
వేమన్నను వెదికి వెలికి తీసిన మహనీయుడి జ్ఞాపకం
లక్ష పుస్తకాల విజ్ఞాన భాండాగారం: బ్రౌన్ గ్రంథాలయం
‘‘ఒక భాష నేర్చుకోవడం అంటే అక్షరాలు, పదాలు తెలుసుకుని, వాక్యాలు రాయడం మాట్లాడడం మాత్రమే కాదు. ఆ భాష మాట్లాడే ప్రజల భావప్రకటనా రీతుల నుంచి పుట్టిన సామెతలు, జాతీయాలు మొదలైనవన్నీ గ్రహించడం’’ అంటాడు సి.పి బ్రౌన్.
తెలుగు భాషా సాహిత్యాలకు విశేష కృషి చేసిన ఇద్దరు పాశ్యాత్య పండితుల్లో మెకంజీ ఒకరైతే, సి.పి బ్రౌన్ మరొకరు. అలాంటి బ్రౌన్ కు మేధావులంతా కలిసి కడపలో ఒక గుడి కట్టారు. ఆ గుడి పేరే ‘సి.పి. బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం.’
అనేక భాషల నిఘంటువులు, లెక్కలేనన్ని తాళపత్రాలు, తామ్రపత్రాలు, ఘంటాలు, పలు భాషా గ్రంథాలు, పలువురు ప్రముఖుల చేతి వ్రాతప్రతులు, బ్రౌన్ నివాస శిథిలాల నుంచి మొలకెత్తిన అక్షరాలా లక్ష పుస్తకాల విజ్ఞాన భాండాగారం అది. ఎందరో మహానుభావుల కృషి ఫలితం నేడు కడపలో ఉన్న సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం.
ఒక విదేశీయుడు తెలుగు నేర్చుకుని, తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు- తెలుగు నిఘంటువు లను నిర్మించాడు. తెలుగు వ్యాకరణాన్ని రాశాడు. పామరుల నాల్కలపై నడయాడే వేమన పద్యాలకు అక్షర రూపాన్నిచ్చి, అచ్చువేసి ప్రాణ ప్రతిష్ట చేశాడు. పురాణాలను, ప్రబంధాలను, చారిత్రక గ్రంథాలను పరిష్కరించి సొంత డబ్బులతో అచ్చువేయించాడు. తెలుగు భాష కోసం ఇంతగా పరితపించిన విదేశీయుడు, తెలుగు వారి చిరస్మరణీయుడు చార్లెస్ పిలిప్స్ బ్రౌన్.
బ్రౌన్ చేతి రాత
చరిత్ర శిథిలాల నుంచి బ్రౌన్ మహాశయుణ్ణి వెలికితీశారు. ఆ పని చేసింది భాషా శాస్త్రవేత్త జి.ఎన్. రెడ్డి, నిత్య పరిశోధకుడు బంగోరె. తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి జి.ఎన్. రెడ్డి 1974లో బ్రౌన్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, దానికి బంగోరెను పరిశోధకుడిగా నియమించారు. ఈ పరిశోధనా ప్రాజెక్టు 1977 వరకు సాగింది.
బ్రౌన్ లేఖలను, ఆంధ్రగీర్వాణ చందం, బ్రౌన్ లేఖల్లో స్థానిక చరిత్ర, కడప జాబుల సంకలనం, లిటరరీ ఆటోబయాగ్రఫీ ఆఫ్ సి.పి.బ్రౌన్ అన్న నాలుగు గ్రంథాలను బ్రౌన్ ప్రాజెక్టు ప్రచురించింది. బ్రౌన్ రచనలను ఆధారం చేసుకుని కడపలో ఆయన నివసించిన బంగళా శిథిలాలను జి.ఎన్.రెడ్డి, బంగోరె కలిసి గుర్తించారు. కలెక్టర్ కు సహాయకుడిగా కడపకు వచ్చిన సి.పి. బ్రౌన్, తాను నివసించడానికి నిర్మించుకున్న బంగళాను కార్యక్షేత్రం గా చేసుకున్నాడు. ఆ బంగళా శిథిల ప్రాంతాన్ని ఆయన స్మృతి చిహ్నంగా గుర్తించారు.
