ఈ సినిమా ఎందుకంత పాపులర్ అయింది...

"ట్వల్త్ ఫెయిల్" (12th fail) అనే ఒక చిన్న సినిమా. కాని ఒక భారీ సినిమాతో పోటీ పడి ఐదు అవార్డులు సాధించడం తో చాలా పెద్ద సినిమా అయి కూర్చుంది.వివరాలు

Update: 2024-02-03 14:59 GMT

- సిఎస్ సలీమ్ బాషా


చాలా కాలం తర్వాత "ట్వల్త్ ఫెయిల్" (12th fail) అనే ఒక చిన్న సినిమా, భారతదేశంలో ఒకానొక ప్రతిష్టాత్మక అవార్డ్స్ అయిన ఫిలింఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రం అవార్డు సాధించింది. ఇంతవరకు కేవలం పాపులర్ అయిన సినిమాలకే ఎక్కువ అవార్డులు వచ్చేవి. కానీ ఈసారి వేయి కోట్ల వైపు దూసుకుపోతున్న యానిమల్ సినిమాతో పోటీపడి "ట్వెల్త్ ఫెయిల్" ఉత్తమ చిత్రంతోపాటు, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నటుడు (క్రిటిక్ అవార్డు) అవార్డులు సాధించడం విశేషం.

ప్రతిసారి ఏదో ఒక వివాదంలో ఉంటున్న ఫిలింఫేర్ అవార్డ్స్ ఈసారి కూడా కొన్ని విమర్శలు కూడగట్టుకుంది. ఉత్తమ నటుడిగా 12th ఫెయిల్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ మాసే కు అవార్డు రాకపోవడం, పైగా యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్ కు ఉత్తమ నటుడి అవార్డు రావడం విమర్శలకు గురైంది. అయితే ఎవరూ ఊహించని విధంగా 12th ఫెయిల్ సినిమా, ఒక భారీ సినిమాతో పోటీగా ఐదు అవార్డులు సాధించడం తో అందరి దృష్టి ఈ చిన్న సినిమాపై పడింది.


"ట్వల్త్ ఫెయిల్" సినిమా ఒక బయోపిక్. ప్రస్తుతం ముంబై పోలీసు శాఖలో ఉన్నత స్థాయిలో ఉన్న మనోజ్ శర్మ జీవితం పై ఆధారపడి తీసిన సినిమా. ఈ సినిమా బయోపిక్ కాబట్టి కథ గురించి పెద్దగా చెప్పాల్సింది ఏమీ ఉండదు.మధ్యప్రదేశ్ లోని చంబల్ లోయలో ఉన్న ఒక మునిసిపల్ శాఖ చిరుద్యోగి కుమారుడు మనోజ్ శర్మ. ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొని, చివరికి నాలుగో ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ లో 121 ర్యాంకు సంపాదించడం ఈ సినిమా కథ.

మామూలుగానే బయోపిక్ అంటే ఎక్కువ సినిమాటిక్ లిబర్టిస్ తీసుకోవడం కష్టం. అలాగని యధాతధంగా సినిమా తీస్తే డాక్యుమెంటరీ గా మారిపోయి ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోవచ్చు. అయితే ఎంతో అనుభవం ఉన్న దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా ఈ రెండిటి మధ్య చక్కని సమన్వయం సాధించి, సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యేలా తీశాడు. గతంలో మున్నాభాయ్ ఎంబిబిఎస్, 3 ఇడియట్స్, పీకే సినిమాలకు నిర్మాతగా ఉన్న విధు వినోద్ చోప్రా, తన అనుభవాన్ని రంగరించి ఈ సినిమాను హిట్ సినిమాగా మలిచాడు. చాలా సన్నివేశాల్లో దర్శకుడి ప్రతిభ, చక్కగా రాసుకున్న స్క్రీన్ ప్లే కనపడతాయి. ఈ సినిమా రివ్యూ లలో కొంతమంది సినిమా ను మరి కొంత ఎడిట్ చేసి ఉంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు. కానీ సినిమా చూస్తే అలా అనిపించదు. ఏది మోతాదు మించకుండా పకడ్బందీగా తీయగలడమే ఈ సినిమాకు ఉన్న ప్రధాన బలం. ఒకటి రెండు చోట్ల ఈ సినిమాలో డైలాగులు ప్రేక్షకులను కదిలిస్తాయి,


