తాటి ముంజెలు తొందరగా అరగాలంటే ఏంచేయాలి? : ‘కవిటం’  చిట్కా
x

తాటి ముంజెలు తొందరగా అరగాలంటే ఏంచేయాలి? : ‘కవిటం’ చిట్కా

జ్ఞాపకాలు తీపివైనా చేదువైనా నెమరేసుకోడం గొప్ప అనుభూతి. చిన్నప్పటి ఊరు, కొండ,కోన, అడివి, వాగు, ఏరు గుర్తున్నాయా? అయితే, పరకాల సూర్యమోహన్ కవిటం కబుర్లు (2) చదవండి...



కవిటం కబుర్లు-2


(పరకాల సూర్యమోహన్)


మావూరు పశ్చిమ గోదావరి జిల్లా కవిటంలోని మా పలప దొడ్డి గురించి ఎంత చెప్పినా చాలదు. అదొక జ్ఞాపక నిక్షేపాల గని.


అక్కడి పశువుల సంపద, పాల వుత్పత్తులు, పెరటిలోని రకరకాల పాదుల గురించీ , అరటి, పనస, సపోటా చెట్లు వాటి పళ్ళగురించీ ఎంతచెప్పినా సరిపోదు.


ఇప్పుడు నేల లోనుంచి తవ్వి తీసే ఒక పంట గురించిన విశేషాలు చెబుతాను. అది కర్ర పెండలం కాదు, కంద కాదు. ఇవి పట్టణాలలో కూడా చాలా మందికి తెలుసు. ఎక్కడైనా ఇవి వంటకాల జాబితాలోవుంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది వేరు.


దీని గురించి పల్లెటూళ్ళలో తప్పించి, పెద్దగా ఎక్కువ మందికి, ముఖ్యంగా ఈ కాలం కుర్రకారుకి తెలియక పోవచ్చు.అసలు ఎప్పుడైనా చూసారా అన్నదికూడా సందేహమే. ఇంతకీ ఆ పంట పేరు “తేగలు”. ఎక్కడైనా విన్నట్టు,చూసినట్టూ అనిపిస్తోందా? నాకు సందేహమే సుమండీ!


కానీ మా చిన్నతనాల్లో మా చిరుతిండిలో ఇదొక ముఖ్య ఐటెమ్. చాలా విరివిగా దొరికేది. ఇప్పటికీ చాలా చోట్ల దీన్ని అమ్ముతూ వుంటారు. కానీ గమ్మత్తు ఏమిటంటే ఇది నేలలో పెరుగుతుందనీ,దీన్ని తవ్వి తీస్తారనీ ఈ కాలం కుర్రకారుకి తెలియకపోవచ్చు.

ఎవరో ఓ పట్టణవాసి మొదటిసారి వరిచేలని చూసి ఆహా వరివృక్షాలు ఎంత బావున్నాయో అని వ్యాఖ్యానించినట్టుగా ఈ తేగలు చెట్టుకు కాస్తాయి అంటే నమ్మేవాళ్ళు ఈ రోజుల్లో కచ్చితంగా వుంటారు.

ఈ తేగల కథా కమామీషు మీకు చెప్పే ముందు మరో అద్భుతమైన, రుచిగా వుండే ముంజెలు గురించి చెప్పాలి.

తేగల గురించి చెబుతూ మధ్యలో రామాయణం లో పిడకల వేటలో ఈ ముంజెలు ఏమిటండి బాబూ అనుకోవచ్చు. కాస్త ఓపిక పట్టండి. తేగలకీ,ముంజెలకీ చాలా అవినాభావ సంబంథం వుంది. ఈ రెండూ తాటిచెట్ట వుత్పత్తులే.

ముందుగా ముంజెలు గురించి చెప్పాలి. అవి క్రమేపీ తేగలుగా ఎలా రూపాంతరం చెందుతాయో తర్వాత చెబుతాను.




తాటిచెట్టు ఆకులు కొట్టాక బాగా కనిపించేవి, ప్రాధమిక దశలో ఉన్న ముంజెల గెలలు. ఆదశలో వాటి చివర్లు కోసి, కుండలు కడతారు దాంట్లోకి నీరు కారుతుంది. అదే “తాటి కల్లు”.


మే నెలలో ఎండలు ముదిరే టైముకి తాటి ముంజెలు వస్తాయి.

తాటికాయలు మంచి లేతగా వున్నప్పుడు పాలేళ్ళు తాటిచెట్టుఎక్కి లేత గెలల్ని దింపుతారు. ఒక్కొక్క తాటికాయ పైభాగాన్ని కత్తితో జాగ్రత్తగా చెరిగితే లోపల మూడు, నాలుగు కన్నులు లాంటివి కనిపిస్తాయి . వాటినే ముంజిలు అంటారు. పై భాగాన్ని బొటనవేలితో నెమ్మదిగా చిల్లు పెడితే లోపల నీళ్ళు వుంటాయి. లేతకొబ్బరి బొండంలో మాదిరిగా ఈ నీళ్ళుకూడా ఎంతో రుచి గా వుంటాయి.
ముందుగా ఆ నీళ్ళు తాగి బొటనవేలితో లోపలి మృదువైన భాగాన్ని పైకి పెళ్ళగించి జుర్రుకుని తినేవాళ్ళం. ఆ రుచి మాటల్లో వర్ణించలేము. లేత ముంజల రుచి అద్భుతం. లేత తాటికాయల్ని పాలేరు ఒక్కొక్క టే చెరిగి ఇస్తూంటే మేము పోటీలు పడి తినేవాళ్ళం.

