
రంగుల ఇల్లు!
గీతాంజలి ‘ఇల్లు’ సీక్వెల్ కవిత -20.
ఎందుకంత వివర్ణమైపోతావు చెప్పు?
పెరిగిన వయసుతో ముడుతలు పడ్డ దేహంతో
పాలి పోతావు చెప్పు?
జీవితం ఇంకా రంగులతో నే ఉంది.
పో...పోయి జీవితాన్ని కౌగలించుకో, పో...
కాసిన్ని రంగులు అద్దించుకో.
***
కలలు కరిగిపోయాయని
జీవితం జరిగిపోయిందని దుఃఖించకోయి!
నీ రాత్రుళ్ళు ఇంకా మిగిలే ఉన్నాయి.
నువ్వింకా నిద్ర పోవలసే ఉంది!
ఉదయపు అరుణిమలోకి కళ్ళు తెరవవలసే ఉంది.
***
వెళ్ళు, అలా నీ బాల్యపు తోటలోకి ...
ఆ పూవుల రంగులను అరువు తెచ్చుకో
నువ్వు పెరిగిన ఇంట్లో తిరిగిరా...
అదృశ్యమైన..అమ్మ నాన్నల ప్రేమల జ్ఞాపకాల రంగులు గది గదిని బ్రతిమలాడి తెచ్చుకో!
కావలిస్తే పొగిలి పొగిలి ఏడువు.
ఫరవాలేదు దుఃఖపు రంగు నల్లనిదో.. కన్నీటిలా తెల్లనిదో..హృదయానికి పులుముకొని రా పో!
***
ఒక సారి
నీ యవ్వనకాలపు విరహాల్ని మోసిన
నీ ఇంటి డాబా మీదికి వెళ్ళు....
ఆకాశపు నీలిమను అద్దుకో
వెన్నెల తెలుపును పులుముకో ...
అలా నీ వీధుల్లో పరిగెత్తి
నీ బాల్య సోపతిగాళ్లకు గాఢంగా అలాయి బలాయి చెప్పుకో.. స్వచ్ఛమైన స్నేహపు రంగును తిరిగి అంటించుకో..పో..పోయి నీ దోస్తులతో ఊరి వాగులో మునకలు వెయ్యు!
***
అదిగో
నీ ఇంటి వాకిట్లో పేర్చిన
బతుకమ్మల బంతి పూల రంగుని ...
చంద్రకాంతల సుగంధాల రంగుని...
నీ ఎండిపోయిన దేహానికి అలుముకో...
వెళ్ళు, ఎందుకలా వివర్ణమవుతావు..
ఎందుకంతగా పాలి పోతావు?
జీవితం ఉంది,నువ్వూ ఉన్నావు, నీ ఊరు ఉంది
నీ ఇల్లూ ఉంది
ఇంట్లో ఇంకా స్మృతుల సంగీతాల సవ్వడి ఉంది
నీవు పెరిగిన ఇంటి గోడలింకా
'సౌ బార్ పెహెలే ముజే తుమ్ సే ప్యార్ థా.. ఆజ్ భీ హై' అంటూ
నువ్వు పాడుకున్న
మత్తెక్కించే రఫీ యవ్వన రాగాలను
ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి, పో
పోయి చెవి వొగ్గి విను!
పాటతో పాటు మమకారపు రంగులద్ది పిలిచిన అమ్మ పిలుపూ వినిపిస్తుంది!
***
గోడలకి తలుపులకి కిటికీలకు,
నేలకి,వాకిలికి,అరుగులకి పెరటికి
నీ ఇంటిపైన ఆకాశానికి అవే మారని రంగులున్నాయి
మారింది, వివర్ణమైంది నువ్వే!
ఎందుకు ఏడుస్తావు...
ఎందుకంత దిగులు రంగువై పోతావు?
ఇప్పుడు ఆత్మీయానుబంధాల రంగులు కొల్పోయాక?
ఇంకా సమయం ఉందోయి!
వెళ్ళు నువ్వు వదిలేసిన ఇంటిముందు
తోట ముందు మోకరిల్లి
కాసిన్ని రంగుల బిక్ష అడుగు
నీ జోలెను ప్రేమ బిక్షతో నింపమని అడుగు
తోటలో నిలబడి హృదయం నిండా శ్వాసించు
ఒక్కో పువ్వూ పరిమళాల రంగుల్ని
నీ రక్తం నిండా నింపి పంపకపోతే అడుగు!
గులాబీ ఎర్రరంగు పరిమళాన్ని
మల్లె తెల్ల రంగు పరిమళాన్ని
సంపెంగ ఆకుపచ్చ రంగు సుగంధాన్ని ఇవ్వకపోతే చూడు!
**
చూడు...జీవితం మ్మీద అలగకు !
పాలిపోకు..వివర్ణమవకు...
కాసిన్ని రంగులు అద్దు ..మరి కాసిన్ని రంగులద్దించుకో.
వొట్టి రంగులేనా అవి?
మీ అమ్మ నీ నోటికి అందించబోయిన అన్నపు ముద్ద రంగు..
నువ్వు నెలల పాపవైనప్పటి నీ లేత పెదవుల నోటికి అమ్మ అందించిన చనుబాల బాలింత రంగు..
