ఏ మత గ్రంథమైనా... విష వృక్షమే’
x
రచయిత్రి రంగనాయకమ్మ

'ఏ మత గ్రంథమైనా... విష వృక్షమే’

రంగనాయకమ్మతో ఇంటర్వ్యూ-1 (‘ఫెడరల్ తెలంగాణ’కు ప్రత్యేకం)


‘‘ప్రజల ప్రయోజనాలతో చూస్తే ఏ మత గ్రంథమైనా విష వృక్షమే’’ అంటారు రంగనాయకమ్మ. మార్క్సిజం ఇచ్చే జ్ఞానమే లేకపోతే, ఈ 'విష వృక్షం' ఉండేది కాదంటారు. తెలుగు నాట పెద్దగా పరిచయం అవసరం లేని రచయిత్రి రంగనాయకమ్మ. వారు రచించిన ‘రామాయణ విష వృక్షం’, ‘క్యాపిటల్’ రచనా నేపథ్యం గురించి ఈ ఇంటర్వ్యూలో చర్చించారు. ప్రస్తుతం ఉన్న కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ గ్రూపుల గురించి అనేక ఆసక్తికర విషయాలను చెప్పారు. ఈ ఇంటర్వ్యూ మొదటి భాగంలో ‘రామాయణ విష వృక్షం’ పూర్వాపరాలను ఇలా వివరించారు.



ప్రశ్న-1 : కథలూ, నవలలూ రాస్తూ వుండిన మీకు 'రామాయణ విషవృక్షం' వంటి విమర్శనా గ్రంథం రాయడానికి ఏ విషయాలు ప్రేరణ కలిగించాయి?
రంగనాయకమ్మ : ఈ విషయం నేను, ‘రామాయణ విషవృక్షానికి రాసిన ‘పీఠిక’ లో వివరంగా రాశాను. ఇప్పుడీ ప్రశ్నకి జవాబు చెప్పాలంటే, దాన్నే తిరిగి ఇక్కడ చెప్పాలి.
శ్రీరామచంద్రుల వారి అనుజ్ఞ ప్రకారం, లక్ష్మణస్వామి వారు, శూర్పణఖ ముక్కూ చెవులూ కోసే వీరోచిత ఘట్టాన్ని, రేడియో హరిదాసు గారు మహోత్సాహంతో పొంగుతూ వర్ణిస్తున్నారు-ఒక రాత్రి. ఆ కథని తమ కబుర్ల మధ్య, ఇక్కడో ముక్కా అక్కడో ముక్కా మాత్రమే విన్న కుటుంబరావూ, గాంధీ, అనే స్నేహితులు ఇద్దరు, ఆ హరి కథ మీద కోపంతో ''శూర్పణఖ'' అనే పేరుతో ఒక కథ రాశారు-కొన్నాళ్ళకి. ఆ ఇద్దరూ, అప్పుడో కథా, ఇప్పుడో కథా జంటగా రాస్తూ వున్న కొత్త రచయితలు. ఆ కథని వారు నా అభిప్రాయం కోసం నాకు ఇచ్చారు.


అందులో విషయాలు కొన్ని నాకు చాలా నచ్చాయి. అందులో రాముడి కపటత్వం, లక్ష్మణుడి బానిసత్వం క్రూరత్వం- అవన్నీ ఆ పాత్రల గురించి ఇంకా ఆలోచించేటట్టు చేశాయి. అయినప్పటికీ, ఆ కథ, హరిదాసు చెప్పిన మాటలమీద ఆధారపడి రాసిందే గానీ, అసలు కవి (వాల్మీకి) ఇచ్చిన సంఘటనల్ని ఆధారం చేసుకుని రాసినది కాదు. అసలు కథ ఎలా వుందో చూడాలనిపించింది నాకు. వెంటనే 'వాల్మీకి రామాయణం' సంపాదించి (గట్టుపల్లి శేషాచార్యులు గారి అనువాదం), అందులో శూర్పణఖ ఘట్టాల కోసం వెతికి చదివాను. కానీ, ఆ పాత్రల్ని అర్థం చేసుకోవాలంటే, అది చాలదనిపించింది. మొత్తం రామాయణాన్ని 'బాల కాండ' నించీ మొదలుపెట్టి, చిట్టచివరిదాకా చదివాను.

