గాయాల గానం
x

గాయాల గానం

నేటి మేటి కవిత: వనజ తాతినేని.


ఇవాళ దుఃఖం పలుకరించింది. గాయాల సలపరం

ఎన్నో పురాతన దుఃఖాలను తవ్వి తీసింది.

కాలం గాయాలను మాన్పుతుందని ఎవరైనా అంటే

గాయం లోపల ఓ అగ్నిపర్వతం దాగి వుంది అంటాను.

గాయం చెద రేగినట్టు రేగుతూనే వుంటుంది.

అది ఎన్నటికీ అదృశ్యం కాదు.

ప్రతి గాయం ఒక విస్ఫోటనం

శకలాలు శకలాలుగా శరీరాన్ని తాకిన గాజు పలక

శరం లా గుచ్చి రంపంతో పర పరా కోసిన అటవిక క్రీడ

మానిపోయిన మచ్చల పై తడిమి చూస్తే గాయం లోతు అందకపోవచ్చు

నది లోతు ఎంతో మనకు తెలుస్తుందా, అంతే!

పోనీ నది కింద ఉన్న భూమి లోతు నదికి తెలుస్తుందా?

నదిని దాటడానికి తెప్ప సాయం తీసుకున్నట్టు

గాయానికి గాయానికి మధ్య వంతెన వేసి

జీవితాన్ని దాటడానికి యత్నిస్తున్నా.

గాయపడినప్పుడు కల్గిన బాధ నొప్పిని కూడా

సృజనాత్మకంగా చిత్రీకరించే వుంటాను.

పనిముట్టు మనదే అయినప్పుడు రూపాలకు ఏమి కొదవ ?

తుఫానులా పలకరించి పోయే గాయాల జ్ఞాపకం మంచిదే!

గాయాలు చేసిన మనిషిని క్షమించేసి వుంటాను

ఆ గాయాల గుర్తు మాత్రం మాసిపోదు.

మనుషుల ముఖాన్ని గాయంతో పోల్చుకుంటాను

ఆసరా తెచ్చుకుని మరీ గాయపరిచాడు కనుక.

గాయం నా పాత సహచరుడు.

నా నడక అతను చేసిన గాయాల జ్ఞాపకాలే!

ఉంగరంలో పళ్ళ మధ్య చక్కని బిగింపుతో

కూర్చున్న వజ్రంలా నాలో మాయని గాయం

గాయ గేయంలో లయ తూగు బరువు

అన్నీ సరిగ్గా అమిరాయి. రుజువు కావాలా?

నా మణికట్టును పట్టుకుని నాడి ని చూడు.

గాయాలు ప్రవహిస్తున్న సవ్వడి వింటావ్.

వినబడని పాట అది.

నాకుగా.. నేనేం మిగల్లేదు. గాయాలుగా మిగిలాను.

గాయాలపై పూలు పూయడం చూసారా ఎవరైనా!

జీవన మకరందాన్ని ఆస్వాదించేది ఎలా?

గాయం నా జీవన గానం, యానం.

గాయం నాలో జ్వాల, నా జీవశక్తి

మానడానికి పట్టే సమయం నా జీవిత కాలం.


Read More
Next Story