అమ్మ చేతుల మెరిసిన గాజుల రంగు
అక్క చేతుల్లో పండిన ఎఱ్ఱెర్రని గోరింటాకు రంగు
అమ్మమ్మ కట్టిన ఎర్రంచు పసుపు చీర రంగు..
ఇల్లంతా అటు ఇటు
ఊరుకులాడిన పగుళ్లు బారిన
అమ్మ పాదాల వెండి కడాల జిగేలు రంగు..
అమ్మ ముక్కు పుడకలో
వెలిగిపోయిన ఎర్ర రాయి మెరుపు రంగు
నీ తల నిమిరిన నాన్న చేతి స్పర్శ రంగు
నాన్న కండువా చెమట మరకల రంగు
నాన్న మట్టి పాదాల రంగు
ఇంటి గడప మూడు చుక్కల రంగు
వాకిట్లో ముగ్గుబిండి తెల్లని రంగు
పెరట్లో బర్రె, దుడ్డే,గడ్డి కలిసిపోయిన
కొట్టం రంగు!
దసర పండుగ రంగు
పీర్ల పండుగ రంగు..
ఎన్నెన్ని రంగులోయి నీ ఇంటికి?
***
వొట్టి రంగులేనా అవి చెప్పు?
నువ్వు పెరిగిన నీ ఇంటి జ్ఞాపకాల వర్ణాలు కావా అవి?
నిన్ను పెంచిన
మీ అమ్మ నాయనల అనురాగపు రంగులు..
నీ దోస్తుల దోస్తానాలు
నువ్వు మునకలేసిన నీ ఊరి వాగు వంకలు
నువ్వెళ్లిన జిల్లా పరిషద్ తెలుగు మీడియం బడి ...
నీ లెక్కల మాస్టారి బెత్తం దెబ్బలు
వీటన్నింటికీ ఇంద్ర ధనస్సులా ఏడు రంగులేగా!
***
నీకు తెలీక కానీ..
అసలు రంగులన్నీ నీలోపలె ఉన్నాయి..
నువ్వు వదిలేసిన ఇంట్లోనే ఉన్నాయి.
అమ్మలో .. నాన్నలో ఉన్నాయి!
ఒక్క సారి అంతర్ముఖుడివికా అంతే!
ఆ రంగులు దొరకబుచ్చుకోవడానికి..
అమ్మ నాన్నల్లోకి వెళ్ళు
నీ ఉర్లోని పొలాల్లోకి వెళ్ళు.
రంగులు మార్చే నగరంలో
స్వచ్ఛమైన రంగులు ఏం వెతుకుతావు చెప్పు ?
నగరం నీ కంటి రెటీనాని చిల్లులు పొడుస్తుంది.
నీకు పాడు రంగులు చూపిస్తుంది.
నగరం నిన్ను రంగులకి అంధుడ్ని చేస్తుంది.
అమ్మని,నాన్నని,ఇల్లుని కనపడనివ్వకుండా చేస్తుంది!
రెండడుగుల బాల్కనీ కుచించుకుపోయి
కిటికీ నీకెన్ని రంగుల్ని చూపిస్తుంది చెప్పు?
నగరంలో వివర్ణుడిగా..దిక్కులు తెలీక...
ఇల్లు లేక దేశదిమ్మరివై తిరిగే బదులు...
బస్సెక్కి సాగిపోతున్న ఆకుపచ్చని పొలాలను...
రంగు రంగుల పల్లెటూరి ఇళ్లను..గుళ్లను
పొలం రంగుల గోచీ చీరలు కట్టిన అమ్మలని...
మట్టి రంగు పంచ కట్టిన రైతు నాన్నలని పరుగున
చేరుకుని హృదయానికి హత్తుకోరాదూ...
ఎన్నెన్ని రంగులు నీ ఇంట్లో?
నిషేధాల,నిబంధనల సంకెళ్లు బిగించుకుని
రంగుల ఇంటి నుంచి బయటకు వచ్చేసి ...
ఎంతగా వివర్ణమైపోయావో చూడు?
ఎంతలా పాలి పోయావో చూడు?
తిరిగి నీ ఇంటికి చేరుకోరాదూ ?
ఇల్లు నిన్ను
సప్త వర్ణాల ఇంద్ర ధనస్సై...
తలుపులు తెరిచి
హృదయంలోకి తీసుకోదా చెప్పు?
***
ఇది కూడా చదవండి
రంగనాయకమ్మ అంటే 'బలిపీఠం' 'జానకి విముక్తి' గుర్తుకు వస్తాయి. 'రామాయణ విషవృక్షం' మార్క్స్ 'పెట్టుబడి' గుర్తుకు వస్తాయి.

అక్షరాలను ఆయుధాలుగా చేసుకుని ఈ అసమసమాజం పైన దాదాపు ఆరు దశాబ్దాల పైగా, ఎనభయ్ ఆరేళ్ల వయసులో కూడా, ఇప్పటికీ ఆమె పోరాడుతూనే ఉన్నారు. ఆరోగ్యం బాగుండక పోయినా, మంచం పైన పడుకునే రాస్తున్నారు. సాంస్కృతిక రంగంలో విరామమెరుగని యోధురాలు రంగనాయకమ్మతో జర్నలిస్టు రాఘవ ఇంటర్వ్యూ ఇక్కడ చదవండి.
Next Story