కుషాయిగూడలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడి
మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనమైంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ట్రాఫిక్ పోలీసుల తీరుతో మనస్థాపం చెంది సింగిరెడ్డి మీన్ రెడ్డి (32)ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడు దమ్మాయిగూడకు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో సింగిరెడ్డి మీన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న మీన్ రెడ్డి మంగళవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. అతన్ని పరీక్షిస్తే 120 పాయింట్లు రావడంతో కేసు నమోదైంది. మీన్ రెడ్డి ఎంత ప్రాధేయపడినప్పటికీ వదలకుండా అతనిపై కేసు నమోదు చేయడమే గాక ఆటోను సీజ్ చేశారు. రాత్రంతా కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులను బ్రతిమిలాడినప్పటికీ ఆటో ను ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుటే మీన్ రెడ్డి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలను ఆర్పడానికి స్థానికులు ప్రయత్నించినప్పటికీ మీన్ రెడ్డి 90 శాతం కాలినగాయాలతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మీన్ రెడ్డి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మల్కాజ్ గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.