రంగనాయకమ్మ ను ఇంటర్వ్యూ చేస్తున్న రచయిత రాఘవ

మొదటి పేజీ నించీ చివరి పేజీ దాకా ఒకటే ఆశ్చర్యం! ఒకటే సందేహాలు!
అప్పటికి చాలా సంవత్సరాల కిందటే, నా 'స్వీట్ హోమ్' నవలలో, రాముడి పాత్ర మీద చాలా విమర్శలు చేసి వున్నాను. కానీ, అప్పటి వరకూ 'రామాయణం'లో కొన్ని సంఘటనలు తెలియడమే గానీ, దాన్ని ఇప్పుడు చదివిన పద్ధతిలో ఎప్పుడూ చదవలేదు. రామాయణం కథ పాత కాలపు మత సాహిత్యం అని తెలుసు గానీ, ఇది మరీ ఇంత బరితెగించినంత అవక తవకలతో చలామణీ అవుతోందని తెలీదు. దాన్ని చదవడం పూర్తిచేసే సరికి, ''దీన్నా జనం ఇంత అమాయకంగా నమ్ముతున్నదీ!'' అని చాలా ఆశ్చర్యం కలిగింది.
అసలు రాముడికి రాజ్యం మీద హక్కే లేనప్పుడు, ఆ సంగతి అతనికి తెలిసి కూడా ఏమీ ఎరగనట్టు పట్టాభిషేకానికి సిద్ధపడడం ఏమిటి? వనవాసంలో రుషి జీవితం గడపవలసి వుంటే, అక్కడ ఆయుధాలతో తిరుగుతూ యుద్ధాలు చెయ్యడం ఏమిటి? రాజ్యాన్ని భరతుడికే ఇవ్వ వలసి వుండగా, రాముడు తన చెప్పుల్ని సింహాసనం ఎక్కించడానికి ఒప్పుకోవడం ఏమిటి? రామలక్ష్మణుల సహోదరత్వంలో, 'యజమానీ సేవకుల సంబంధం' తప్ప, అంతకన్నా వున్న గొప్ప సంబంధం ఏమిటి? చిన్నప్పుడు 'తాటకి'నీ, పెద్దయ్యాక 'వాలి'నీ, ఇంకా అలాంటి చంపుళ్ళన్నీ చెయ్యడంలో రాముడు పాటించిన ధర్మాలు ఏమిటి? అసలు రాముడు, రావణుడికి చెందిన జనస్తానం దాకా ఎందుకు వెళ్ళినట్టు? ఇదంతా ఇతర ప్రాంతాల్ని ఆక్రమించడం కోసం చేసిన యుద్ధం తప్ప, ఇందులో అంతకన్నా గొప్ప సత్యం ఏం వుంది?
అసలు రాముడికీ రావణుడికీ తేడా ఏముంది? ఇద్దరూ రాజులే! ఇద్దరూ ధనికులే; ధనిక వర్గ ప్రతినిధులే. ఇద్దరూ, ప్రజలకు వ్యతిరేకులే! ఇద్దరి రాజ్యాలలోనూ పేదతనాలూ, ముష్టితనాలూ, వేశ్యలూ, స్త్రీల బానిసత్వాలూ-అన్నీ వున్నాయి.
ఈ సంగతులన్నీ పాఠకులకు తెలియాలి కదా? చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? దీనిమీద ఏమైనా రాయాలి-అనే ఆలోచన ప్రారంభమైంది.
వాల్మీకి రామాయణానికి ఇద్దరు పండితుల అనువాదాలు చదివాను.
(1) గట్టుపల్లి శేషాచార్యులు గారు చేసినది. (2) చదలవాడ సుందర రామశాస్త్రులు గారు చేసినది. ఈ అనువాదాలు, సంస్కృత శ్లోకాలకు ప్రతి పదార్థాలూ, తాత్పర్యాలూ వున్నవే.
అదే కాలంలో, 'మార్క్సిజం' గురించి కూడా దొరికిన పుస్తకాలు చదువుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. శ్రమ దోపిడీ, వర్గాలూ, వర్గ పోరాటాలూ, బానిస- భూస్వామ్య-పెట్టుబడిదారీ సమాజాలూ, రాజుల పరిపాలనలూ, ప్రజల తిరుగుబాట్లూ-ఇవన్నీ అప్పుడప్పుడే కొత్త జ్ఞానాన్ని ఇస్తున్నాయి. మార్క్సిజం ఇచ్చిన ఈ అవగాహనతో, 'ఏ రాజు అయినా ఒకటే, ఏ జాతి అయినా ఒకటే' అనే అభిప్రాయానికి వచ్చాను. ఈ అభిప్రాయం స్తిరపడిన తర్వాత, ఈ 'రామాయణం' గురించి పాఠకులకు చాలా చెప్పాలనిపించింది. చాలా రాయాలనిపించింది.
వెంటనే దీనిమీద రాయడం మొదలు పెట్టాను. మొదట, 'ఇదీ రామాయణం' అనే కథ రాశాను. ఇందులో, చిన్న రాముడు, తాటకిని చంపడం వరకూ జరుగుతుంది.
