విజిలెన్స్ వారోత్సవాల్లో అక్రమాలు వెలుగు...రూ.50కోట్ల బియ్యం సీజ్

తెలంగాణ విజిలెన్స్ వారోత్సవంలో వెలుగులోకి వచ్చిన రేషన్ లీకేజీ

Update: 2025-11-06 03:05 GMT
తెలంగాణలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత (ఫైల్ ఫొటో)

తెలంగాణలో బీపీఎల్ కుటుంబాలకు పంపిణీ చేసేందుకు ఉద్ధేశించిన సన్నబియ్యం పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో తేలింది.తెలంగాణలో విజిలెన్స్‌‌‌‌ అవగాహన వారోత్సవాలు ఈ ఏడాది అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు నిర్వహించారు.ఈ విజిలెన్స్ వారోత్సవాల్లో తెలంగాణలో పక్కదారి పడుతున్న రూ.50 కోట్ల రేషన్ బియ్యాన్ని(pds rice) విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం(vigilance and enforcement) పట్టుకుందని ఆ విభాగం డైరెక్టర్ శిఖాగోయెల్ (director shika goel)వెల్లడించారు. పలు జిల్లాల్లోని రైస్ మిల్లర్ల వద్ద తనిఖీలు చేయగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారని దర్యాప్తులో తేలింది.


రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక
పౌరసరఫరాల శాఖ బీపీఎల్ కుటుంబాలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని కొందరు మధ్య దళారులు దారి మళ్లిస్తున్నారని విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. పీడీఎస్ బియ్యాన్ని కొందరు మిల్లర్లు లాభం కోసం నిల్వ చేశారని వెల్లడైంది. గుట్టుగా రేషన్ సన్న బియ్యాన్ని లారీల్లో తరలిస్తుండగా విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. దీనిపై విజిలెన్స్ విభాగం డైరెక్టరు శిఖా గోయెల్ రాస్ట్రప్రభుత్వానికి నివేదిక పంపించారు.

అక్రమ బియ్యం ఎక్కడ పట్టుకున్నారంటే...
సైబరాబాద్ పరిధిలోని కుట్కచర్ల వద్ద ముజాహిద్ పూర్ గ్రామంలో షెడ్ లో నిల్వ ఉంచిన 75 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2.7 లక్షల రూపాయలని అధికారులు చెప్పారు. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం జఫర్ గూడెం గ్రామంలో పీవీఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ వద్ద తనిఖీలు చేయగా రేషన్ బియ్యం దొరికింది. నల్గొండ జిల్లలా కాతేపల్లి మండలం ఉప్పలపహాడ్ గ్రామంలోని చాముండేశ్వరీ ఆగ్రో ఇండస్ట్రీస్ లో 1,39,671 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని పట్టుకున్నారు. దీని విలువ 298.88 కోట్లని అధికారులు చెప్పారు.

2025 నవంబరు 5 : హైదరాబాద్ నగర డీసీపీ సెంట్రల్ జోన్ బృందం ఖైరతాబాద్ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణ చేస్తుండగా పట్టుకుంది. ఖైరతాబాద్ బీజేఆర్ నగర్ ప్రాంతానికి చెందిన ముహ్మద్ అజార్ తన టీఎస్ 09 ఎఫ్ వీ 281 వాహనంపై రేషన్ బియ్యాన్ని తన సహచరుడు అబ్దుల్ రహమాన్ ఇంటికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రహమాన్ ఇంట్లో 1000 కిలోల రేషన్ బియ్యం 27 ప్లాస్టిక్ సంచుల్లో ఉన్నట్లు గుర్తించి అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

2025 అక్టోబరు 10 : సంగారెడ్డి జిల్లాలో 569 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెండు లారీల్లో దారి మళ్లిస్తుండగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీల రవాణాదారులు, డ్రైవర్లపై స్థానిక పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నిత్యావసర వస్తువుల చట్టం-1955లోని సెక్షన్ 6 ఎ కింద కేసులు నమోదు చేశారు. బాచుపల్లి, మియాపూర్ ఎక్స్ రోడ్డు పరిసర ప్రాంతాలలోని గండిమైసమ్మ క్రాస్ రోడ్ల వద్ద విజిలెన్స్ అధికారులు ఆకస్మిక రూట్ తనిఖీలు నిర్వహించి వాహనాలను పట్టుకున్నారు.

2025 అక్టోబరు 12 : జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమంగా నిల్వచేసిన 77 క్వింటాళ్ల రేషన్‌ బియాన్ని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు డీజీ శిఖాగోయెల్‌ చెప్పారు. హైదరాబాద్‌ సిటీ-2 యూనిట్‌కు చెందిన విజిలెన్స్‌ అధికారులు గద్వాల జిల్లా లీజా, గాజులపేటలో అక్రమంగా నిల్వ చేసిన 77 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఆమె పేర్కొన్నారు.

2025,ఫిబ్రవరి 14 : సివిల్ సప్లైస్ విజిలెన్స్ విభాగం,టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా చెన్నూర్ పట్టణంలో తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వెళుతున్న రెండు లారీలు, ఒక ట్రక్కు ద్వారా అక్రమంగా తరలిస్తున్న 615 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 11న సిర్పూర్ (టి) మండలంలోని హుడ్కిలి గ్రామంలోని అంతర్రాష్ట్ర చెక్-పోస్ట్ వద్ద పిడిఎస్ బియ్యం ధాన్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై 12 మందిని అరెస్టు చేశారు.

2025,జనవరి 29 : సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పీడీఎస్ బియ్యం స్మగ్లర్ల నుంచి సబ్-ఇన్స్పెక్టర్ సురేష్ నాగరాజు,కానిస్టేబుల్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు.

మహారాష్ట్రకు రేషన్ బియ్యం రవాణ
తెలంగాణ నుంచి అక్రమంగా తరలించిన పీడీఎస్ బియ్యం మహారాష్ట్రలో రీసైకిల్ చేసి రాష్ట్రానికి తిరిగి మిల్లర్లకు విక్రయిస్తున్నారని విజిలెన్స్ దర్యాప్తులో వెల్లడైంది.స్మగ్లర్లు, చౌక ధరల దుకాణాల డీలర్లు ఆహార భద్రతా పథకం లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసే మధ్యవర్తుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నారని దర్యాప్తులో తేలింది.రేషన్ బియ్యాన్ని తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సిరోంచ, విరూర్, పోడ్సా, మహారాష్ట్రలోని ఇతర పట్టణాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు.పీడీఎస్ బియ్యం ధాన్యాలను మళ్లించడంపై పెట్రోలింగ్ పెంచామని, డిఫాల్ట్ చేసిన రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని పౌర సరఫరాల అధికారులు చెప్పారు.

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం చేపట్టిన ఈ దర్యాప్తులో పౌరసరఫరా వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం అయ్యాయి. బీపీఎల్ కుటుంబాలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం కొంతమంది మిల్లర్లు, మధ్యవర్తులు లబ్ధి కోసం దారి మళ్లించారని తేలింది.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అక్రమ రవాణా, నిల్వలపై దృష్టి పెట్టి రేషన్ బియ్యం లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.


Tags:    

Similar News