మూసీ ప్రాజెక్టు మీద రాజకీయ గబ్బు!
x
source: inkpointmedia

'మూసీ' ప్రాజెక్టు మీద రాజకీయ గబ్బు!

హైదరాబాద్ తెల్ల షర్టు మీద కిళ్లీ మరకలా వెక్కిరిస్తుంది మూసీ నది. ఎందుకలా జరిగింది.


వారసత్వ సంపద, ఆధునిక హంగుల విశేష కలబోత అయిన హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో ముందు వరసలో ఉంటుంది. పాతకొత్తల అద్భుత సంగమం అయిన ఈ నగరంలో స్థిరపడడానికి అందుకే ఎక్కువ మంది ఉవ్విళ్లూరతారు. చెన్నై, కొలకతా లలో మాదిరిగినా ఎక్కువ ఉక్కపోత ఇక్కడ ఉండదు. న్యూఢిల్లీ తదితర ఉత్తరాది నగరాల్లో మాదిరిగా అతివృష్టి, అనావృష్టి లాగా తట్టుకోలేని ఎండలు ఉండవు. భరించలేని వర్షాలు, తుఫాను ముప్పులు కూడా ఉండవు. ముంబాయి, చెన్నైల్లో లాగా మరీ మురికివాడలు ఉండవు. బెంగుళూరుతో పోటీపడే చల్లని వాతావరణం ఇక్కడ ఉంది. ఫార్మా, ఐటీ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలతో పాటుగా మినీ ఇండియాను తలపించే భిన్న సంస్కృతులు ఇక్కడ దశాబ్దాలుగా వర్ధిల్లుతున్నాయి. అందుకే హైదరాబాద్ కు డిమాండ్ ఉంది. ఇంత మంచి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్, సిటీలో కొత్త పాత బస్తీలను వేరు చేస్తూ 57 కిలోమీటర్లు ప్రవహించే దాని మాతృక మూసీ నది తెల్ల షర్టు మీద కిళ్లీ మరకలా వెక్కిరిస్తున్నాయి.


తెలుగు ప్రజల జీవనాడి కృష్ణా నదికి ఉప నది మూసీ. ఒకప్పుడు ఇది మంచి నీటి నది కానీ కాలక్రమేణా గబ్బు గబ్బు అయ్యింది.

1908 సెప్టెంబర్ లో మూసీ నది ఉగ్రరూపం దాల్చి సుమారు 15000 మందిని పొట్టనపెట్టుకుని ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కళ్ళు తెరిపించింది. నిజాం ప్రభువు ప్రత్యేక చొరవతో ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తయారుచేసిన సమగ్ర నీటి ప్రణాళికలో భాగంగా నిర్మితమైన గండిపేట (ఉస్మాన్ సాగర్), హిమాయత్ సాగర్ జలాశయాలు 1930, ‌1954, ‍1970, 2000 సంవత్సరాల్లో వరదలు వచ్చినా ప్రాణనష్టం కాకుండా కాపాడాయి. విదేశాల్లో నగరాల మధ్య గుండా ఒయలొలుకుతూ పోయే నీటి ప్రవాహాల మాదిరిగా మూసీని కూడా నగర సుందరీకరణలో భాగం చేసే పని తదనంతరం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేపట్టి దాని పరివాహక ప్రాంతాల్లో పార్కులు నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పరిశ్రమల యజమానులు, ప్రజలు ఎడాపెడా మూసీని కాలుష్య కాసారంలా మారుస్తుంటే, ఇంకొందరు ప్రవాహ ప్రాంతాన్ని కబ్జా చేసి ఇళ్ళు కట్టుకుంటుంటే ప్రభుత్వాలు ఓటు బ్యాంకు మీద దృష్టితో కిమ్మనకుండా ఉన్నాయి.

ముక్కుపుటాలు బద్దలు కొట్టే మూసీని పట్టించుకోండని మేధావులు, రచయితలు, కవులు, ఉద్యమకారులు చేసిన విజ్ఞప్తులు అరణ్యరోదనే అయ్యాయి. మూసీలో కలుషిత నీటి వల్ల భూగర్భ జలాలు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని జిట్టా బాలకృష్ణా రెడ్డి లాంటి వారు ప్రస్తావించినా లాభం లేకపోయింది. మూసీని బాగుచేయాలన్న ఆలోచన అడపాదడపా చేసినా అందుకు తగిన చిత్తశుద్ధి, నిధులు ఖర్చుచేసే ఉదారత పాలకులకు కొరవడింది.

1997 లో తెలుగుదేశం ప్రభుత్వం 'నందనవనం' ప్రాజెక్టులో భాగంగా ఒక వెయ్యి కుటుంబాలకు వసతి కల్పించింది గానీ మిగిలిన పనులు చేయలేకపోయింది. 2005 లో కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేసినా పెద్దగా పట్టించుకోలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వల్ల 2014 లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పగ్గాలు చేపట్టినా 2017 వరకూ మిన్నకుంది. 2017 మార్చి 25న జీవో నెం.90 ద్వారా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి కార్యాచరణకు ఉపక్రమించింది. అప్పుడు గానీ ఈ ప్రాజెక్టుకు కొంత ఊపువచ్చింది. 16, 634 కోట్ల రూపాయలతో మూసీని మంచిగా చేయాలని అనుకున్న ప్రభుత్వం ప్రాధాన్యతలు మారి డబ్బుకు ఇబ్బంది అయి గబ్బు మూసీని వదిలేసిందన్న విమర్శలు ఉన్నాయి. మూసీ వల్ల 11 వేల స్ట్రక్చర్స్ ను తొలగించాల్సి ఉంటుందని, దీనివల్ల నిరాశ్రయులయ్యే వారు లక్ష మంది దాకా ఉన్నారనీ, అందుకే తమ అధినేత కే సీ ఆర్ సూచన మేరకు ఆ పనిచేయలేదని మాజీ మంత్రి కే టీఆర్ చెప్పారు.

