‘బాధితులకు కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు’ ?
బాధితులకు పరిహారం అందలేదన్న విషయమై ఈరోజు హైకోర్టులో కేసు విచారణ జరిగింది.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని పాశమైలారం సిగాచి కంపెనీ మృతులకు రు. కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని తెలంగాణ హైకోర్టు మంగళవారం యాజమాన్యాన్ని నిలదీసింది. బాధితులకు పరిహారం అందలేదన్న విషయమై ఈరోజు హైకోర్టులో కేసు విచారణ జరిగింది. పిటీషనర్ తరపున లాయర్ వసుధా నాగరాజు వాదనలు వినిపిస్తు సిగాచి ఫ్యాక్టరీ(Sigachi factory) పేలుడులో 54 మంది చనిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రమాదం జరిగి నాలుగు నెలలైనా ఇప్పటివరకు యాజమాన్యం ప్రకటించిన కోటి రూపాయల పరిహారం మాత్రం బాధిత కుటుంబాలకు అందలేదని చెప్పారు. అలాగే ప్రమాదానికి బాధ్యులుగా పోలీసులు ఎవరినీ అరెస్టు కూడా చేయలేదని వసుధ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఫ్యాక్టరీ ఉత్పత్తిలో యాజమాన్యం ఎన్నో ఉల్లంఘనలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలందని లాయర్ చెప్పారు.
తర్వాత అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ నిపుణుల కమిటీ రిపోర్టును విశ్లేషిస్తున్నట్లు ధర్మాసనంకు చెప్పారు. పరిహారం విషయమాన్ని కూడా చురుకుగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బాధిత కుటుంబాలకు తలా రు. 25 లక్షలు చెల్లించిన విషయాన్ని ధర్మాసనంకు వివరించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు 192 మంది ప్రత్యక్ష సాక్ష్యుల వాంగ్మూలాలను సేకరించారని, ప్రమాదంలో ఫ్యాక్టరి వైస్ ప్రెసిడెంట్ కూడా చనిపోయిన విషయాన్ని రజనీకాంత్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. బాధిత కుటుంబాలకు వీలైనంత తొందరగా మిగిలిన పరిహారాన్ని కూడా ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రెండు వారాల్లో సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలుచేయాలని ఏఏజీని ఆదేశించింది.