2026–27 కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న వేళ తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు ఈసారి అయినా మోక్షం లభిస్తుందా అన్న ఆశలు చిగురిస్తున్నాయి. కొన్నేళ్లుగా బడ్జెట్ కేటాయింపుల్లేక నిలిచిపోయిన కొత్త రైలు మార్గాలు, కోచ్ ఫ్యాక్టరీ వంటి కీలక ప్రతిపాదనలపై కేంద్రం దృష్టి సారించాలన్న డిమాండ్ మరింత ఉధృతమవుతోంది.దేశవ్యాప్తంగా వందే భారత్, నమో భారత్ రైళ్లకు ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర రైల్వే శాఖ, తెలంగాణలో మాత్రం కొత్త రైలు మార్గాల విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణలోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం.
2026- 27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ తో పాటు రైల్వేమంత్రిత్వశాఖ బడ్జెట్ కేటాయింపులు చేయనున్న నేపథ్యంలో తెలంగాణలోని పెండింగులో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని కొత్త ఆశలు ఏర్పడ్డాయి. తెలంగాణలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు గత కొన్నేళ్లుగా బడ్జెట్ లో రైల్వే మంత్రిత్వశాఖ పైసా విదల్చకుండా తీరని అన్యాయం చేస్తుంది. దీంతో తెలంగాణలోని ఏడుజిల్లాలకు రైల్వే కనెక్టివిటీనే లేదు. కొత్త రైలు మార్గాల నిర్మాణం ప్రతిపాదనల్లోనే మగ్గుతోంది.
Also Read - కేంద్ర బడ్జెట్: తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం దక్కుతుందా?
కాగితాల్లోనే కొత్త రైలు మార్గాల నిర్మాణం
కల్వకుర్తి నుంచి మాచర్ల,గద్వాల- డోర్నకల్ - మాచర్ల కొత్త రైలు మార్గాలను నిర్మించాలనే సీఎం ప్రతిపాదనలు రెండేళ్లుగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పెండింగులోనే ఉన్నాయి.తెలంగాణలోని కాజీపేట జంక్షన్ వద్ద ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి 2023 డిసెంబరు 26వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రిఫరెన్స్ నంబరు 54/ పీఎస్ సీఎం / 2023తో వినతిపత్రాన్ని సమర్పించారు.కాజీపేటలో పూర్తి స్థాయిలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే రైల్వే మంత్రిత్వశాఖ కాజీపేటలో పిరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించి పనులు చేపట్టింది.
మెట్రోరైలు ఫేజ్ 2కు నిధులేవి?
హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు ఫేజ్ 2 కింద కొత్తమార్గాలను నిర్మించేందుకు రూ.24,269 కోట్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి లేఖ రాసినా కేంద్రం స్పందించలేదు. వికారాబాద్ నుంచి పరిగి, కొడంగల్,చిట్లపల్లి, టేకల్ కోడే, రావులపల్లి, మాటూర్, దౌలతాబాద్, దామరగిద్ద, నారాయణపేట, మఖ్తల్ మీదుగా కృష్ణాను కలుపుతూ కొత్త రైలు మార్గానికి నిధులు కోరినా రైల్వేశాఖ నుంచి చలనం లేదు.మిర్యాలగూడ నుంచి పాపటపల్లి, జాన్ పహాడ్, డోర్నకల్, గద్వాల వరకు బ్రాడ్ గేజ్ రైల్వే లైను నిర్మాణం కోసం ఫైనల్ లొకేషన్ సర్వే జరిగినా, రైల్వేశాఖ నుంచి దీనికి నిధుల మంజూరు జాడ లేదు.రామగుండం -మణుగూరు మీదుగా మేడారం వరకు కొత్త రైలు మార్గాన్ని నిర్మిస్తే బొగ్గు రవాణాతోపాటు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులకు రైలు రవాణ సౌకర్యం ఏర్పడుతుందని ప్రతిపాదించినా రైల్వేశాఖ స్పందించ లేదు.
కొత్త రైలు మార్గాల నిర్మాణానికి కేంద్రం కనికరించదా?