దాని తర్వాత, కుటుంబరావు-గాంధీలు రాసిన 'శూర్పణఖ' కథని కొంత మార్చి, మళ్ళీ రాసి, దానికి 'ఇలాగే జరిగింది' అని పేరు పెట్టాను. దాని తర్వాత, 'చెప్పుల పాలైన సింహాసనం' కూడా రాయడం మొదలు పెట్టాను. అది పూర్తి అవకముందే, మొదటి 2 కథల్నీ 'ఆంధ్ర జ్యోతి' వార పత్రికకు పంపించాను. 'ఇదీ రామాయణం' కథని-నా పేరు తోటీ; 'ఇలాగే జరిగింది' కథని- దాని అసలు రచయితల పేర్లతో పాటు నా పేరు కూడా కలిపి 3 పేర్లతోటీ, పంపించాను. ఈ రెండు కథలూ, ఆ పత్రికలో, 1974 ఫిబ్రవరిలో ప్రారంభమై కొన్ని వారాల పాటు వచ్చాయి.
'చెప్పుల పాలైన సింహాసనం' కథ కూడా రాశాక, దాన్ని పత్రిక్కి పంపలేదు. ఎందుకంటే, కొన్ని కారణాలవల్ల, ఆ కథని ఆ పత్రిక వారు వెయ్యరనే అభిప్రాయం కలిగింది. అప్పటికి 3 కథలు తయారై వున్నాయి కాబట్టి, వాటినే మొదటి భాగంగా తేవాలనుకున్నాను. ఆ పుస్తకానికి కొంచెం పెద్ద 'పీఠిక' కూడా రాశాను.
ఏ మత గ్రంథాన్ని అయినా ప్రజల ప్రయోజనాల దృష్టితో చూస్తే, అది ప్రజలకు-విష వృక్షమే! 'పవిత్ర గ్రంథం' అని అందరూ అనుకునే రామాయణం అయినా అంతే! ప్రజల్ని అజ్ఞానంలోనూ, బానిసత్వంలోనూ వుంచడం తప్ప అంత కన్నా అది ప్రజలకు చేసే మేలు ఏమీ ఉండదు. అందుకే దానికి 'రామాయణ విషవృక్షం' అని పేరు పెట్టాను.
ఆ రకంగా, 1974లో, 'రామాయణ విష వృక్షం' మొదటి భాగం వచ్చింది. తర్వాత, 75లో 2వ భాగమూ, 76లో 3వ భాగమూ కూడా వచ్చాయి.
రామాయణంలో కొన్ని సంఘటనల్ని 'కథలు' గానూ, కొన్ని సంఘటనల్ని కథకీ కథకీ మధ్య 'లింకులు' గానూ రాశాను. అవసరమనిపించిన ప్రతీచోటా మూలం నించి ఆధారాలు చూపిస్తూ చాలా ఫుట్నోట్లు ఇచ్చాను. ఈ రకంగా, 'విష వృక్షం' పని, 3 సంవత్సరాలు పట్టింది.
మార్క్సిజం ఇచ్చే జ్ఞానమే లేకపోతే, ఈ 'విష వృక్షం' ఉండేది కాదు.
ప్రశ్న 2. ఎమర్జెన్సీ కాలంలో 'రామాయణ విష వృక్షం' మూడు భాగాలను చాలా ఆసక్తిగా చదివాను. చాలా మంది 'రామాయణ విష వృక్షం' కు మీరు రాసిన సుదీర్ఘమైన ముందుమాట చదివిన ప్రభావంతో, వారి ఆలోచనలో మౌలికమైన మార్పులు సంభవించాయి. ఆ ముందుమాటను విడిగా ఎందుకు అచ్చు వేయకూడదు?
రంగనాయకమ్మ: మొదటి భాగం వచ్చినప్పుడే, కొంతమంది కమ్యూనిజాన్ని అభిమానించే వాళ్ళు కూడా అప్పుడు సూచించారు. కానీ, రామాయణాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ పీఠిక అక్కడ వుండడమే ఎక్కువ ఉపయోగం అనిపించింది నాకు. ఒకవేళ, విడి పుస్తకంగా వేయాలంటే, దానిలో ముందు పేజీలు కొన్నీ, చివరి పేజీలు కొన్నీ తీసి, అక్కడక్కడ, కొన్ని మార్పులు చేసి, ‘మానవ సమాజ పరిణామం’ అనో; ‘ఆదిమ సమాజం నించీ, కమ్యూనిస్టు సమాజం వరకూ’ అనో, తీసుకురావలిసి వస్తుంది. ఇంకోసారి ఆలోచించాలని లేదు.
ప్రశ్న: 3. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మీరు 'రామాయణ విషవృక్షం' రాసినట్టయితే, మతోన్మాదులనుంచి చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చేది. మీ పై దాడులు కూడా చేసేవారేమో! 'రామాయణ విషవృక్షం' అచ్చయిన 1974-76 కాలంలో మీరు ఇబ్బందులనేమైనా ఎదుర్కొన్నారా? అవి ఏ రూపంలో ఎదురయ్యాయి?
రంగనాయకమ్మ: రాయడం 50 ఏళ్ళ కిందటే రాసినా, ‘విషవృక్షం’ అప్పటినించీ ఇప్పటి వరకూ రీప్రింటు అవుతూనే వుంది గదా? అంతేకాదు, మతోన్మాద పార్టీ 10 ఏళ్ళగా అధికారంలో వుంది కదా? పైగా, ఈ పార్టీ అధికారంలోకి వచ్చాకే, ‘ఇదండీ మహాభారతం! మరో విషవృక్షం!’ పేరుతో ఒక విమర్శ కూడా రాశాను.

