నేడే అంబానీ ఇంట పెళ్ళి: మొత్తం ఖర్చు రు.5 వేలకోట్లని అంచనా!

దాదాపు సంవత్సరమున్నర నుంచి సాగుతున్న అనంత్ అంబానీ పెళ్ళి వేడుకులు తుది దశకు చేరుకున్నాయి.

Update: 2024-07-31 07:18 GMT

నేడే అనంత్ అంబానీ పెళ్ళి: అతిథులకోసం 100 ప్రైవేట్ విమానాలు, మూడు జెట్‌లు

దాదాపు సంవత్సరమున్నర నుంచి సాగుతున్న అనంత్ అంబానీ పెళ్ళి వేడుకులు తుది దశకు చేరుకున్నాయి. ఈరోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు శుభముహూర్తంలో వధూవరులు ఒక్కటవబోతున్నారు.

ఆకాశమంత పందిరి, భూదేవంత పీటలు వేసి… అంటూ కవులు, రచయితలు చేసే వర్ణనలకు సరితూగేటంత మహావైభవంగా అంబానీవారి ఇంట పెళ్ళి వేడుకలు జరగబోతున్నాయి. ముకేష్ అంబానీ ఆస్తి సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆయన ర్యాంక్ పది కాగా, ఆసియాలో మొదటి స్థానంలో ఉంది. ఆయన సంపదకు సరితూగే స్థాయిలోనే వివాహ వేడుకలను జరుపుతున్నారు. ఈ మొత్తం వేడుకలకు అంబానీ కుటుంబం సుమారు ఐదువేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఒక అంచనా. ఇటీవల సంగీత్‌లో పాల్గొన్నందుకు ఇంటర్నేషనల్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌కు రు.80 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. గత సంవత్సరమున్నరగా ఈ వేడుకలలో బీబర్ కాకుండా రిహానా, బ్యాక్ స్ట్రీట్ బాయ్స్, కేటీ పెర్రీ, ఆండ్రియా బొసెల్లీ, దిల్జిత్ దొసాన్జ్ వంటి అంతర్జాతీయ సింగర్‌లు ప్రదర్శనలు ఇచ్చారు. ఇవాళ, రేపు జరిగే వేడుకలలో నైజీరియన్ ర్యాపర్, కామ్ డౌన్ ఫేమ్ సింగర్ రేమా, మరో పాప్ సింగర్ అడెల్ ప్రదర్శన ఇవ్వబోతున్నారు.

వివాహ వేడుకలకు అమెరికానుంచి కిమ్ కర్దషియాన్, ఖోల్ కర్దషియాన్, ప్రియాంకచోప్రా, నిక్ జొనాస్, డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సేనా, షారుక్, సల్మాన్, అమితాబ్, దీపిక వంటి బాలీవుడ్ ప్రముఖులు, సచిన్ వంటి క్రీడాప్రముఖులు, మహేష్, పవన్ వంటి టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

పెళ్ళి కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించటంతోపాటు, ఎక్కడా ఎలాంటి తేడారాకుండా సాఫీగా సాగిపోయేలా, అతిథులకు ఇది మరిచిపోలేని తీపి జ్ఞాపకంలా మిగిలిపోయేందుకుగానూ ప్రతి చిన్న విషయంపై రిలయెన్స్ ప్రతినిధులు అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లోనే అతిథులకు రెండున్నరవేల వంటకాలు వడ్డంచారు కనుక, పెళ్ళిలో ఇంకెన్ని వంటకాలు వడ్డిస్తారో అన్నది ఆసక్తిగా ఉంది. మరోవైపు, అతిథులకోసం రిలయెన్స్ కంపెనీ 100 ప్రైవేట్ విమానాలను, మూడు ఫాల్కన్ జెట్ విమానాలను ఉపయోగించబోతోందని తెలిసింది. అంతర్జాతీయ అతిథులను దేశంలోని పర్యాటక కేంద్రాలకు తీసుకెళ్ళటానికి ఈ విమానాలను వాడతారని చెబుతున్నారు. గత మార్చిలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రంకోసం అక్కడి ప్రభుత్వం ఆ విమానాశ్రయానికి పదిరోజులపాటు ఇంటర్నేషనల్ స్టేటస్ ఇచ్చింది.

వివాహ వేడుకలు బాంద్రా కర్లా కాంప్లెక్స్ అనే ప్రాంతంలో ఉన్న జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఈ మూడు రోజులూ ట్రాఫిక్ విషయంలో ప్రభుత్వాధికారులు అనేక డైవర్షన్‌లు, ఆంక్షలు విధించారు. మరోవైపు ముంబైలో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణశాఖ ఆరెంజ్ ఎలర్ట్ ప్రకటించటంతో రిలయెన్స్ అధికారులు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

వెడ్డింగ్ ఇండస్ట్రీకి అనంత్ అంబానీ పెళ్ళి ఒక బైబిల్ లాగా మారుతుందని ఆ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అయితే పెళ్ళి ఇంత మెగాస్థాయిలో జరపటంపై పలు విమర్శలు కూడా వినబడుతున్నాయి. కోట్లమంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉండే ఈ దేశంలో ఇంత భారీవ్యయంతో పెళ్ళి నిర్వహించటం పేదరికాన్ని అపహాస్యం చేయటమేనని విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News