బీజాపూర్ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి
భారీగా ఆయుధాలు స్వాధీనం
చత్తీస్ గడ్ బీజాపూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు.జిల్లాలోని తాళ్ల గూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. అన్నారం – మరిమల అడవుల్లో మావోయిస్టులు తలదాచుకున్నట్లు భధ్రతా బలగాలకు సమాచారం వచ్చింది. కూంబింగ్ చేస్తున్న బలగాలకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. భధ్రతాబలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. కొన్ని గంటలపాటు మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య కాల్పులు జరగడంతో ముగ్గురు మావోయిస్టులు నేలకొరిగారు. ఎన్ కౌంటర్ స్థలంలో ఆయుధాలు లభ్యమైనట్టు భధ్రతాబలగాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.
సుక్మా జిల్లాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనం
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు ఆయుధాలను తయారు చేసే ఫ్యాక్టరీని బలగాలు ధ్వంసం చేశాయి. జిల్లాలోని గోంగూడ-కంచాల అడవుల్లో మావోయిస్టుల కోసం ఆపరేషన్ చేపట్టిన బలగాలు ఓ రహస్య ప్రాంతంలో బెటాలియన్ నంబర్-1కు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతం నుంచి 17 రైఫిళ్లు, రాకెట్ లాంచర్లు, ఆయుధ తయారీ సామగ్రి, పరికరాలను స్వాధీనం చేసుకొని.. ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి. ఈ ఘటనను ఎస్పీ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు.