Maharashtra Politics | వాగ్దానాల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయండి..
‘అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లు, రాజకీయ పార్టీలు గెలిచిన స్థానాల మధ్య పోలిక తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి’ - శరత్ పవార్
మహారాష్ట్రలో మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఓటమిపై ప్రతిపక్షాలు నిరాశ చెందాల్సిన పనిలేదని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ‘లడ్కీ బహిన్’ పథకం ఆర్థిక సహాయాన్ని రూ.1500 నుంచి రూ.2100కి పెంచడంతోపాటు ఎన్నికల వాగ్దానాలన్నింటినీ వీలైనంత త్వరగా అధికార కూటమితో అమలు చేయించే దిశగా ప్రతిపక్షాలు పనిచేయాలని సూచించారు.
"మనం ఎన్నికలలో ఓడిపోయిన మాట వాస్తవమే. ఫలితాల పట్ల ప్రజల్లో ఎలాంటి ఉత్సాహం కనిపించడం లేదు. ఓటమి గురించి చింతించకుండా తిరిగి ప్రజల్లోకి వెళ్లాలి." అని పవార్ విలేకరుల సమావేశంలో అన్నారు.
ఆ డిమాండ్ చేయలేం..
నవంబర్ 20న జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ-ఎన్‌సీపీ-శివసేన కూటమి 288 స్థానాలకు గాను 230 స్థానాల్లో విజయం సాధించింది. తమకు అవసరమైన సంఖ్యాబలం లేనందున ప్రతిపక్ష నాయకుడిని తప్పనిసరిగా నియమించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయలేవని పవార్ చెప్పారు. వ్యక్తిగతంగా పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (SP), కాంగ్రెస్ లేదా సేన (UBT) సహా ప్రతిపక్ష పార్టీలు ఏవీ కనీసం 29 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోలేక పోయాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష బలం తక్కువగా ఉందని, అయితే యువ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రెండు సెషన్ల తర్వాత తమ సత్తా చాటుతారని పవార్ పేర్కొన్నారు.
ఆశ్చర్యంగా ఉంది..
అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లు, రాజకీయ పార్టీలు గెలిచిన స్థానాల మధ్య పోలిక తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ‘‘కాంగ్రెస్ 80 లక్షల ఓట్లు సాధించి 15 సీట్లు గెలుచుకోగా, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 79 లక్షల ఓట్లతో 57 స్థానాల్లో విజయం సాధించింది. అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సిపి 58 లక్షల ఓట్లను సాధించి 41 సీట్లు గెలుచుకోగా, ఎన్‌సిపి (ఎస్‌పి) 72 లక్షల ఓట్లను సాధించి పది సీట్లు మాత్రమే గెలుచుకుంది’’ అని పేర్కొ్న్నారు.
విచారణ జరగాలి..
రాజ్యసభలో వెలుగుచూసిన రూ. 500 నోట్ల కట్టల వ్యవహారంపై అడిగిన ప్రశ్నకు.. దానిపై విచారణ జరగాలని తాను కోరుకుంటున్నట్లు రాజ్యసభ ఎంపీ అయిన పవార్ పేర్కొ్న్నారు.
అలా చెప్పడం తగదు..
సీనియర్ నేత పవార్ దేశాన్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. "మీరు ఓటమిని అంగీకరిస్తే మీరు దీని నుంచి బయటపడతారు. ఆత్మపరిశీలనలో మీకు మీ కూటమి నాయకులు సలహా ఇస్తారని నేను ఆశిస్తున్నాను" అని ఫడ్నవీస్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ 1,49,13,914 ఓట్లు సాధించి 9 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 96,41,856 ఓట్లు సాధించి 13 సీట్లు సాధించిందని ఫడ్నవీస్ చెప్పారు. శివసేన (యుబిటి) 73,77,674 ఓట్లు సాధించి 7 సీట్లు గెలుచుకోగా, ఎన్‌సిపి (ఎస్‌పి) 58,51,166 ఓట్లు సాధించి 8 నియోజకవర్గాల్లో విజయం సాధించిందని ఆయన చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 87,92,237 ఓట్లను సాధించి ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగా, అవిభక్త ఎన్‌సీపీ 83,87,363 ఓట్లను సాధించి 4 సీట్లు గెలుచుకుందని గుర్తుచేశారు.