ఇంట్లో వాళ్ళకోసం పాలేళ్ళు తాటికాయని పక్కలనుంచి కోసి నెమ్మదిగా ముంజెలు తెగి పోకుండా ఒక్కొక్క టే విడదీసేవాళ్ళు. ముంజె తెగిపోతే లోపల నీళ్ళు కారిపోతాయి. ప్రతి ముంజె చుట్టూ రక్షణగా మెత్తటి పెంకు వుంటుంది.

ఆ మెత్తటి పెంకును తొలగిస్తే ఎంతో మృదువుగా జెల్లీ లాంటి పదార్థం కనిపిస్తుంది. అదే ముంజె.నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగి పోతుంది.




తాటిచెట్టు ఆకులు కొట్టాక బాగా కనిపించేవి, ప్రాధమిక దశలో ఉన్న ముంజెల గెలలు. ఆదశలో వాటి చివర్లు కోసి, కుండలు కడతారు దాంట్లోకి నీరు కారుతుందిఅదే "తాటి కల్లు".


మే నెలలో ఎండలు ముదిరే టైముకి తాటి ముంజెలు వస్తాయి.

తాటికాయలు మంచి లేతగా వున్నప్పుడు పాలేళ్ళు తాటిచెట్టుఎక్కి లేత గెలల్ని దింపుతారు. ఒక్కొక్క తాటికాయ పైభాగాన్ని కత్తితో జాగ్రత్తగా చెరిగితే లోపల మూడు, నాలుగు కన్నులు లాంటివి కనిపిస్తాయి. వాటినే ముంజిలు అంటారు.

పై భాగాన్ని బొటనవేలితో నెమ్మదిగా చిల్లు పెడితే లోపల నీళ్ళు వుంటాయి. లేతకొబ్బరి బొండంలో మాదిరిగా ఈ నీళ్ళుకూడా ఎంతో రుచి గా వుంటాయి.

ముందుగా ఆ నీళ్ళు తాగి బొటనవేలితో లోపలి మృదువైన భాగాన్ని పైకి పెళ్ళగించి జుర్రుకుని తినేవాళ్ళం. ఆ రుచి మాటల్లో వర్ణించలేము. లేత ముంజెల రుచి అద్భుతం. లేత తాటికాయల్ని పాలేరు ఒక్కొక్క టే చెరిగి ఇస్తూంటే మేము పోటీలు పడి తినేవాళ్ళం.

ఇంట్లో వాళ్ళకోసం పాలేళ్ళు తాటికాయని పక్కలనుంచి కోసి నెమ్మదిగా ముంజెలు తెగి పోకుండా ఒక్కొక్క టే విడదీసేవాళ్ళు. ముంజె తెగిపోతే లోపల నీళ్ళు కారిపోతాయి. ప్రతి ముంజె చుట్టూ రక్షణగా మెత్తటి పెంకు వుంటుంది.

ఆ మెత్తటి పెంకును తొలగిస్తే ఎంతో మృదువుగా జెల్లీ లాంటి పదార్థం కనిపిస్తుంది. అదే ముంజె. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగి పోతుంది.





మేము చిన్నతనాల్లో తెగ తినేవాళ్ళం. అవి ఎంత లేతవి అయినా బకాసురుడులా మింగేస్తే జీర్ణం అవాలి కదా. అవి బాగా అరిగితేనా కదా ఆ తర్వాత దేనిమీద పడి తినాలో అని ఆలోచించగలం!

పుల్లటి మామిడి కాయ ముక్కలు ఓ రెండు తింటే చాలు. దెబ్బకి తిన్న ముంజెలన్నీ అరిగి పోతాయి. అంటే ముంజెలకి పుల్ల మామిడి కాయ విరుగుడు అన్నమాట!. మేము తు.చ తప్పకుండా దానిని పాటించే వాళ్ళం.

ఒకవేళ మామిడి కాయ అందుబాటులో లేకపోతే పక్కింటి చెట్టుకు వేలాడే మామిడి కాయల్ని రాళ్ళతో రాలగొట్టి తినేవాళ్ళం. అది వేరే విషయం.
ముంజెల ప్రహసనం పూర్తి అయింది.

ఇంక తేగల సంగతి తేలుద్దాం.

ముంజెలు ముదిరి తాటి కాయలు వానలు పడే నాటికి జూన్, జులై నాటికి పండి తాటి పళ్ళు అవుతాయి. కొంత మంది ఆ పండుని కాల్చి తింటారు. తాటిపండు గుజ్జు లో వరినూక కలిపి తాటిరొట్టి, తయారుచేసి తినేవారు, అది బలమైన ఆహారం, తాటి తాండ్ర, బెల్లం, ఆ పండులోంచి వచ్చేవే.

