా అందుకుంది.. విజయగాథ వివరాలు ఫెడరల్ పాఠకులకు

Producer :  Chepyala Praveen
Update: 2024-01-01 09:27 GMT
ఫోటోలు క్రెడిట్ పీఐబీ

కరోనా కాలంలో సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని కష్టాలు అనుభవించారో మాటల్లో చెప్పలేం. ఏం చేయాలో తెలియక ఇంట్లోనే ఉండి నరకం అనుభవించారు. నగరాలు, పల్లెలు అనే తేడా తెలియకుండా లాక్ డౌన్ లో కాలం గడిపారు. కొంతకాలం తరువాత పరిస్థితులు కాస్త కుదుటపడ్దాయి. కానీ బడికి వెళ్లే పిల్లల పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా మారింది. తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపడానికే ఒప్పుకోలేదు. బడి అనే మాట ఎత్తడానికి ఇష్టపడలేదు.

అసలు చదువు అనే మాటనే పిల్లలు మర్చిపోయారు. కొన్ని రోజుల తరవాత ఆన్ లైన్ క్లాసులు అంటూ కార్పొరేట్ స్కూల్లు ప్రారంభించిన అది అందని ద్రాక్షగా మారింది. బస్తీలు, పల్లెల్లో ఉన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఖరీదైన వ్యవహరం కావడంతో ఆ చదువులన్నీ అటకెక్కాయి. ఇదీ దేశంలోని ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమయిన అంశం కాదు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు సైతం తమ వంతు ప్రయత్నాలు చేశాయి. కానీ అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని చెప్పవచ్చు. కానీ మహరాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గల రేడియో మాత్రం వినూత్నంగా ఆలోచించి, పిల్లల చదువుకు ఓ పరిష్కారమార్గాన్ని కనుగొని విజయవంతమయింది. అదే ‘రేడియో విశ్వాస్ 90.8’

రేడియో విశ్వాస్ 90.8 ఓ కమ్యూనిటీ రేడియోని మహారాష్ట్ర నాసిక్ లోని  విశ్వాస్ ధ్యాన్ ప్రబొధిని అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభించింది . స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయలేని పిల్లలకు విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థులను డిజిటల్ మాధ్యమం లేకుండానే అవసరమైన పాఠాలు బోధించి దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులచే ప్రశంసలు పొందింది. దీనిని ధ్యాన్ ప్రబోధిని అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ అనే సంస్థ నిర్వహించింది.



 


జెడ్పీ పాఠశాలలతో పాటు నాసిక్ మున్సిపల్ పాఠశాలలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదువుకుంటున్న విద్యార్థులకు ఉచిత విద్యను అందించింది. ఈ ప్రాంతంలోనే దాదాపు 60,000 వేల మంది విద్యార్థులకు విద్యాదానం చేసింది. సామాజిక రేడియో ద్వారా ప్రతిరోజు 14 గంటల పాటు పాఠాలు బోధించింది. ఈ పాఠాలన్నీమరాఠీ, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం వంటి వివిధ బాషలలో ఉండేలా ప్రణాళికలు రచించింది. దాదాపు 150 మంది అధ్యాపకులచే పాఠాలు స్టూడియోలో రికార్డు చేయించి, తరువాత ప్రసారం చేసేది. కనీసం టీవీ కూడా లేని పేదలకు ఇది ఎంతో మేలు చేసిందని తరవాత చేసిన కొన్ని సర్వేలు తేల్చాయి. దీనిని సులువుగా అందరూ ఆక్సెస్ చేసేలా రూపొందించడం వలన చాలా మంది విద్యార్థులు సులువుగా పాఠాలు వినగలిగారు.

ప్రభుత్వం తయారు చేసిన సిలబస్ లోనే ఒక్క పాఠం కూడా మిస్ కాకుండా రికార్డు చేసి ప్రసారం చేశారు. రేడియోలు సైతం లేని ప్రాంతాల్లో ఉపాధ్యాయులే విద్యార్థులకు యూఎస్బీ, బ్లూటూత్, హై ఎండ్ స్పీకర్ లతో కూడిన 451 ఎం పరికరాలను సైతం పంపిణీ చేశారు. వీటిని మొదట విశ్వాస్ రేడియో వారు ఉపాధ్యాయులకు అందించారు. తరువాత బస్తీ, పల్లెల్లోని పిల్లలకు చేరాయి. ఈ పాఠాలన్నీ కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి సైతం విశ్వాస్ రేడియో ప్రయత్నాలు ప్రారంభించింది. పాఠశాలలు పున: ప్రారంభమైన తరువాత కూడా విద్యార్థులు పాఠాలు అర్థం కావడానికి ఉపయోగపడతాయని రేడియో నిర్వాహకులు ఆలోచించారు.

టైం టేబుల్ ప్రకారం పాఠాలు

విద్యార్థులకు పాఠశాలలో మాదిరిగానే ముందుగానే ఓ టైం టేబుల్ ఇచ్చి, వాటి ప్రకారమే రోజు వారిగా పాఠాలు బోధించేవారు. పిల్లలు సైతం శ్రద్ధగా పాఠాలు నోట్స్ గా రాసుకునేవారు. స్మార్ట్ ఫోన్ లేని పిల్లలకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. దాంతో మహరాష్ట్ర మొత్తం ఈ విధానం అమలు చేయాలని డిమాండ్లు సైతం వచ్చాయి. అందుకు అనుగుణంగానే ఆరు ఇతర రేడియో స్టేషన్ల సహాయంతో విద్యార్థులకు పాఠాలు బోధించే కార్యక్రమం అమలు జరిగింది. విశ్వాస్ రేడియో స్టేషన్ ప్రారంభమైన పది సంవత్సరాలలో దాదాపు 3 లక్షల మంది విద్యార్ధులు, శ్రోతలకు చేరువైంది. నాసిన్ చుట్టుపక్కలా ఉన్న 10-15 కిలోమీటర్ల పరిధిలో తన ప్రాభావాన్ని పెంచుకుంది. సీనియర్ సిటిజేన్ సమస్యలు, కిచెన్ పాఠాలు, ఇష్టమైన ఉపన్యాసాలు, టాక్ షోలు, ఇష్టమైన సంగీతం ఇలా రంగం ఏదైనా తనదైన ముద్ర వేసింది. అలా కరోనా కాలంలో ప్రజలకు తన వంతుగా సాయమందించింది.

ఈ కష్టాన్ని భారత ప్రభుత్వం సైతం గుర్తించింది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అందరికి విద్య అనే విభాగంలో రెండో అవార్డు, కొనసాగించే( సస్టైనబుల్) మోడల్ అవార్డ్ లో మొదటి బహుమతి అందించింది. పీఐబీ సైతం సామాజిక రేడియో కార్యక్రమాన్ని ప్రశంసించింది. మనసుంటే మార్గం ఉంటుందనే ఓ సామెతను విశ్వాస్ రేడియో ప్రాక్టికల్ గా చేసి నిరూపించింది. ఎంతో మంది విద్యార్థులు స్మార్ట్ ఫోన్ పట్టుకుని సిగ్నల్ కోసం చెట్లు పుట్టులు పట్టుకుని తిరిగిన వార్తలు మనం ఎన్నోసార్లు చూసి ఉంటాం. కానీ అవి లేని పిల్లలను సైతం మెయిన్ స్ట్రీమ్ విద్యారంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి విశ్వాసం పొందింది.. ఈ ‘విశ్వాస్ రేడియో 90.8’

Tags:    

Similar News