బంగళా శిథిలాలున్న స్థల యజమాని సి.ఆర్. కృష్ణ స్వామి నుంచి 20 సెంట్ల జాగాను విరాళంగా సేకరించారు. సి.పి. బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ ను 1986లో ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షులుగా మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి, కార్యదర్శిగా జానుమద్ది హనమచ్ఛాస్త్రి వ్యవహరించారు. వారి కృషి ఫలించి, పుటపర్తి నారాయణాచార్యులు అధ్యక్షతన 1987లో బ్రౌన్ గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
ప్రభుత్వ నిధులు, ప్రజల విరాళాలతో గ్రంథాలయ భవన నిర్మాణం ఒకపక్క సాగుతుంటే, మరొక పక్క పుస్తకాలను సేకరించడం మొదలు పెట్టారు. వల్లూరులోని 1927లో నిర్మించిన సీతారామ గ్రంథాలయంలో ఉన్న 2,500 పుస్తకాలను సేకరించారు. గడియారం రామ కృష్ణ శర్మ, సర్దేశాయ్ తిరుమల రావు, పుట్టపర్తి నారాయణాచార్యులు, ద్వానా శాస్త్రి వంటివారు తమ పుస్తకాలను ఇచ్చారు. టీటీడీతో పాటు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు, ఆంధ్ర, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు అనేక పుస్తకాలను ఈ గ్రంథాలయానికి అంద చేశారు.
గ్రంథాలయం లోని పుస్తకాలు.
గ్రంథాలయ నిర్మాణం 1995లో పూర్తయి, 1998 నాటికి మొదటి అంతస్తులోని సమావేశ మందిర నిర్మాణం కూడా ప్రారంభమైంది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, కన్నడ, తమిళ, ఉర్దూ భాషల్లో లక్షపుస్తకాలు జమయ్యాయి. మద్రాసు ప్రాచ్యలిఖిత భాండాగారం నుంచి 52 సంపుటాల మెకంజీ కైఫీయత్ ల కాపీలు తెప్పించారు. లండన్ నుంచి 58 బ్రౌన్ సంపుటాలను తెప్పించి, వాటిలో 5 సంపుటాలను అచ్చువేయించారు.
ఎస్వీయూనివర్సిటీ నుంచి, 1854లో బ్రౌన్ కూర్చి ప్రచురించిన తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు- తెలుగు నిఘంటువులు, కలెక్టర్ గెలెట్టి కూర్చిన (ఇంగ్లీషు లిపిలో తెలుగు పదాలున్న) తెలుగు-ఇంగ్లీషు నిఘంటువును లండన్ లోని జే.పి. పాల్ గ్విన్ స్వయంగా పంపారు. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, ఉర్దూ, కన్నడ నిఘంటువులు, ఇరవైకి పైగా విజ్ఞాన సర్వస్వాలు, పుట్టపర్తి నారాయణాచార్యులు, దివాకర్ల వెంకటావధాని చేతి వ్రాత ప్రతుల వంటివాటిని సేకరించారు. ఈ గ్రంథాలయంలో తాళపత్ర గ్రంథాలతో పాటు తామ్రపత్రాలు, రాగి నాణేలు, ఘంటాలు, కైఫీయతులు, బ్రౌన్ లేఖలు, బ్రౌనుకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. బ్రౌన్ గురించి విశేషంగా కృషి చేసిన వారిలో జి.ఎన్.రెడ్డి, బంగోరె, జానుమద్ది హనమచ్ఛాస్త్రి ముఖ్యులు. ఈ గ్రంథాలయం కోసం జానుమద్ది హనమచ్ఛాస్త్రి రాత్రింబవళ్ళు చేసిన కృషి వల్ల ఆయనను అంతా బ్రౌన్ శాస్త్రి అంటారు.
