బిజెపి ఎంపీ గోడం నగేశ్ ఇంటిని ముట్టడించిన బిఆర్ఎస్

పత్తి ఏడుక్వింటాళ్లకు పరిమితం చేయడంపై ఆందోళన

Update: 2025-11-05 10:48 GMT
BRS leader Jogu Ramanna arrested

పత్తి కొనుగోళ్ల విషయంలో కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ) విధించిన నియమ నిబంధనలు రైతులపాలిట శాపంగా మారాయని ఆరోపిస్తూ బిఆర్ఎస్ నాయకులు ఆదిలాబాద్ బిజెపి ఎంపి గోడం నగేశ్ ఇంటిని ముట్టడించారు. బుధవారం బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న తో పాటు పలువురు నేతలు ఎంపి ఇంట్లోకి జొరబడటానికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పత్తి కొనుగోళ్లను ఏడు క్వింటాళ్లకు పరిమితం చేస్తూ సిసిఐ ఉత్తర్వులు జారి చేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. ఇందులో భాగంగా బిజెపి ఎంపీ ఇంటిని బిఆర్ఎస్ నాయకులు ముట్టడించారు.


ఎకరానికి ఏడు క్వింటాళ్లకు పరిమితం


పత్తి కొనుగోళ్లను ఎకరానికి ఏడు క్వింటాళ్లకు పరిమితం చేస్తూ సీసీఐ జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్ర రైతుల పాలిట అశనిపాతంలా మారాయి. రాష్ట్రంలో వర్షా కాలం ఆరంభంలో వర్షాభావం, ఆ తర్వాత భారీ వర్షాలతో పత్తి రైతులు నానా అగచాట్లు పడ్డారు. మోంథా తుఫాను వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట మార్కెట్ లో అమ్ముడుపోయే పరిస్థితి లేదు. తేమ శాతం కారణంగా సిసిఐ పత్తి కొనుగోళ్లను ఆపేసింది. సిసిఐ గోదాములకు తీసుకొచ్చిన పత్తిని కొనుగోలు చేయడానికి అధికారులు ముందుకు రాకపోవడంతో రైతులు తిరిగి తీసుకెళ్లడం లేదు. అక్కడే ఆరబెట్టిన పత్తి వర్షాలకు ముద్దయ్యింది. మరోవైపు, ఈసారి సీసీఐ కొత్త నిబంధనలు విధించడంతో కొనుగోళ్లు మూడు వారాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. 188 కొనుగోలు కేంద్రాలు ఎట్టకేలకు గత నెల 22 నుంచి ప్రారంభమయ్యాయి. అప్పటికే వర్షాల భయంతో పలువురు రైతులు తక్కువ ధరకే విక్రయించారు. రైతులు ఇప్పుడిప్పుడే కేంద్రాలకు పత్తిని తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీఐ తీసుకున్న తాజా నిర్ణయం రైతులను ఆందోళన బాట పట్టించాయి.ఎకరానికి ఏడు క్వింటాళ్లకు పరిమితం చేస్తూ సిసిఐ ఉత్తర్వులు రైతులు రోడ్డెక్కారు.


45.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగు


రాష్ట్రంలో 45.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరాకు సగటున 11.74 క్వింటాళ్ల చొప్పున పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. దానికి అనుగుణంగా 12 క్వింటాళ్ల చొప్పున సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించింది. సోమవారం కొనుగోళ్ల పరిమితిని ఏడు క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్లు సిసిఐ ప్రకటించింది.రాష్ట్ర అధికారులకు సిసిఐ సమాచారమిచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పత్తి సాగు, సగటు దిగుబడిపై కేంద్ర ఆర్థిక, గణాంకశాఖ డైరెక్టరేట్‌ నివేదిక ఇచ్చింది. తెలంగాణలో ఈ సీజన్‌లో ఎకరాకు ఏడు టన్నుల దిగుబడి వస్తుందని తెలిపింది. అందుకే ఆమేరకే కొనుగోళ్లకు అనుమతించాం అని సిసిఐ పేర్కొంది.


నష్ట పోయిన చిన్న, సన్న కారు రైతులు


తెలంగాణలో 24.12 లక్షల మంది రైతులు పత్తి సాగు చేశారు. ఇందులో 70 శాతం మందికి పైగా చిన్నకారు, సన్నకారు రైతులే ఉన్నారు. ఎక్కువగా మూడెకరాల వరకు  చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఇప్పటివరకు ఈ రైతుల నుంచి రూ.119.89 కోట్ల విలువైన 15,229 టన్నుల పత్తిని మాత్రమే సిసిఐ కొనుగోలు చేసింది. సోమవారం వరకు 10,434 టన్నులు కొనుగోలు చేసిన సిసిఐ కొత్త నిబంధన ప్రకారం మంగళవారం నుంచి ఏడుక్వింటాళ్లకు మాత్రమే పరిమితం చేసింది. 4,795 టన్నుల పత్తి మాత్రమే సిసిఐ కొనుగోలు చేసినట్టు బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఏడు క్వింటాళ్ల చొప్పున మాత్రమే కొంటామని సీసీఐ అధికారులు ఖరా ఖండిగా చెప్పడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. తేమ శాతం తగ్గిన తర్వాత పత్తిని కొనుగోలు చేస్తామని సిసిఐ తెగేసి చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దీనికి తోడు ఈ నెల ఆరు నుంచి పత్తిని కొనుగోలు చేయమని మిల్లర్లు చెప్పడంతో పుండుమీద కారం చల్లినట్టయ్యింది.


Tags:    

Similar News