బీఎస్ఎన్ఎల్‌కు టాటా తోడ్పాటు: జియో, ఎయిర్‌టెల్‌లను నిలువరించగలదా ?

ఇటీవల జరిగిన రెండు పరిణామాలు చూస్తుంటే బీఎస్ఎన్ఎల్‌కు మళ్ళీ మంచి రాజులు వస్తున్నట్లు కనబడుతోంది.

Update: 2024-07-31 07:00 GMT

ఇటీవల జరిగిన రెండు పరిణామాలు చూస్తుంటే బీఎస్ఎన్ఎల్‌కు మళ్ళీ మంచి రాజులు వస్తున్నట్లు కనబడుతోంది. ఒకటేమో జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలపై కోపంతో వాటినుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారినవారి సంఖ్య పెరగటం. జియో, ఎయిర్‌టెల్ ఇటీవల తమ ప్లాన్‌ల రేట్లను భారీగా పెంచటంతో దేశవ్యాప్తంగా వినియోగదారులలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రేట్లను ముందు జియో పెంచింది, వెంటనే ఎయిర్‌టెల్ జియోను అనుసరించింది. దీనిపై మండిపడ్డ నెటిజన్లు బాయ్‌కాట్‌జియో అనే పదాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేశారు. బీఎస్ఎన్ఎల్ ఘర్ వాప్సీ అనే పదం కూడా ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియా పుణ్యమా అని బీఎస్ఎన్ఎల్‌ కొత్త కనెక్షన్ల సంఖ్య, జియో, ఎయిర్‌టెల్ నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారినవారి సంఖ్య బాగా పెరిగిపోయింది.

ఇక మరోవైపు, భారతదేశంలో వినియోగదారులలో మంచి విశ్వసనీయత ఉన్న టాటా కంపెనీతో 15,000 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకోవటం బీఎస్ఎన్ఎల్‌కు జరిగిన రెండో మంచి పరిణామం. ఈ ఒప్పందంలో భాగంగా రెండు కంపెనీలూ కలిసి దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులను అందించబోతున్నాయి. ముఖ్యంగా దేశంలోని వెయ్యి గ్రామాలకు ఈ 4 జీ సర్వీస్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ అందించబోతున్నారు. తద్వారా మారుమూల ప్రాంతాలలో నివశించేవారిని కూడా డిజిటల్ విప్లవంలో భాగం చేయబోతున్నారు. దీనికోసం టాటా కంపెనీ దేశంలోని 4 కీలక ప్రాంతాలలో డేటా సెంటర్‌లను ఏర్పాటు చేయబోతోంది. ఈ ఒప్పందం వాస్తవ రూపు దాలిస్తే, జియో, ఎయిర్‌టెల్‌ల ఆధిపత్యానికి గండి పడినట్లు అవుతుంది, ఈ రెండు కంపెనీలతో విసుగెత్తపోయిన వినియోగదారులకు కాస్త ఊరట కలుగుతుంది.

Tags:    

Similar News