
ఎకనామిక్ సర్వే సంకేతాలు: 7 శాతం వృద్ధిపై ఆశలు
ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2026. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. అంచనాలు, సవాళ్లు ..
ఫిబ్రవరి 1… ఆదివారం… దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కీలక ఘట్టం. యూనియన్ బడ్జెట్ 2026తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త చరిత్రకు సిద్ధమయ్యారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా, ఆదివారం రోజున బడ్జెట్ చదివే తొలి ఆర్థిక మంత్రిగా ఆమె నిలవనున్నారు. ఇదే తాజా అప్‌డేట్‌గా రాజకీయ, ఆర్థిక వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం కాలక్రమంలో మారింది. 1999 వరకు సాయంత్రం ఐదు గంటలకు బడ్జెట్ చదివే పద్ధతి ఉండేది. అదే ఏడాది యశ్వంత్ సిన్హా ఉదయం పదకొండు గంటలకు మార్చారు. ఆ విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. 2017లో అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి చివరి నుంచి ఫిబ్రవరి 1కి ముందుకు తీసుకొచ్చారు. నిర్మలా సీతారామన్ ఇప్పటికే 2020, 2025లో శనివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఈసారి ఆదివారం మరో మైలురాయి చేరనుంది.
యూనియన్ బడ్జెట్ 2026 కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయ అంచనాలను వెల్లడించనుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యానికి ఇది కీలక పునాదిగా భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతున్నప్పటికీ, ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి, భౌగోళిక రాజకీయ పరిణామాలు సవాళ్లుగా మారాయి.
ఆర్థిక లోటును జీడీపీలో 4.5 శాతం కంటే దిగువకు తీసుకెళ్లాలన్న లక్ష్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత బడ్జెట్లలో మౌలిక వసతులపై ఖర్చు పెరగగా, అదే ఊపు కొనసాగుతుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
బడ్జెట్‌కు ముందు పరిశ్రమ వర్గాలు తమ అంచనాలు వెల్లడించాయి. మౌలిక వసతులు, తయారీ రంగంపై పెట్టుబడులు కొనసాగించాలని సూచించాయి. టెక్నాలజీ రంగం, స్టార్టప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ హైడ్రోజన్ అంశాల్లో స్పష్టత కోరుతున్నాయి.
ఎకనామిక్ సర్వే అంచనాల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.8 నుంచి 7.2 శాతం మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు సాధారణంగా కొనసాగనున్నాయి. పన్నుల విధానం, రంగాల వారీ కేటాయింపులపై ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, యూనియన్ బడ్జెట్ 2026 దేశ ఆర్థిక ప్రయాణంలో మరో కీలక మలుపుగా నిలవనుంది.
Live Updates
- 1 Feb 2026 11:13 AM IST
ఆంధ్రప్రదేశ్ లో రేర్ ఎర్త్ కారిడార్ కు మద్దతు
ఆంధ్రప్రదేశ్ లో రేర్ ఎర్త్ కారిడార్ కు మద్దతు. కేరళ, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు ఈ సహాయం అందుతుంది.
- 1 Feb 2026 11:13 AM IST
బడ్జెట్ 2026 ప్రత్యక్ష అప్‌డేట్స్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ “కర్తవ్య మంత్రం”ను వివరించారు. ప్రభుత్వం పేదలు, వెనుకబడినవారు, నిరుపేద వర్గాలపై దృష్టి పెట్టాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోందని ఆమె తెలిపారు.
ఈ సంకల్పాన్ని నెరవేర్చేందుకు, కార్తవ్య భవన్‌లో సిద్ధం చేసిన తొలి బడ్జెట్‌గా ఇది మూడు కర్తవ్యాల నుంచి ప్రేరణ పొందిందని చెప్పారు.
మొదటి కర్తవ్యం ఉత్పాదకత, పోటీ సామర్థ్యాన్ని పెంచుతూ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, ప్రపంచ స్థాయి అనిశ్చిత పరిస్థితులకు తట్టుకునే బలాన్ని నిర్మించడం అని పేర్కొన్నారు.
రెండో కర్తవ్యం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, వారి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భారత సమృద్ధి మార్గంలో వారిని బలమైన భాగస్వాములుగా తీర్చిదిద్దడం అని తెలిపారు.
మూడో కర్తవ్యం “సబ్కా సాథ్, సబ్కా వికాస్” దృష్టితో ప్రతి కుటుంబం, సమాజం, ప్రాంతం, రంగానికి అవసరమైన వనరులు అందుబాటులో ఉండేలా చూడడం అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
- 1 Feb 2026 11:11 AM IST
బయో ఫార్మా శక్తి రు. పదివేల కోట్లోతో ప్రారంభం. దేశంలో నాన్ కమ్యూనికబుల్ జబ్బుల నివారణకోసం ఈ పథకం
బయో ఫార్మా శక్తి రు. పదివేల కోట్లోతో ప్రారంభం. దేశంలో నాన్ కమ్యూనికబుల్ జబ్బుల నివారణకోసం ఈ పథకం పనిచేస్తుంది.
- 1 Feb 2026 11:08 AM IST
బడ్జెట్ ప్రసంగం మొదలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదో బడ్జెటో ప్రసంగం లోక్ సభలో ప్రారంభమయింది. మాఘపూర్ణిమ శుభ ఘడియ, సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.
- 1 Feb 2026 10:53 AM IST
కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షురాలిగా నటి జయమాల ఎన్నిక
కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) నిర్మాత BM హరీష్‌ను ఓడించి, నటి, మాజీ మంత్రి జయమాల అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. KFCC తన 2025–26 ఎన్నికల ఫలితాలను శనివారం (జనవరి 31) ప్రకటించింది.
