నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా.. అవన్నీ ఆరోపణలే: దానం
x

నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా.. అవన్నీ ఆరోపణలే: దానం

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇచ్చిన అఫిడవిట్‌పై స్పందించిన స్పీకర్, సుప్రీం కోర్టు గడువు నేపథ్యంలో అనర్హత పిటిషన్లపై విచారణకు తేదీ ఖరారు చేశారు.


ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై వస్తున్న ఫిరాయింపు ఆరోపణలపై స్పందించారు. అసలు తాను పార్టీనే మారలేదన్నారు. తనపై వస్తున్నవన్నీ కూడా అసత్య ఆరోపణలేనని ఆయన అన్నారు. దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై ఈ నెల 30న విచారణ జరగనుంది. తాజాగా దానం నాగేందర్ సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.

పార్టీ మారలేదు: దానం నాగేందర్

నేను ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి సభ్యుడినే. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. నాపై పార్టీ నుంచి ఎలాంటి సస్పెన్షన్ లేదా బహిష్కరణ ఉత్తర్వులు కూడా జారీ కాలేదు అని స్పీకర్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో దానం పేర్కొన్నారు.

2024 మార్చిలో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశానికి వ్యక్తిగత హోదాలో మాత్రమే హాజరయ్యానని తెలిపారు. మీడియా కథనాల ఆధారంగా తనను పార్టీ మారినట్లుగా చిత్రీకరించడం సరికాదని వివరించారు.

Also Read - దానంకు కౌంట్ డౌన్ త్రీడేసేనా ?

అనర్హత పిటిషన్లపై అఫిడవిట్‌లో వివరణ

బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలన్నింటికీ దానం నాగేందర్ అఫిడవిట్‌లో సమాధానం ఇచ్చారు. గత కోర్టు తీర్పుల ప్రకారం తనపై చూపిన కారణాలు చట్టపరంగా చెల్లవని పేర్కొన్నారు. కీలకమైన వాస్తవాలు, సరైన ఆధారాలు లేకుండా కేవలం మీడియా కథనాల ఆధారంగా పిటిషన్ దాఖలైందని తెలిపారు. అందువల్ల ఈ పిటిషన్‌ను ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని స్పీకర్‌ను కోరారు.

30న రెండు పిటిషన్లపై విచారణ

దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విడివిడిగా అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఈ నెల 30న స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. ఉదయం 10.30 గంటలకు కౌశిక్‌రెడ్డి పిటిషన్‌, మధ్యాహ్నం 12 గంటలకు మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌పై వాదనలు విననున్నారు.

సుప్రీం కోర్టు సూచనలతో వేగమైన విచారణ

బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం కోర్టు సూచన మేరకు స్పీకర్ ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను పార్టీ మారినట్లు ఆధారాలు లేవని కొట్టివేశారు. మరో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌పై విచారణ పూర్తయినా నిర్ణయం ఇంకా ప్రకటించాల్సి ఉంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులపై విచారణ మిగిలి ఉంది.

గడువుకు ముందే కీలక పరిణామాలు

సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగియనుండటంతో స్పీకర్ కార్యాలయం చర్యలు వేగవంతం చేసింది. దానం నాగేందర్ అఫిడవిట్‌పై అభ్యంతరాలు లేదా అదనపు ఆధారాలుంటే ఈ నెల 30లోపు సమర్పించాలని పిటిషనర్లను కోరింది.

Read More
Next Story