Tushar Gandhi
x

ప్రజల కన్నీళ్లపై స్మారక చిహ్నాలు తగదు: తుషార్ గాంధీ

ముసీ నది వద్ద ఇళ్లను కూల్చివేసి గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఆయన సిద్ధాంతాలకు విరుద్ధమని తుషార్ గాంధీ ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు.


మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంపై ఎన్ని విమర్శలొచ్చినా, బాధితులు తీవ్రంగా వ్యతిరేకించినా కాంగ్రెస్ వాటిని పెడచెవిన పెట్టింది. అలాంటిది ఈ విషయంలో గాంధీ మునిమనవడు చేసిన వ్యాఖ్యలతో హస్తం పార్టీకి భారీ షాక్ తగిలింది. మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించడమే ఇందుకు కారణం.

అందులోనూ వందల కుటుంబాలు ఉంటున్న అపార్ట్‌మెంట్ ఖాళీ చేయించాలన్న ఆలోచనపై తుషార్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. మూసీ ఒడ్డున భారీ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే అక్కడ ఉన్న మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయాలని అందులో ఉంటున్న కుటుంబాలకు నోటీసులు ఇచ్చింది.

Also read: తెలంగాణ పాలిటిక్స్‌లో ‘మధు పార్క్ రిట్జ్’ చిచ్చు!

ఇది కాస్తా తీవ్ర వివాదంగా మారింది. రాజకీయ పార్టీల మధ్య విమర్శల తూటాలు కూడా పేల్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆలోచనపై గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీనిని వెంటనే ఆపేయాలని కోరారు. గాంధీ కూడా దీనిని కోరుకోరని, ఇది గాంధీయన్ చర్య ముమ్మాటికీ కాదని వ్యాఖ్యానించారు.

ఈమేరకు ఆయన ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. విగ్రహ ఏర్పాటు కోసం పేదల ఇళ్లను కూల్చివేయడం, వారిని నిరాశ్రయులను చేయడం మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. "గాంధీ ఈరోజు బ్రతికి ఉన్నా.. నా పేరుతో ఇలాంటి పనులు వద్దని ఖచ్చితంగా చెప్పేవారు" అని ఆయన పేర్కొన్నారు. ప్రజల కన్నీళ్లపై స్మారక చిహ్నాలు నిర్మించడం తగదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కోరారు.

అభివృద్ధి పేరుతో సామాన్యులను ఇబ్బందులు పెట్టవద్దని, గాంధీ ఆశయాలకు విలువిస్తూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మూసీ నది సుందరీకరణలో భాగంగా ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, దీనిపై తుషార్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ , సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read More
Next Story