కన్నడ చిత్ర పరిశ్రమలో సీనియర్ వ్యక్తి జయమాల, నటన, నిర్మాణం మరియు చలనచిత్ర సంబంధిత ప్రజా సేవలో సుదీర్ఘ కెరీర్‌ను కలిగి ఉన్నారు. ఆమె జెడి(ఎస్)-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో స్త్రీ మరియు శిశు అభివృద్ధి మంత్రిగా, అలాగే కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు.
ఛాంబర్ ప్రకటించిన ఫలితాల ప్రకారం, సుందర్ రాజన్ ఎంకే వైస్ ప్రెసిడెంట్ (నిర్మాత) పదవిని గెలుచుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ (డిస్ట్రిబ్యూటర్) విభాగంలో, మంజు కె విజయం సాధించారు. కిషోర్ కుమార్ ఎంఎన్ వైస్ ప్రెసిడెంట్ (ఎగ్జిబిటర్)గా ఎన్నికయ్యారని ఛాంబర్ తెలిపింది.
గౌరవ కార్యదర్శి (పంపిణీదారు) పదవికి, లికిత్ అని కూడా పిలువబడే రమేష్ బాబు MR ఎన్నికయ్యారు, అశోక్ KC గౌరవ కార్యదర్శి (ప్రదర్శనకారుడు)గా ఎన్నికయ్యారు. జయసింహ ముసూరి BK గౌరవ కోశాధికారిగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన ఆఫీస్ బేరర్లు 2025–26 కాలానికి పదవిలో ఉంటారని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది.
- 1 Feb 2026 10:36 AM IST
కెసిఆర్ ఇంటి వద్ద భారీ బందోబస్త్
టెలిఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసు శాఖ హై అలర్ట్.
హైదరాబాద్ లోని నందినగరోొ కెసిఆర్ నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు.
బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉన్నందున తగిన ముందస్తు చర్యలు తీసుకొవాలని ఆదేశాలు ఇచ్చారు.
ఈ రోజు సిట్ విచారణ పూర్తయ్యేంత వరకు ఎక్కడిక్కడ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.
- 1 Feb 2026 10:29 AM IST
యూనియన్ బడ్జెట్ 2026-27 భారత్‌ను “వికసిత భారత్” దిశగా మరో అడుగు అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఆదివారం ఆయన బడ్జెట్‌ను వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా అభివర్ణించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో వరుసగా తొమ్మిదో యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన షెకావత్ గత 11 ఏళ్లుగా ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్యంతో పనిచేస్తోందని చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతి బడ్జెట్ ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశలో అడుగులుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ కూడా అదే దిశలో మరో కీలక అడుగుగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ యూనియన్ బడ్జెట్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ బడ్జెట్ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకే అనుకూలంగా ఉంటుందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
ఆర్థిక మంత్రి తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊరట కల్పిస్తారా, రైతుల కోసం ఏమైనా చేస్తారా, ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు ఉంటాయా అని ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని, పెట్టుబడిదారులు భారత్‌కు రావడం లేదని ఆరోపించారు. పెట్టుబడులపై దృష్టి పెడతారా లేక బడ్జెట్ ఎన్నికల రాష్ట్రాలకే పరిమితం అవుతుందా అని తివారీ ప్రశ్నించారు.
- 1 Feb 2026 10:26 AM IST
రూ.12 లక్షల కోట్లకు చేరనున్న క్యాపెక్స్ !
బడ్జెట్ 2026లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం (క్యాపెక్స్) రూ.12 లక్షల కోట్లను దాటే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బృందం రోడ్లు, పోర్టులు, ఇంధన ఆస్తుల వంటి రంగాల్లో పెట్టుబడులను కొనసాగిస్తూ క్యాపెక్స్‌ను జీడీపీలో సుమారు 3.2 శాతం స్థాయిలో నిలబెట్టనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
బ్లూమ్‌బర్గ్ న్యూస్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 29 మంది విశ్లేషకుల మధ్యస్థ అంచనా ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో క్యాపెక్స్ రూ.12 లక్షల కోట్లను దాటి, ప్రస్తుత సంవత్సరానికి అంచనా వేసిన రూ.11.2 లక్షల కోట్లను మించనుంది.
పాఠకుల కోసం చిన్న వివరణ: క్యాపెక్స్ అంటే ప్రభుత్వం లేదా సంస్థలు రోడ్లు, పోర్టులు, విద్యుత్ కేంద్రాలు, యంత్రాలు వంటి భౌతిక ఆస్తులను నిర్మించడానికి, మెరుగుపరచడానికి, నిర్వహించడానికి చేసే పెట్టుబడులు. ఇవి దీర్ఘకాలిక విలువను సృష్టించే అభివృద్ధి వ్యయంగా పరిగణిస్తారు.
- 1 Feb 2026 10:23 AM IST
మొదలైన బడ్జెట్ ప్రసంగం
కేంద్ర బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. అనంతరం పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ప్రస్తుతం నిర్మలా సీతారామన్.. లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఆ తర్వాత ఆమె రాజ్యసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
- 1 Feb 2026 10:21 AM IST
యూనియన్ బడ్జెట్ 2026-27కు ముందు బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు భారీగా పడిపోయాయి. ఇటీవలి రికార్డు స్థాయి ర్యాలీ తర్వాత పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ కొనసాగించడంతో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ధరలు 9 శాతం వరకు క్షీణించి లోయర్ సర్క్యూట్ స్థాయికి చేరాయి.
ఈ పతనం వరుసగా రెండో రోజు కొనసాగింది. ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధర ₹13,711 తగ్గి 10 గ్రాములకు ₹1,38,634కు చేరింది. ఈ స్థాయిలోనే లోయర్ సర్క్యూట్‌ను తాకినట్లు సమాచారం.