జా ను మద్ది హనుమచ్చా స్త్రి
బ్రిటిష్ జాతీయుడైన చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ కలకత్తాలో జన్మించాడు. పన్నెండేళ్ళు కలకత్తాలోనే ఉన్నాడు. తల్లితండ్రులతో పాటు బ్రిటన్ వెళ్ళి న బ్రౌన్ నవ యవ్వన దశలో తిరిగి ఈస్టిండియా కంపెనీ ఉద్యోగిగా, 1820లో కడప డెప్యూటి కలెక్టర్ హోదాలో వచ్చి చేరాడు. మచిలీపట్నం, రాజమండ్రిలో కూడా పనిచేసినప్పటికీ బ్రౌన్ తెలుగు భాషా కృషి ఎక్కువగా కడపలోనే సాగింది. భారత దేశంలో పోస్ట్ మాస్టర్ జనరల్ గా, జిల్లా జడ్జిగా, కలెక్టర్ గా 35 ఏళ్ళ పాటు వివిధ హోదాల్లో పనిచేసిన బ్రౌన్ తిరిగి బ్రిటన్ వెళ్ళిపోయాడు.
తెలుగు నేర్చుకున్న బ్రౌన్ తెలుగు భాషపైన మక్కువ పెంచుకున్నాడు. పండితుల నుంచే కాకుండా, పామరుల నుంచి కూడా తెలుగు నేర్చుకున్నాడు. తెలుగు భాషా సాహిత్యాల పునరుజ్జీవనానికి విశేష కృషి చేసిన బ్రౌన్ ప్రజల నోళ్ళలో నానుతున్న 693 వేమన పద్యాలను సేకరించి, వాటిని ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించాడు. అలాగే సుమతి శతక పద్యాలను కూడా ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించాడు.
తాళపత్రాల్లో ఉన్న వసుచరిత్ర, మనుచరిత్ర, పోతనభాగవతం, నలచరిత్ర(ద్విపదకావ్యం), కళాపూర్ణోదయం, వైజయంతి విలాసం, పల్నాటి వీర చరిత్ర, తారాశశాంక విజయం, విజయ విలాసం మున్నగు వాటిని పరిష్కరించి సొంత డబ్బులతో ప్రచురించాడు. దీని కోసం పండితుల సహాయాన్ని తీసుకున్నాడు. తాళపత్రాలలో ఉన్న వాటిని అచ్చులోకి ఎక్కించిన తొలి పాశ్చాత్య పండితుడు బ్రౌన్.
బ్రౌన్ స్వయంగా దాదాపు 60కి పైగా గ్రంథాలను రాశాడు. తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులను తయారు చేశాడు. బ్రిటిష్ అధికారుల కోసం తెలుగు వ్యాకరణం రాశాడు. గుర్రం పై స్వారీ చేస్తూ కిందపడడంతో కుడిచేతి బొటన వేలు దెబ్బతినడం వల్ల బ్రౌన్ రాయడం మానుకోలేదు. ఎడమ చేత్తో రాయడం అలవాటు చేసుకున్నాడు.
తెలుగు భాష కోసం ఇంతగా కృషి చేసి, జీవితాంతం తెలుగు కోసమే తపించిన బ్రౌన్ నిజానికి ఎలా ఉంటాడు? అంటే ఎవరికీ తెలియదు. జి.ఎన్.రెడ్డి, ఆరుద్ర లాంటి వారు బ్రౌన్ చిత్రం కలకత్తాలో, లండన్ లో, ఎక్కడ వెతికినా దొరకలేదు. బ్రౌన్ తండ్రి ఫిలిప్ బ్రౌన్ పెయింటింగ్ మాత్రం లభించడంతో, ఆ పెయింటింగ్ ను ఆధారం చేసుకుని సాహిత్య, సంగీత కారుడు, చిత్ర కారుడు మైనంపాటి సుబ్రమణ్యం బ్రౌన్ ఊహా చిత్రాన్ని చిత్రించారు. కడపలో ఉన్న బ్రౌన్ గ్రంథాలయాల వంటివి జిల్లాకొకటైనా ఉంటే ఎంత బాగుంటుంది ! ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలి.
ఇది కూడా చదవండి
ప్రొఫెసర్ కెఎస్ చలం ఉత్తరాంధ్ర వలస జీవితాల మీద రాసిన నాటకం పరిచయం