హరప్పా సత్రంలో ఒక రాత్రి...
ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. సీరియల్. అధ్యాయం -2. ఆంగ్లమూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi
అధ్యాయం - 2
మరునాడు, పునీతుడు తన అనుచరులైన అశ్విన్ మరియు వరుణ్ లను వెంట తీసుకుని నిత్య సందడిగా వుండే హరప్పా అంగడి ప్రదేశానికి వెళ్ళాడు. స్థానికులను కలిసి, సమాచారం సేకరించి, తమ వైదిక సంస్కృతి విశిష్టతను వ్యాప్తి చేయాలన్నది వాళ్ళ ఉద్దేశ్యం.
యాలకులు, దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు,,తదితర సుగంధ ద్రవ్యాల కమ్మని వాసన గాలిలో తేలి వచ్చి వాళ్ళ జ్ఞానేంద్రియాలను స్పృశించింది. రాగిపాత్రల గణగణ ధ్వని మట్టి ఇటుక భవనాలలో మార్మోగుతూ శ్రావ్యమైన సంగీతంలా వాతావరణాన్ని కమ్మేసింది. వాళ్ళ చర్మాన్ని చిరచిర లాడించిన వేడి సూర్యకిరణాలు ముదురు ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో కాంతులీనాయి.
జన సందోహంతో నిండిన వీధుల గుండా నడుస్తూ ఆ ఆర్య వీరులు హరప్పా నగరంలోని కంటికింపైన దృశ్యాలు, వినసొంపైన ధ్వనులకు మైమరచి పోయారు. తాను పునీతుడి కన్నా గొప్ప వీరుడినని భావించుకునే కాకలు తీరిన యోధుడు అశ్విన్, పునీతుడివైపు తల వాల్చి గుసగుసగా అన్నాడు : ‘‘పునీతా, గుర్తుంచుకో. మన ప్రయత్నం లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఈ హరప్పనులను తక్కువగా అంచనా వేయొద్దు.’’ కించిత్ ఈసడింపుతో కూడిన అతని మాటల్లో తమ ఆర్యజాతి సంస్కృతిపరమైన, మేధాపరమైన ఆధిక్యతా భావన వ్యక్తమైంది. తన పట్ల తనకు ఎంతో నమ్మకమున్నఅశ్విన్ మాటల వెనుక తలిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చాలన్న తపన వుంది. ఒక గౌరవ ప్రదమైన ఆర్య కుటుంబంలో జన్మించిన జ్యేష్ట పుత్రుడు అతడు ; తండ్రి పేరు నిలబెట్టేలా తన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన బాధ్యత, భారం అతనిపై వున్నాయి.
ఎదురుగా వున్న గుంపు మీదుగా చూపులు కలయ తిప్పుతూ పునీతుడు తలాడించాడు. ‘‘ఔను, అశ్విన్.. నాకు అర్థమైంది. అయితే, ఈ నగర వైభవాన్ని తిలకిస్తూ నా సంభ్రమాశ్చర్యాలను ఆపుకోలేక పోతున్నాను. మనమిది వరకు చూసిన అన్నింటికన్నా చాలా భిన్నమైనది ఇది. ’’
అశ్విన్ చిన్నగా నవ్వాడు. ‘‘అలా ఎందుకు జరుగుతున్నదంటే -నువ్వు ఈ నగర వాస్తుకళని ఆరాధనా భావంతో కళ్ళార్పకుండా చూస్తున్నావ్ పునీతా. మన ముందున్న కర్తవ్యం పై మనసు పెట్టు. మనకు నమ్మకస్తులైన మిత్రులుగా ఎవరు పనికొస్తారో గుర్తించాలి, వాళ్ళ ద్వారా ఇక్కడి రాజకీయ, భౌగోళిక చిత్రపటానికి సంబంధించిన సమాచారం సేకరించాలి. ’’
గంభీరమైన ముఖ కవళికలతో పునీతుడు తల ఊపాడు. ‘‘సరిగా చెప్పావ్, అశ్విన్. నువ్వెప్పుడూ అంతే. ఇక మన పని మొదలెడదాం. ’’
కాసేపట్లో వాళ్ళు సందడిగా వున్నఒక సత్రం సమీపంలో కొచ్చారు. అక్కడ వర్తకులు, వ్యాపారులు చేరి స్థానిక తినుబండారాలు తింటూ తమ అనుభవాలు, విశేషాలు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు.