కల్వకుర్తి నుంచి మాచర్ల,గద్వాల- డోర్నకల్ - మాచర్ల కొత్త రైలు మార్గాలను నిర్మించాలనే సీఎం ప్రతిపాదనలు రెండేళ్లుగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద పెండింగులోనే ఉన్నాయి. కాగితాల్లోనే మగ్గుతున్న కొత్త రైలు మార్గాల నిర్మాణానికి కేంద్రం కనికరించడం లేదు. ఈ సారి బడ్జెట్ లో అయినా ఈ ప్రతిపాదనలకు కేంద్రం పచ్చజెండా ఊపాలని కాంగ్రెస్ ఎంపీలు కోరారు.
కల్వకుర్తి నుంచి మాచర్లకు కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు 2024వ సంవత్సరం జనవరి నెలలో లేఖ నంబరు 662/k[రైల్వేస్/2024 తో లేఖ రాశారు.
ఈ రైలు మార్గాన్ని కల్వకుర్తి నుంచి వయా వంగూర్, దేవరకొండ, చలకుర్తి, తిరుమలగిరి మీదుగా మాచర్ల వరకు 100 శాతం రైల్వే నిధులతోనే నిర్మించాలని సీఎం కేంద్రరైల్వేశాఖ మంత్రికి ప్రతిపాదించారు. దీంతోపాటు గద్వాల- డోర్నకల్ - మాచర్ల వరకు 126 కిలోమీటర్ల దూరం కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు.
కలగానే మిగిలిన కాజీపేట ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణలోని కాజీపేట జంక్షన్ వద్ద ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి 2023 డిసెంబరు 26వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రిఫరెన్స్ నంబరు 54/ పీఎస్ సీఎం / 2023తో వినతిపత్రాన్ని సమర్పించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ సీఎం 2024 జులై 4వతేదీన డీఓ లెటర్ నంబరు 171 /పీఎస్ సీఎం/2024 నంబరుతో మరోసారి రాశారు. కాజీపేటలో పూర్తి స్థాయిలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే రైల్వే మంత్రిత్వశాఖ కాజీపేటలో పిరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించి పనులు చేపట్టింది. కానీ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సీఎంతో పాటు స్థానిక వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు.
వికారాబాద్-కృష్ణా కొత్త రైలు మార్గం నిర్మాణానికి నిధులివ్వండి
వికారాబాద్-కృష్ణా కొత్త రైలు మార్గం నిర్మాణానికి పచ్చజెండా ఊపి నిధులివ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి 2024 డిసెంబరు 11వతేదీన లేఖ నంబరు 594 /రైల్వేస్ / /2024తో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు రాశారు. వికారాబాద్ నుంచి పరిగి, కొడంగల్,చిట్లపల్లి, టేకల్ కోడే, రావులపల్లి, మాటూర్, దౌలతాబాద్, దామరగిద్ద, నారాయణపేట, మఖ్తల్ మీదుగా కృష్ణాను కలుపుతూ కొత్త రైలు మార్గానికి నిధులు కోరినా రైల్వేశాఖ నుంచి చలనం లేదు. కనీసం ఈ రైలు మార్గం నిర్మాణం విషయంలో రైల్వేశాఖ నుంచి స్పందన లేదు.
Source : facebook/Telangana cmo/ రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఎంపీలు
సర్వే దశలోనే 20 రైల్వే ప్రాజెక్టులు
మిర్యాలగూడ నుంచి పాపటపల్లి, జాన్ పహాడ్, డోర్నకల్, గద్వాల వరకు బ్రాడ్ గేజ్ రైల్వే లైను నిర్మాణం కోసం ఫైనల్ లొకేషన్ సర్వే జరిగినా, రైల్వేశాఖ నుంచి దీనికి నిధుల మంజూరు జాడ లేదు.
మిర్యాలగూడ- డోర్నకల్- గద్వాల రైల్వే లైను నిర్మాణానికి మజూరు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి 2024 డిసెంబరు 11వతేదీన రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు లేఖ నంబరు 594 / రైల్వేస్ /2024 పేరిట రాశారు.
అయితే దీన్ని రైల్వే శాఖ పెండింగులోనే ఉంచింది. హైదరాబాద్ నగర శివార్లలో కొత్తగా నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రీజనల్ రింగ్ రైలు మార్గాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖ మంత్రిని అభ్యర్థించింది.రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించాలనే ప్రతిపాదనలు చేసినా దీనికి రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తెలంగాణలో 20 ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులు సర్వే దశలోనే ఉన్నాయి. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సమర్పించిన మరో పది ప్రాజెక్టులకు రైల్వే నిధుల జాడ లేదు.