అది 10 ఏళ్ళలో 10 ముద్రణలు పడింది. అలాగే, ‘వేదాల’ మీద కూడా విమర్శ రాశాను. అది కూడా, 9 ముద్రణల దాకా పడింది. ‘రామాయణ విషవృక్షాన్ని’ 2004 లో, ఇంగ్లీషులో తెచ్చినప్పుడు మాత్రం, గుజరాత్ లో, అమ్రేలీ అనే పట్టణంలో, ఒక మతోన్మాద సంస్తకి చెందిన వాళ్ళు, నా ‘దిష్టిబొమ్మ’ని తయారు చేసి తగలబెట్టి, అక్కడి జిల్లా కలెక్టరుకి ఫిర్యాదు చేసినట్టు, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ లోనూ, ‘ఈనాడు’ లోనూ (20-8-2004) వార్తలొచ్చాయి. అంతకంటే, వేరే సంఘటనలు జరగలేదు. తిట్టుకునేవాళ్ళు తిట్టుకున్నారు. అంతే! 2019 లో, ‘విషవృక్షాన్ని’ హిందీలో కూడా తెచ్చాము.
ప్రశ్న 4. మతోన్మాదులు ఎందుకు ఏమీ చెయ్యడానికి సాహసించలేదంటారు?
రంగనాయకమ్మ : అది వాళ్ళనే అడగాలి. నా ఉద్దేశం, అప్పుడైనా, ఇప్పుడైనా, తెలుగు ప్రాంతాలకి సంబంధించి, మొదట్నించీ, ఒకరకమైన మంచి చైతన్యం వుంది. కమ్యూనిజం, నాస్తికవాదం, హేతువాదం, వంటి ఆలోచనా ధోరణులు వున్నాయి. వీటికి తోడు, నేను ‘విషవృక్షం’ లో చేసిన విమర్శలకి ఆధారంగా, దాదాపు 500 ఫుట్ నోట్స్ కూడా ఇచ్చాను. కాబట్టి, చాటుగా తిట్టుకోవడం తప్ప అంతకన్నా ఏమీ చెయ్యడం కుదరదు. రచయిత్రి ‘లత’, ‘రామాయణ విషవృక్ష ఖండన’ అని రాసింది గానీ, ఆ పుస్తకం కాపీల్ని తుక్కు కాయితంగా మార్చడానికి, తూకంతో అమ్ముకోవలిసి వచ్చిందని అప్పట్లో విన్నాను. విశ్వనాథ సత్యనారాయణ గారయితే, విషవృక్షం వచ్చిన కొత్తలో, దాని గురించి, పత్రికల వాళ్ళు అడిగితే, చాలా గడుసుగా, ‘రంగనాయకమ్మది వైర భక్తి! ఆమె నాకంటే ముందే దేవుడి దగ్గిరకి వెళ్తుంది’ అని చమత్కరించి, ఊరుకున్నారు.
ప్రశ్న 5 .'రామాయణ విషవృక్షం'తో భారతదేశంలో సాంస్కృతిక విప్లవ ఆలోచనలకు బీజాలు పడ్డాయని ఒక (దివంగత) కమ్యూనిస్టు నాయకుడు వ్యాఖ్యానించినట్టు విన్నాను. ఆయన అన్న మాట నిజమేనంటారా?
రంగనాయకమ్మ: దీని వల్లే, ‘సాంస్కృతిక విప్లవ ఆలోచనలకు బీజాలు’ పడ్డాయనుకోను. మార్క్సిజం లోనే, ఆ ఆలోచనలున్నాయి. వాటిని అర్థం చేసుకుని, వాటిని రచనల్లో చెప్పడం మాత్రమే ఎవరైనా చెయ్యగలిగేది. ఆ ప్రయత్నమే నేను చేశాను.

(ఇంకా ఉంది)


ఇది కూడా చదవండి

గీతాంజలి ఇల్లు కవిత సీక్వెల్- 20 ఇక్కడ చదవండి.




Read More
Next Story