గేటెడ్ కమ్యూనిటీ వర్సెస్ స్టాండ్ ఎలోన్ అపార్ట్‌మెంట్: ఏది బెటర్?

Update: 2024-10-01 10:59 GMT

ఏది బెటర్?

ఎవరైనా ఒక ఇల్లు కొనేటప్పడు పరిగణించే ప్రాథమిక అంశాలు - బడ్జెట్, లొకేషన్. ఇవి కాకుండా మన మైండ్‌సెట్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే దీనికి సమాధానం వస్తుంది. డబ్బు ఎక్కువైనా ఫరవాలేదు సకల సదుపాయాలూ ఒక్కచోటే అందుబాటులో ఉండాలి అనుకుంటే గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీలలోని డాబు, దర్పం, హంగూ, ఆర్భాటం అవసరంలేదు, మధ్యతరగతిలాగే ఉంటాను, అందరితో తేలిగ్గా adjust అవగలను అనుకుంటే స్టాండ్ ఎలోన్.

ఇప్పుడు ఆదాయాలు పెరిగాయి, ఖర్చు చేసే సామర్థ్యం కూడా పెరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తుంటే - లైఫ్‌స్టైల్‌పై రాజీపడటంలేదు. హైఫైగా ఉండాలనుకుంటున్నారు. అలాంటివారు గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కోవచ్చు.

గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలంటే, ఆ స్థాయిని మెయింటెయిన్ చేయాలంటే మీకు ఆ స్థాయిలోనే ఆదాయం వస్తూ ఉండాలి. ఎప్పుడైనా మీ ఆదాయం తగ్గిందంటే కష్టమైపోతుంది. పీర్ ప్రెషర్ ఉంటుంది. మీ కారు మారుతి స్విఫ్టో, డిజైరో అయ్యి, పక్క ఫ్లాట్ వాళ్ళు బెంజ్‌ కొన్నారనుకోండి, మీకు లోలోపల అసంతృప్తి పెరిగిపోతుంటుంది.

మన ఆలోచనలతో కలిసేవారు పొరుగుగా దొరికి, కనస్ట్రక్షన్ క్వాలిటీ బాగుండి, భవనం చుట్టూ సెట్ బ్యాక్‌లు బాగానే ఉండి, సెక్యూరిటీ ఉండేటట్లయితే స్టాండ్ ఎలోన్ అపార్ట్‌మెంట్ కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ మన పొరుగు ఫ్లాట్‌లోనివారు వేరేవాళ్ళు ఉన్నా, వారిని కూడా మన బంధువులుగానో, స్నేహితులుగానో పరిగణించుకుంటేనే సంబంధాలు బాగుంటాయి. అప్పుడు మన అపార్ట్‌మెంట్ ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉంటుంది. మన రక్తసంబంధీకులు, కుటుంబసభ్యులు ఎంతో దూరంగా ఉంటే అత్యవసర పరిస్థితుల్లో వారితో ఉపయోగం ఉండదు కాబట్టి, చుట్టుపక్కల ఉండేవారినే చుట్టాలులాగా అనుకుంటూ అందరితో మంచిగా ఉండగలగాలి.

మన అన్నదమ్ములో, అక్కచెల్లెళ్ళో, బంధువులో అందరూ కలిసి ఒక స్థలం కొనుక్కుని అపార్ట్‌మెంట్ కట్టించుకుంటే దానికి మించినది మరొకటి ఉండదు. అయితే అలా కట్టించుకునే తీరిక, సమర్థత అందరికీ ఉండవు.

స్టాండ్ ఎలోన్ అపార్ట్‌మెంట్‌లో సదుపాయాలు పెంచుకుంటే అది కూడా గేటెడ్ కమ్యూనిటీతో సమానంగా అవుతుంది. మెయింటెనెన్స్ పెంచుకుంటే సెక్యూరిటీ సిబ్బందిని పెట్టుకోవచ్చు, సీసీ టీవీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు.

కొసమెరుపు: గేటెడ్ కమ్యూనిటీపై మంచి జోకులు కూడా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అక్కడ ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత ఉద్యోగం పోతే, ఆ కమ్యూనిటీలోనే వాచ్‌మ్యాన్‌గానో, చాకలిగానో, క్లీనర్‌గానో వేర్వేరు ఉద్యోగాలు రెడీమేడ్‌గా దొరుకుతాయి అంటున్నారు.

Tags:    

Similar News