సూరత్‌ ఇక ఇంటర్నేషనల్‌ ‘జెమ్‌’

ప్రపంచ వజ్రాల వ్యాపారంలో సూరత్‌ నగరం

Byline :  Amaraiah Akula
Update: 2023-12-18 13:37 GMT
సూరత్‌లోని ఇంటర్నేషనల్‌ జెమ్‌ సిటీ (కర్టసి వికీపీడియా)

సానపట్టిన వజ్రం విలువ ఎలా ఉంటుంది? మిలమిల మెరిసిపోతూ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు సూరత్‌ అలా మెరవబోతోంది. ప్రపంచ వజ్రాల వ్యాపారంలో సూరత్‌ నగరం కొత్త శోభను సంతరించుకోనుంది. సౌకర్యాలు సమకూర్చుకుని సరికొత్త శిఖరాలకు చేరుకుంది. ఇన్నాళ్లు ఇండియన్‌ జెమ్స్‌ సిటీగా గుర్తింపు పొందిన సూరత్‌.. ఇకపై వరల్డ్‌ జెమ్స్‌ కేపిటల్‌గా మారిపోయింది.. ఈ ఘనతకు కారణమైన ఒకే ఒక్క భవనం ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఆవిష్కరించిన ఈ వరల్డ్‌ జెమ్స్‌ కేపిటల్‌ బిల్డింగ్‌ పేరు సూరత్‌ డైమండ్‌ బోర్స్‌.. ముద్దుగా చెప్పాలంటే S.D.B... రానున్న కాలంలో దేశాన్ని ప్రపంచ మూడో ఆర్థిక శక్తిగా నిలిపేలా పడిన గొప్ప అడుగుగా దీన్ని అభివర్ణించారు ప్రధాని మోదీ.

90 శాతం వ్యాపారం సూరత్‌లోనే..
దేశంలో వజ్ర వ్యాపారంలో 90 శాతం పని సూరత్‌లోనే జరుగుతోంది. మిగిలిన పది శాతం కోసం ముంబై వెళ్లాల్సివుంటుంది. అయితే ఇకపై ఆ పదిశాతం పని కోసం ముంబై వెళ్లాల్సిన పని లేకుండా సూరత్‌ డైమండ్‌ బోర్స్‌ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ భవనాన్ని నిర్మించింది. పైగా ముంబైలో పెరిగిన ఖర్చులు.. భద్రతాపరమైన సమస్యలు ఉండటం.. ఈ భవనంలో సకల వసతులు ఒకేచోట లభిస్తుండటంతో నిర్మాణ దశలోనే షాపులు, కార్యాలయాలను కొనుగోలు చేసేశారు వజ్ర వ్యాపారులు.
ముంబై నుంచి సూరత్‌కి...
సూరత్‌ డైమండ్‌ బోర్స్‌ కార్యాలయం వల్ల ముంబైలో ఉన్న చాలా వజ్ర వ్యాపార సంస్థలు, ఇతర కార్యాలయాలు ఇకపై సూరత్‌ తరలివెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా ముంబైలో పెరిగిన ఖర్చులు వల్ల ఎక్కువ మంది సూరత్‌ పట్ల ఆకర్షితులు అవుతున్నట్లు చెబుతున్నారు. దేశంలో ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వ పన్ను ఒక్కటే.. కానీ, ముంబైలో పెరిగిన ఖర్చు, ద్రవ్యోల్బణం, ప్రయాణ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది వజ్ర వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాలను సూరత్‌కు మార్చడానికి డిసైడ్‌ అయిపోతున్నారు. ఇది సూరత్‌లో తయారీ, ముంబయిలో విక్రయించడం అనే బిజినెస్ ఫార్మాట్‌కు భిన్నంగా ఉండటంతో రాజకీయ వివాదంగా కూడా మారింది.
కుర్లా పెట్టింది పేరు...
ప్రస్తుతం ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో వజ్ర వ్యాపారం జరుగుతోంది. బీకేసీలో ఆస్తి రేట్లు, ఇతర ఖర్చులు సూరత్ కంటే 10 రెట్లు ఎక్కువ. ఈ డబ్బును ఆదా చేస్తే, మేం వినియోగదారులకు 2 నుంచి 5 శాతం తక్కువ ధరలకే వజ్రాలను అందజేయగలం.. దీని వల్ల చిన్న వ్యాపారులు ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉందని అంటున్నారు వజ్ర వ్యాపారంలో అనుభవజ్ఞులు. అంతేకాకుండా ముంబైలోని BKC కన్నా.. సూరత్‌లోని ఎస్‌డీబీలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే కారణంగా ముంబై వ్యాపారులు సూరత్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ముంబైలో ప్రపంచ స్థాయి డైమండ్ కాంప్లెక్స్
ప్రస్తుతం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 'భారత్ డైమండ్ బోర్స్' అనేది ముంబైలోని ప్రపంచ స్థాయి డైమండ్ కాంప్లెక్స్. ఇందులో 2,500 కార్యాలయాలు ఉన్నాయి. సుమారు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో 40 వేల మంది ఉండొచ్చు. కాగా, సూరత్ డైమండ్ బోర్స్ భవనంలో ఒకేసారి లక్ష మంది పనిచేసుకునే వెసులుబాటు ఉండటం.. ఖర్చు తక్కువయ్యే అవకాశం, ప్రయాణ చికాకులు తప్పుతాయనే కారణాలతో ముంబై నుంచి సూరత్‌ తరలిపోతోంది డైమండ్‌ వ్యాపారం.
9 రకాల వజ్రాలు సూరత్‌లోనే...
అంతేకాకుండా వజ్ర వ్యాపారం ముంబై నుంచి సూరత్‌కు తరలించడానికి ఇంకొన్ని కారణాలు చెబుతున్నారు వ్యాపారులు.. అవేమిటంటే.. సూరత్‌లో ఇప్పటికే చాలా ఎక్కువ సంఖ్యలో డైమండ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వజ్రాల ఉత్పత్తి అత్యధికంగా జరిగేదీ అక్కడే. ప్రపంచంలో 11 రకాల వజ్రాలలో 9 రకాల వజ్రాలు సూరత్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. వజ్రాల తయారీకి అవసరమైన ముడిసరుకూ సూరత్‌ నుంచే వస్తోంది. సూరత్ ఫ్యాక్టరీలలో తయారయ్యే వజ్రాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయటానికి మాత్రమే ముంబై, జైపూర్, ఢిల్లీ వెళ్లాల్సివుంటుంది. మిగిలిన నగరాలతో పోల్చితే సూరత్‌ ముంబైకి దగ్గరగా ఉండటం, కస్టమ్ హౌస్, అంతర్జాతీయ కనెక్టివిటీ ఇన్నాళ్లు ముంబైలో వజ్రాల వ్యాపారానికి తిరుగులేని స్థానం కల్పించింది.
Tags:    

Similar News