చెరగని చిరునవ్వుతో వాళ్ళ కథలు ఆసక్తిగా విన్న పునీతుడు అంటే అక్కడి వాళ్లకు ఇష్టం ఏర్పడింది, ఆ గుంపుతో కలిసి పోయి పునీతుడు గలగలా నవ్వాడు. వాళ్ళు చేతులు సాచి అతన్ని ఆప్యాయంగా అలుముకున్నారు, గిన్నెల కొద్దీ తీపి పదార్థాలు, పసందైన పానీయాలు, రుచికరమైన తిను బండారాలు అతనికి ప్రేమగా అందించారు.
పునీతుడి నిశితమైన చూపుల మెరిసే కళ్ళు, చక్కగా చెక్కిన శిల్పం లాంటి అతని దృఢమైన శరీరాకృతి వ్యాపారులను ఆకర్షించాయి. అతడు వెంటనే వాళ్లకి నమ్మకమైన స్నేహ పాత్రుడయ్యాడు. యుద్దవిద్యలో శిక్షణ పొంది రాటు దేలిన అతని విగ్రహం, క్రీడా కారుని వంటి విశాలమైన భుజాలు చూడగానే వారికి అతనంటే గౌరవం ఏర్పడింది ; కొత్త వాళ్ళని కించిత్ అనుమాన దృక్కులతో చూసే వారు సైతం అతని సంభాషణ చాతుర్యం, మాటల్లోని సునిశిత హాస్యానికి ముగ్దులైనారు. పునీతుడి వ్యవహార శైలి బయటికి ఎలా వున్నా ఎదుటి వాళ్లంటే అతనికి లోలోపల సహానుభూతి, కనికరం వున్నాయి, ఆ గుణాలే అతనికి ఇతరులని అర్థం చేసుకుని వాళ్ళతో సంబంధం ఏర్పరచుకోవాలని ప్రేరణ ఇచ్చాయి.
అశ్విన్ మాత్రం స్థానికులతో కలిసిపోవడానికి చాలా తంటాలు పడ్డాడు. తన ఆర్య సంస్కృతి పట్ల మొండి నిబద్ధత, హరప్పనుల ‘ అపరిశుభ్ర ‘ ఆచారాలంటే అయిష్టం- అతన్ని నన్ను ముట్టుకోకు నామాల కాకి అన్నట్టుగా దూరం ఉండేలా చేశాయి. హరప్పనుల పానీయాలను పులియబెట్టే కళ, మసాలా ద్రవ్య భరితమైన వారి వంటకాలు, తీరికైన సాంఘిక ఆచారాలపట్ల వారి ఆమోదం..ఇవంటే అశ్విన్ కి ఏవగింపు ఏర్పడింది. అతనికి అవి వారి బలహీనతలుగా, గందరగోళ పద్దతులుగా కనపడ్డాయి; ఆర్యుల కఠినమైన, క్రమశిక్షణాయుతమైన జీవన విధానమే నిజమైన ఘనతకి సూచికలని అతని ప్రగాఢ విశ్వాసం.
అందుకు భిన్నంగా వరుణ్ హరప్పనుల మెరుగైన నీటిపారుదల వ్యవస్థ పట్ల ఆకర్షితుడై ఒక స్థానిక ఇంజినీర్ తో మాటా మంతీ కలిపాడు. అతని లోని జిజ్ఞాస- చుట్టూ ప్రపంచంలోని వింతలూ విశేషాలు పరిశీలించి, వాటి నుంచి నేర్చుకుని అవగాహన పెంచుకోవాలని ప్రేరేపించింది. అతని జ్ఞానతృష్ణ, సమస్త మానవాళి పట్ల ప్రేమ..మొత్తం ప్రపంచాన్నిగుట్టు కనుక్కోవాల్సిన ఒక సంక్లిష్ట పదకేళి లా చూసేలా చేశాయి. నీటి పారుదల నిపుణుడు చెప్పేది కళ్ళు విప్పార్చి వింటూ వుంటే అతని మదిలో అనేక ఆలోచనలు, ప్రశ్నలు సుడిగుండంలా తిరుగాడాయి.
