ఆలకించు అర్మాన్… ఆలకించు
x

ఆలకించు అర్మాన్… ఆలకించు

నేటి మేటి కవిత: వనజ తాతినేని.


అర్మాన్..

నీ ఇంటి వైపు చూస్తూ వెళ్ళే బాటసారుల దాహం

తీర్చడానికి మంచినీటి బావినొకటి తవ్వించు

కానీ నువ్వు చేదవి కాకు.

తేనీటి ఆతిథ్యానికి వచ్చిపోయే వరుసైన వారికి

నీ దాహ పాత్రను అరువు ఇవ్వకు.

చాంచల్యం తో వన్నెచిన్నెలను వలగా వేసి వారిని బంధించకు

వీరెవ్వరూ నీ వాడు కాలేరు..

అతనికిచ్చిన వాగ్దానం మరిచావా?

అతను సంచారిగా వున్నాడు. లక్ష్యాన్ని ప్రవాహాన్ని కలగంటున్నాడు.

అనేక సంగతులను మేలి ముసుగును కలగంటున్నాడు

అతని వలపుని గులకరాయిని చేసి విసిరి పడేయకు.

ఏరిపారేసిన గవ్వలకు విలువ వుంటుంది. కొద్దిగా ఓపిక వహించు

ఎవరెన్ని మణి రత్నఖచిత భూషణములు బహుకరించినా

అవి అతని పాద ధూళి కి సమానం కాదు.

నువ్వు అతని దానివి గానే వుండు.

అతను ప్రమాణం చేసాడు అన్యులను ఊహించనని

ముసలి ఒగ్గు అయిన తల్లిని చూడటానికి కూడా

వెళ్ళకుండా నీ వద్దకే వస్తాడు

తన ప్రాణాలను నీ పాదాల వద్ద పణంగా ఉంచుతాడు.

తన గుండెను గొంతుగా మార్చి

పహాడి రాగంలో పాటలు పాడి నిన్ను సంతోషంతో అలరిస్తాడు.

కొన్ని పాటలను నీలోఫర్ పుష్పాలుగా మార్చి నీ కొప్పులోన అలంకరిస్తాడు.

పాల లోయ మధ్య వున్న సరస్సుల్లో నిను విహరింపజేస్తాడు.

తన ప్రేమతో నీకు శాశ్వతత్వాన్ని ప్రసాదించగల నేర్పరి అతడు

ఇంతకన్నా విలాసవంతమైన దాంపత్యం వుంటుందా?

కాలం కఠినం అయితే అర్థాకలితో నైనా అలమటిస్తాం

సంగీతం తాగి రోజులు వెళ్ళమారుస్తాం అని నువ్వే అన్నావు.

ఆ నాటిని గుర్తు చేసుకో! నీ ఆనందం అవసరార్థం వలసపోయింది అంతే!

పక్షి తిరిగి రాకుండా వుంటుందా?

ఎప్పుడో దుఃఖం మేఘంలా కమ్ముకొస్తుందని

ఇప్పటి సంతోషాన్ని చెడగొట్టుకోవాలా?

ఎప్పుడో సంతసం వస్తుందనే ఆశతో

ఇప్పడు దుఃఖాన్ని బలవంతంగా ఆహ్వానిస్తారా?

మనిషికి ఎప్పుడు ఏది లభిస్తే దానికి దోసిలి పట్టాలి

ఇరు దోసిళ్ళతో హృది ని నింపుకోవాలి.

జీవితం భోగించడానికి కాదు

భావించడానికి అనే ఎరుకలో ఉండాలి

నువ్వు మాత్రం గుండె ని జోలెని చేసి

ఎవరినో ప్రేమని అర్ధించడం అవమానం కదూ

చినుకులనే విదిలించిన కర్కసి అపహాస్యం మరణం కాదూ!

అది రానంత వరకూ… ముగింపుకి రాని, ప్రారంభంతో పని లేని

వయనం ఎక్కడినుండైనా మొదలెట్టవచ్చు

ముడిపడిపోయే తత్వం వుంటే పేద హృదయంతో పందిరి అల్లుకోవచ్చు.

ప్రారంభం ముగింపు లేని దుఃఖం ఎప్పుడైనా కమ్మేయవచ్చు

నువ్వు ఆశించే ఈ సుఖం దుఃఖం నీడ మాత్రమే

అవిభక్తమైన నువ్వు మనసుతో అనేకంగా విభజించబడకు.

ఎండమావుల వైపు పరుగులు తీయకు.

మురికి కూపంలో పడిపోకు. ఆడిన మాటను నిలబెట్టుకో..

ఇదిగో.. ఈ లేఖలో నా మిత్రుడు తన ప్రాణాలను

అక్షరాల దండగా చేసి పంపాడు. తెంపి పడేయకు

ఆ పేద యెదకు ముళ్ళు గుచ్చకు.

హృదయాన్ని ఆట బొమ్మగా చేసి ఆడుకోవడం న్యాయమేనా?

మధుపాత్రను పగలకొట్టకు.

దెయ్యంగా వుంటావో దేవతగా మన్ననలందుకుంటావో నీ యిష్టం.

అతని యోగ్యతను ప్రేమ లోని గాఢతను పరిహసించకు.

దిగులు రాగాలను బహుకరించకు.

హీర్ రాంఝా, సోహ్ని మహీవాల్ , లైలా మజ్నూ,

సలీం అనార్కలి,దేవదాసు పార్వతి కథలను గుర్తు చేసుకో..

నిలువెత్తు కష్టాల్లో మునిగి విరహాగ్నిలో మండి ప్రాణాలు త్యజించి

పులుకడిగిన ముత్యంలా స్వచ్ఛంగా మెరిసిపోయారు

చరిత్రలో నిలిచిపోయారు.

నిన్ను అంతటి వారిగా ఖ్యాతిగాంచమని

అనడంలేదు. సొమ్ములకు అమ్ముడుచెందకు అని బతిమాలుకుంటున్నా

ఇష్క్ పతాకాన్ని గర్వంగా ఎగరనీయ్.

అతనికి ప్రియ మిత్రుడినన్నమాటే కానీ..నేను నీకూ హితుడిని

దయచేసి నా మాట ఆలకించు ఆర్మాన్ .. ఆలకించు.



Read More
Next Story