బీఆర్ఎస్ - బీజేపీ: పొత్తా, విలీనమా?
రాజకీయాలలో శాశ్వత శత్రువులుగానీ, శాశ్వత మిత్రులుగానీ ఉండరనేది నానుడి.
రాజకీయాలలో శాశ్వత శత్రువులుగానీ, శాశ్వత మిత్రులుగానీ ఉండరనేది నానుడి. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అది మరోసారి నిజమయ్యేటట్లు అనిపిస్తోంది.
నిన్నటిదాకా భీకరంగా తిట్టుకున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేటట్లుగా ఉంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తుగానీ, బీజేపీలో బీఆర్ఎస్ విలీనంగానీ జరగబోతోందంటూ హైదరాబాద్‌లో, ఢిల్లీలో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. దానికి బలం చేకూర్చేవిధంగా నిన్న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వైస్ ఛైర్మన్ ధన్‌ఖడ్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు రాజ్యసభలో మొత్తం నలుగురు ఎంపీలు ఉన్నారు. వారు మాజీ అసెంబ్లీ స్పీకర్ సురేష్ రెడ్డి, పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర, హెటరో పార్థసారథిరెడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ దామోదర్ రావు. ఈ నలుగురూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులే కనుక ఈ ఎంపీల విలీన రాజకీయం ఆ పార్టీ హైకమాండ్‌కు తెలిసే జరుగుతోందని అంటున్నారు. మరోవైపు ఢిల్లీలోనే ఉన్న కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్-బీజేపీల మధ్య పొత్తు, విలీనం వార్తలను ఖండించకుండా మౌనంగా ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. పార్టీలోని కీలకనేత వినోద్ కుమార్‌ను కొందరు మీడియా ప్రతినిధులు ఈ వార్తలపై స్పందించినప్పుడు ఆయన పూర్తిగా కొట్టిపారేయకుండా, రాజకీయాలలో ఏదైనా సాధ్యమే అని నర్మగర్భంగా వ్యాఖ్యానించటంకూడా ఈ వార్తలకు బలం చేకూర్చినట్లవుతోంది.
బీఆర్ఎస్‌కు రాజ్యసభలో మొత్తం ఐదుగురు ఎంపీలు ఉండగా, కేశవరావు ఇటీవల రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళ్ళారు. లోక్‌సభలో కారు పార్టీకి ప్రాతినిధ్యం లేదు.
పొత్తు-విలీనాలలో ఏది జరిగినా తెలంగాణలో బీజేపీకి విన్-విన్ పరిస్థితే అవుతుంది. కానీ బీఆర్ఎస్‌కు మాత్రం ఏది జరిగినా వ్యతిరేకమే. ఎందుకంటే కూతురు బెయల్ కోసం పార్టీని పణంగా పెడుతున్నారనే విమర్శ తప్పక తలెత్తుతుంది. కేవలం కూతురు కోసమే తెలంగాణ గౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని తెలంగాణకు చెందిన సీనియర్ పాత్రికేయుడు రామ్మోహన్ అన్నారు.
ఒకవైపు బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని వార్తలు వస్తుండగా, రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనానికి సిద్ధమయ్యేలా ఉండటం వంటి పరిణామాలు కారుపార్టీ దయనీయస్థితిని అద్దం పడుతున్నాయి.