ముఖంలో దయ ఉట్టి పడుతోన్నఆ వృద్ధ ఇంజనీర్ నీటి పారుదల వ్యవస్థ సూక్ష్మ విషయాలన్నీ ఉత్సాహంగా వివరించాడు. ‘‘వరుణా, నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే –సింధు నది ఉధృత వరదను తట్టుకునేలా మా పూర్వీకులు ఈ పక్కా వ్యవస్థను రూపొందించారు. నీటిని నిలువ చేసి పంట పొలాలకు అందించేందుకు వీలుగా మేము కాలువలు, ఆనకట్టలు, నిల్వ సరస్సులు ..అన్నీ ఉపయోగించుకుంటాము..’’
రాత్రి వేళ అయింది. హరప్పావీరులు, పురాగాథల గురించిన ఆలోచనలు పునీతుడిని వదలి పెట్టలేదు. చాలా విభిన్నమైన, ఉన్నతమైన నాగరికతను నిర్మించిన హరప్పనుల కథలు అతని మదిలో ఎన్నో ఊహలకు తేర లేపాయి. ఇరు సంస్కృతుల వ్యత్యాసాలకు అతీతంగా ఆలోచించిన అతనికి అందరినీ కలిపేది మానవత్వమే కదా అన్న సత్యం స్ఫురించింది.
రాత్రి చీకట్లు దట్టంగా అలుముకొంటూ ఉండగా హరప్పన్ సైనికుల బృందం ఒకటి వారి ఎదురుగా ప్రత్యక్షమైంది. దివిటీల వెలుగులో మెరుస్తోన్న కవచాలతో వున్న సైనికులు ఆర్యజాతికి చెందిన కొత్త వ్యక్తులను అనుమానంగా చూశారు. దండనాయకుడు దబీరుడు పురుష కు అడ్డం నిలబడి కరుకైన ముఖంతో వాళ్ళను తీక్షణంగా చూశాడు.
‘‘ఆర్యులైన మీరు మీ భాష, సంస్కృతి గొప్పవనీ, మీరు చాలా సంస్కార వంతులనీ భావించుకుంటున్నారు కాబోలు..’’ వెక్కిరింపుగా అన్నాడు దబీరుడు. ‘‘కానీ మా దృష్టిలో మీరు అనాగరికులు తప్ప మరేమీ కాదు. మీ అసంబద్ధమైన ఆధిక్య భావనకు, జాతి మతపరమైన కుళ్ళు రాజకీయాలకు మా సమాజంలో స్థానం లేదు. అవాంచనీయ పరిణామాలు చోటుచేసుకోక ముందే మా మానాన మమ్మల్ని వదిలేసి నగరం విడిచి వెళ్ళిపొండి..’’
ఉద్రిక్త పరిస్థితి పసి గట్టిన పునీతుడు లేచి నిలబడి హరప్పనుల నాయకునితో అన్నాడు. ‘‘మిమ్ములను అగౌరవ పరచాలన్న ఉద్దేశం మాకు ఏ కోశానా లేదు. మన ఇరు జాతులు ఒకరి నుంచి మరొకరు నేర్చుకుని కలిసి ముందుకు వెళ్ళడానికి ఒక కొత్తబాట వేయాలన్నది మా కోరిక, మాది శాంతి మార్గం.. ’’
ఆ మాటలేవీ విన దలచుకోలేదన్నట్టుగా దబీరుడు వెక్కిరింపుగా నవ్వాడు. ‘‘ఇప్పుడు మీ ముందున్న మార్గం వెంటనే నగరం విడిచి వెళ్లి పోవడం..మా హరప్పనుల ఆతిథ్యం ఎలా వుంటుందో మీకు చూపించక ముందే ఆ పని చేయండి.. ’’
పునీతుడి మిత్రులు అశ్విన్, వరుణ్ నీరసంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. దబీరుని మాటల్లోని బెదిరింపు ధోరణి చూశాక ఇక తామక్కడ ఉండటం అంత మంచిది కాదని వారికి అర్థమైంది.