మరికొన్ని చోట్ల సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. ముఖ్యంగా నాయనమ్మ చనిపోయినప్పుడు ఇంటికి వచ్చిన మనోజ్ శర్మ, ఆ విషయం తనకు తెలియకపోవడం గురించి వాళ్ళ అమ్మని, ఎందుకిలా అని అడిగినప్పుడు ఇద్దరు ఏడవడం చాలా సహజంగా ఉండి, ప్రేక్షకులు కూడా కొంత ఫీలవుతారు. ఈ సినిమా సక్సెస్ కావడంలో స్క్రీన్ ప్లే ప్రధాన పాత్ర వహించింది. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్, ఫలితాల కోసం UPSC సంస్థకు ఆశావహులు ఫలితాలకోసం పడే ఆరాటం, వాళ్ళ నిరాశలు, కన్నీళ్లు చక్కగా చిత్రీకరించాడు దర్శకుడు. UPSC ఇంటర్వ్యూ కూడా ఎక్కువ సినిమాటిక్ గా ఉండకపోవడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఈ సినిమాకు ప్రధాన బలం సన్నివేశాల్లో ఓవర్ డ్రామా లేకపోవడం.

20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన సినిమా దాదాపు 70 కోట్లు వసూలు చేయడం చిన్న విషయం ఏమి కాదు. ఈ సినిమా తెలుగులో(డబ్బింగ్) వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా నిరాశపరిచింది. కానీ హిందీ సినిమా ఓ స్థాయిలో విజయం సాధించింది. ఏమాత్రం హడావిడి లేకుండా నిశ్శబ్దంగా విజయపథంలో నడిచిన సినిమా గురించి చాలామందికి తెలియదు. అయితే డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కావడం వల్ల అక్కడ కూడా పాపులర్ అయ్యి, చాలామందికి తెలియడం జరిగింది.

ఉత్తమ చిత్రం గా నిలిచిందంటే సినిమా బాగున్నట్లే లెక్క. ఈ సినిమా దర్శకుడికి ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా వచ్చింది. అవార్డు వచ్చిన రాకపోయినా, దర్శకుడు మాత్రం మంచి సినిమా తీశాననిపించుకున్నాడు. ఈ సినిమా స్క్రీన్ ప్లే కి, ఎడిటింగ్ కి కూడా అవార్డులు వచ్చాయి.

అంతవరకు బాగానే ఉందిగానీ, ఈ సినిమాలో నటించిన విక్రమ్ మాసే నటన ముందు, యానిమల్ అనే ఒక పాపులర్, హిట్ సినిమా లో నటించిన రణ్ బీర్ కపూర్ నటన అంత బాగా లేదని క్రిటిక్స్ తో పాటు చాలామంది అభిప్రాయపడ్డారు. కాకపోతే విక్రమ్ మాసేకు కంటి తుడుపుగా క్రిటిక్స్ ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చారు, అని పలువురి అభిప్రాయం. ఇద్దరి నటనను కంపేర్ చేస్తే, విక్రమ్ మాసేకి ఎక్కువ మార్కులు పడతాయి. అయితే పాపులారిటీ దృష్ట్యా రణ్ బీర్ కపూర్ కి అవార్డు రావడం విక్రం మాసే తో పాటు, 12TH ఫెయిల్ సినిమా దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా ను కూడా నిరాశపరిచింది. మరోసారి ఫిలింఫేర్ అవార్డ్స్ ఎంపిక విధానం విమర్శలకు గురి అయింది.

మొత్తానికి 12TH ఫెయిల్ అనే ఒక చిన్న సినిమా, అనేక పెద్ద సినిమాలతో పోటీపడి, ఐదు అవార్డులు సాధించడం, ఇలాంటి మరి కొన్ని ఇన్స్పైరింగ్ కథలతో సినిమా తీయడానికి కొంతమందిని ఇన్స్పైర్ చేసే అవకాశం ఉంది. అలా అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించడం కూడా, కొద్దిమంది నిర్మాత లు, దర్శకులను ప్రభావితం చేయవచ్చు ఈ నేపథ్యంలో ఇలాంటి సినిమాలు స్క్రీన్ మీద, ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో ప్రేక్షకులు, వీక్షకులు, చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా భారీ స్థాయిలో విజయం సాధించకపోయినా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది


(*సిఎస్ సలీమ్ బాషా మూవీ క్రిటిక్, స్పోర్ట్స్ జర్నలిస్టు)


Tags:    

Similar News