మీరెప్పుడైనా తాటి బెల్లం, తాటి తాండ్ర తిన్నారా? కనీసం వాటి పేరైనా విన్నారా? మేము చిన్నతనాల్లో వాటిని విన్నాం, తిన్నాం తెలుసా?
ఆ తర్వాత తాటి పండు టెంకల్ని పాతేవారు.

ముందుగా నేలని గుల్లగా తవ్వి ఒక మడి తయారు చేసి, ఎరువు వేసి ఒక వరుసలో తాటి టెంకలు పరిచేవారు, తర్వాత, మళ్ళీ మట్టి, ఎరువు పొర వేసి మళ్ళీ టెంకలు పాతేవాళ్ళు. అల్లా మూడు నాలుగు పొరలు వేసేవారు దానినే "తేగలపాతర" అంటారు. కొన్నాళ్ళకి అవి నేలమీద మొలకెత్తేవి. భూమి లోపల కాండంలా పెరుగుతాయి..అవే తేగలు.

దాని చివర కాయలా వుంటుంది. దాని లోపల గుంజు వుంటుంది. అదే బుర్ర గుంజు. అదికూడా తియ్యగా చాలా బాగుంటుంది.

తేగల పాతర లోంచి నవంబర్ నెలలో దీపావళి పండుగ తర్వాత తేగలు బైటికి తవ్వి తీస్తారు. అప్పటికి అవి బాగా తయారవుతాయి, తేగలు లో పిండి పదార్ధాలు ఎక్కువ. ఆరోగ్యానికి తేగలు చాలా మంచివి అని చెబుతారు.

సాధారణంగా పిడకల పొయ్యి లో, కుంపట్లలో వీటిని కాల్చితింటారు. కాల్చేటప్పుడు వచ్చే సువాసనలు నోరూరించే విధంగా ఉంటాయి.

తేగల పైపొర బాగా నల్లగా కాలిన తరువాత ఆ పొర తొలగిస్తే లోపల తేగ రెండు బద్దలుగా అతుక్కొని వుంటుంది. వాటిని విడదీస్తే మధ్యలో పొడవాటి కాడ వుంటుంది. దానినే "చందమామ" అంటారు. దాని పై కొస భాగం చాలా మృదువుగా వెన్నలా వుంటుంది. అది కూడా తినడానికి బావుంటుంది.

అంచేత దాన్నీ వదిలే వాళ్ళంకాదు. పై భాగం తిన్నాకా దాన్ని చెవిలో ఇయర్ బడ్ (ear bud) లా తిరి పెట్టుకునేవాళ్ళం. బాగా కాలిన తేగని ముక్కలుగా విరిచి,పీచు తొలగించి ఆ ముక్కలికి పేరిన నెయ్యి రాసి కూడా తినేవాళ్ళం. అది ఎంతో కమ్మగా రుచి గా వుండేది.
ఇంటిల్లిపాదీ తినాలంటే అలా ఎన్ని అని పొయ్యిలో కాల్చగలరు ?అందుకని తేగల్ని తంపట వేసే వాళ్ళు. ఒక కుండలో, 100, 150 తేగలు పేర్చి, కుండ బోర్లించి దాని మీద ఎండుగడ్డి పెద్ద మేటులా వేసి మంట పెట్టేవారు.

సుమారు ఒక అరగంట వరకూ అది మండేది. మంట తర్వాత ఆ ఎఱ్ఱటి నిప్పు సెగలో సుమారు 4,5 గంటలు ఉన్నాక 'కుండలో వున్న తేగలు ఆ వేడి సెగకి బాగా వుడుకుతాయి. అవే తంపట తేగలు.
సాధారణంగా రాత్రి అవుతూండగా మా పెద్దవాళ్ళు ఇలా తేగల్ని తంపట వేసేవాళ్ళు. తెల్లవారేసరికి కుండ చల్లారి వుంటుందనీ, అప్పుడు తేగలు బైటికి తీయవచ్చుననీ వాళ్ళ ఉద్దేశం .

వాళ్ళ ఉద్దేశం అయితే బాగానే వుందికానీ మాకు రాత్రి కంటిమీద కునుకు వస్తే ఒట్టు! ఎప్పుడు తెల్లవారుతుందా ఆ తంపట తేగలు తింటామా అని వుండేది. మా తిండిరంథి అలాంటిది మరి. ఆచిన్నతనాలే వేరు.అలాంటి రోజులు మళ్ళీ రావు.


పరకాల సూర్యమోహన్


(పరకాల సూర్యమోహన్, విశ్రాంత జర్నలిస్టు. రచయిత. ది హిందూ ఆంగ్ల పత్రికలో పని చేస్తూ రిటైర్ అయ్యారు , అంతకు ముందు సోవియట్ ల్యాండ్, ఆంధ్ర ప్రభ లలో పనిచేశారు.)



కవిటం కబుర్లు మొదటి భాగం ఇక్కడ చదవండి


అనగనగా ఒక ఊరు, ఆ ఊరు పేరు కవిటం...

Read More
Next Story