పునీతుడి ముఖ కవళికల్లో మార్పు లేదు, అతడు అలాగే శాంతంగా నిబ్బరంగా చూశాడు. ‘‘మీ సందేహ, సంశయాలు నాకు అర్థమైనాయి దబీరా..మేమిక్కడికి వచ్చింది మిమ్మల్ని జయించాలనో, ఏదైనా విధ్వంసం సృష్టించాలనో కాదు. మన ఇరువురి సంస్కృతుల, సంప్రదాయాల భిన్నత్వానికి ఆటంకం కలిగించని ఒక కొత్త మార్గం కనుక్కోవాలన్నది మా ఉద్దేశం..మనమొక ఉమ్మడి కార్య క్షేత్రానికి పునాది వేసి ఉజ్జ్వల భవిష్యత్తు కోసం కలిసి కట్టుగా పని చేయ లేమా..? ’’ దబీరుడు కనుబొమలు ముడిచాడు. అతని స్వరం నిమ్మళంగా వున్నా అందులో వెటకారం ధ్వనించింది. ‘‘మీరు పద్ధతులు మార్చుకున్నారని మమ్మల్ని నమ్మమంటారా ? మీరు అంత హటాత్తుగా మా సంప్రదాయాలను, ఆచారాలను గౌరవించాలని నిర్ణయించారా? నేను నమ్మను. ఆర్యులైన మీరు కపటానికి పెట్టింది పేరు. మేము మరొక సారి వెర్రి వాళ్ళం కాదలచుకోలేదు.. ’’
అయితే పునీతుడు దబీరుని కళ్ళలోకి సూటిగా చూస్తూ స్థిరమైన గొంతుతో అన్నాడు : ‘‘మీ నమ్మకం గెలుచుకోవడం ముఖ్యం అని నాకు అర్థమైంది. దబీరా. మా నిష్కపటమైన మంచి ఉద్దేశ్యాలను నిరూపించేందుకు మా శక్తి మేరకు ప్రయత్నిస్తామని మాట ఇస్తున్నాను. మన ఇరువురికి లబ్ది చేకూర్చే ఒక కొత్త మార్గం వేయడానికి ఒక అవకాశం తీసుకుంటే తప్పేమిటి అని నిన్ను అడుగుతున్నా.. ’’
దబీరుడు కొంచెం మెత్త బడ్డట్టుగా ముఖం పెట్టాడు, కానీ అనాసక్తత ధ్వనించే గొంతుతో అన్నాడు. ‘‘దానికి చాలా ఆలస్యమైనదని నేననుకుంటున్నాను. మా వాళ్ళు గతంలో బయటి వాళ్ళ చేత బాధలు పడ్డారు. మేమంత సులభంగా మిమ్మల్ని నమ్మే స్థితిలో లేము. కానీ నీకొక మాట చెప్తున్నా : ఏ గొడవ చేయకుండా మీరిక్కడి నుంచి వెళ్ళిపొండి, మీకు ఎలాంటి హాని తలపెట్టము. నేను చెప్పగల్గింది ఇంతే.. ’’
దబీరుడు అలా అంటుండగా అతని జ్ఞాపకాల పొరల్లోని గతం లోని ఒక సంఘటన చప్పున గుర్తుకు వచ్చింది : అతడు పిల్లవాడుగా ఉన్నప్పుడు అతని సమీప బంధు వొకాయన పొరుగునున్న ఆదివాసి మూకల దాడి లో చనిపోయాడు. ఆ బాధాకరమైన ఘటన తాలూకు జ్ఞాపకం దబీరుని మస్తిష్కం లోంచి తొలగి పోలేదు. బయటి శత్రువుల నుంచి తన వాళ్ళను కాపాడేందుకు అప్పటి నుంచే జీవితాన్ని అంకితం చేశాడు. కానీ ఇప్పుడు పురుష ముఖం లోకి చూస్తూ ఒక అనూహ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు ; హరప్పనులతో మైత్రి కుదుర్చుకోవాలనే బలమైన, నిజమైన వాంఛ పునీతుడి కళ్ళల్లో అతనికి కనిపించింది. చెక్కు చెదరని ఆశను ప్రతిఫలించే అలాంటి చూపులు దబీరుడు ఇంతకు ముందు చూడలేదు, అందుకని కాసేపు సాలోచనగా మౌనం వహించాడు.
ఆ రాత్రి ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. తమ ప్రయత్నం సఫలమయ్యే దిశగా సరైన మలుపు తిరిగిందా లేదా అని ఆర్యులు గాఢ ఆలోచనల్లో పడిపోయారు.(సశేషం)
(ఆంగ్ల మూలం The Greatest Battle of Culture (The Story of Harappans) - పాణిగ్రాహి బేతి. తెలుగు అనువాదం: ఆడెపు లక్ష్మీపతి)
ఒక సాంస్కృతిక మహా సంగ్రామం మొదటి అధ్యాయం ఇక్కడ చదవండి