చంద్రశేఖర్ రావు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు తోసిరాజని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ బడ్జెట్ తో చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ దుమారం లేపుతున్నాయి. మొత్తం పాతిక కోట్లతో అయ్యే పనికి రేవంత్ ప్రభుత్వం లక్షా యాభై వేల కోట్లు ఖర్చుపెట్టి 'లూటిఫికేషన్' చేయబోతున్నారని బీ ఆర్ ఎస్ ఆరోపిస్తోంది. అసలే ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న వాతావరణంలో ఉభయ పక్షాలు మూసీ ని ముందుకు తీసుకుపోయేట్లు కనిపించడం లేదు. ఇప్పుడు మూసీ పొలిటికల్ గేమ్ లో చిక్కుకుంది.

మూసీ కి పూర్వ వైభవం తేవాలంటే చేయాల్సినవని నాలుగు పనులు. ఒకటి, భవిష్యత్ ను కూడా దృష్టిలో పెట్టుకుని రూపొందించే మాస్టర్ ప్లాన్. రెండు, ఒక్క పాలక పక్షమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలను, పౌర సమాజాన్ని ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం. మూడు, ఏకంగా మూసీలో నివసిస్తున్న వేల మందికి ప్రత్యామ్నాయ నివాస వసతి ఏర్పాటు చేయడం. నాలుగు, మూసీ పరివాహక ప్రాంత సుందరీకరణ.

హైడ్రా తో అక్రమ నిర్మాణాలు కూలుస్తూ సంచలనం సృష్టిస్తున్న రేవంత్ రెడ్డి కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే బాగుండేది. మూసీ కి అయ్యే ఖర్చు మీద భిన్న ప్రకటనలు చేయడం ద్వారా ఆయన ప్రధాన ప్రతిపక్షానికి చెలరేగిపోయే వీలు కల్పించారు. తాను అనుకుంటున్నది మూసీ సుందరీకరణనా? ప్రక్షాళనా? లేక, పునరుజ్జీవమా? అన్న స్పష్టత ఆయనకు లేదన్న అభిప్రాయం కలిగింది. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినాయకత్వానికి ఫండ్స్ పంపడానికి మూసీ మీద పెట్టదలచిన ఖర్చు ను అమాంతం లక్షన్నర కోట్లకు పెంచారని కే టీ ఆర్ అంటున్నారు. నిజంగానే, ఆయన అన్నట్లు పాత ప్రభుత్వం ఆలోచన ముందుకు తీసుకెళ్లే అవకాశం చూడకుండా రెడ్డొచ్చె మొదలాట లాగా డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీ పీ ఆర్) కోసం 140 కోట్లు వెచ్చించాలనుకోవడం విమర్శలకు దారితీస్తోంది. 2,400 కిలోమీటర్లు ఉన్న గంగానది ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామీ గంగే ప్రాజెక్ట్ కు రూ. 40 వేల కోట్లతో పూర్తి చేస్తే, 55 కిలోమీటర్ల పొడవున్న మూసీకి లక్షన్నర కోట్లు ఎందుకున్న ప్రశ్నకు ప్రభుత్వం గట్టి సమాధానం చెప్పాలి.

మూసీ ముచ్చట రాగానే మంత్రులు, అధికారుల బృందం లండన్‌లోని థేమ్స్ నది ప్రస్తావన తెస్తారు. అక్కడికి బృందాలుగా వెళ్లి చూసి వస్తారు. ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లి ఆ నది పాలక మండలితో భేటీ అయ్యారు. రెండు శతాబ్దాల కిందట పారిశ్రామిక విప్లవపు దుష్పరిణామాలకు బలై 1950 మధ్య నాటికే పూర్తిగా జీవ రహితమైన ఆ నది పునరుద్ధరణ వెనుక పెద్ద కసరత్తు జరిగింది. మూసీ విషయంలో సూచనలు చేయండని రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో అడిగితే బాగుండేది. వాళ్ళను నోటికొచ్చినట్లు తిడుతూ సహకారం ఇవ్వాలంటే ఎలా ఇస్తారు?

రేవంత్ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశంలో చేసిన ప్రసంగం, మర్నాడు కే టీ ఆర్ పార్టీ కార్యాలయంలో చేసిన వ్యాఖ్యలు, తెలంగాణా ఖజానా పరిస్థితి చూస్తే మూసీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అయ్యేట్లు కనిపిస్తోంది.

హిరోషిమా,నాగసాకిలలో పడిన అణుబాంబు కంటే మూసీ ఆక్రమణ ప్రమాదకరమనీ, ఇతర నదుల పేర్లు పెట్టుకుంటున్నట్లు మూసీ పేరు తల్లిదండ్రులు పిల్లలకు పెట్టుకోలేకపోతున్నారని రేవంత్ అన్న మాటలు అక్షర సత్యం. ఎంఐఎం, బీజేపీ, బీఆరెస్, కమ్యూనిస్టు పార్టీలతో పాటు పౌర సమాజాన్ని, ఫోరమ్ ఫోర్ గుడ్ గవర్నెన్స్ వంటి సంస్థలను కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా ఓటెద్దు పోకడలతో వ్యవహరిస్తే మూసీ కి శాశ్వత పరిష్కారం కల్ల.

(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రచయిత సొంత అభిప్రాయలు. భిన్నాభిప్రాయలకు ‘తెలంగాణ-ఫెడరల్’ వేదికగా పనిచేస్తుంది)


నేటి అద్భుతమయిన టీ కవిత కూడా చదవండి





Read More
Next Story