‘‘పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధుల పంపిణీ జరగడం లేదు.. ఈ బడ్జెట్‌పై మాకు చాలా అంచనాలు ఉన్నాయి, ఆర్థికశాఖమంత్రి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారని మేం ఆశిస్తున్నాం" అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కోల్ రైల్ కారిడార్ కు కాసులేవి?
కోల్ బెల్ట్ వాసుల చిరకాల కోరిక అయిన రామగుండం- మణుగూరు కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో విన్నవించారు. 207.80 కిలోమీటర్ల దూరం కొత్త రైలు మార్గం నిర్మాణానికి రూ.3,998 కోట్లతో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రైల్వేశాఖ సిద్ధం చేసినా, నిధులివ్వలేదు. ఈ రైలుమార్గం నిర్మాణం కోసం పెద్దపల్లి జిల్లాలోని మంథని, రామగిరి, కమాన్ పూర్, మలహర్, మణుగూరు, భూపాలపల్లి ప్రాంతాల్లో సర్వే చేసి భూసేకరణకు ప్రతిపాదించారు. ఈ రైలు మార్గం నిర్మిస్తే కోల్ కారిడార్ గా బొగ్గు రవాణాతో పాటు ప్రజా రవాణాకు అనుకూలంగా ఉంటుందని రైల్వే వర్గాలు నివేదిక ఇచ్చినా నిర్మాణంలో మాత్రం జాప్యం జరుగుతూనే ఉంది.
మేడారం సమ్మక్క సారలమ్మకు కొత్త రైల్వేలైన్ ఏది?
రామగుండం -మణుగూరు మీదుగా మేడారం వరకు కొత్త రైలు మార్గాన్ని నిర్మిస్తే బొగ్గు రవాణాతోపాటు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులకు రైలు రవాణ సౌకర్యం ఏర్పడుతుందని ప్రతిపాదించినా రైల్వేశాఖ స్పందించ లేదు. రామగుండం నుంచి కొత్తగూడెం, మణుగూరు వెళ్లాలంటే కాజీపేట జంక్షనుకు చేరుకొని అక్కడి నుంచి మహబూబాబాద్ మీదుగా 349 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. 207.80 కిలోమీటర్ల దూరం ఈ కొత్త రైలు మార్గాన్ని నిర్మిస్తే త్వరగా, నేరుగా గమ్యం చేరవచ్చు.
రైల్వేబోర్డుకు ఎంపీల ప్రతిపాదనలేవి?
దక్షిణమధ్యరైల్వే తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై పార్లమెంట్ సభ్యుల ప్రతిపాదనలను ఈ సారి రైల్వేబోర్డుకు పంపించలేదు. గతంలో బడ్జెట్ కంటే ముందు రాష్ట్రంలోని ఎంపీలతో సమావేశం నిర్వహించి వారి నుంచి తీసుకున్న కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలను రైల్వే జీఎం తీసుకోవాలి. కానీ ఈ సారి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎంపీల సమావేశమే నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లా కేంద్రాలకు రైల్వే కనెక్టివిటీ లేదు. నిర్మల్, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్,ములుగు, సూర్యాపేట, నారాయణపేట జిల్లాలకు రైల్వే లైన్లు లేవు. దీనిపై రైల్వేశాఖ నుంచి స్పందన లేదు.
తెలంగాణలో భూసేకరణ సమస్యలు
214 హెక్టార్ల భూసేకరణ సమస్యల కారణంగా తెలంగాణలో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టుల పూర్తికి జాప్యం జరుగుతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఇటీవల పార్లమెంటులో వ్యాఖ్యానించారు.ఈ ప్రాజెక్టులలో గుంటూరు–బీబీనగర్ డబ్లింగ్, ముద్ఖేడ్–మేడ్చల్ డబ్లింగ్ (31 హెక్టార్లు), మహబూబ్‌నగర్–ధోన్ డబ్లింగ్ (70 హెక్టార్లు), కాజీపేట–విజయవాడ మూడవ లైన్ (17 హెక్టార్లు) మనోహరాబాద్–కొత్తపల్లి కొత్త లైన్ (96 హెక్టార్లు) భూసేకరణ చేయాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా రైల్వే అభివృద్ధి వేగంగా సాగుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఈసారి 2026–27 కేంద్ర బడ్జెట్‌లో అయినా పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, ఏళ్లుగా ఎదురుచూస్తున్న జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.