Maharashtra Politics | షిండేకు హోంశాఖ కేటాయింపుపై చర్చలు ?

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి షిండే హోం శాఖను ఆశిస్తున్నారని, పోర్ట్‌ఫోలియో కేటాయింపులపై చర్చలు జరుగుతున్నాయని శివసేన ఎమ్మెల్యే భరత్ గోగావాలే తెలిపారు.

Update: 2024-12-07 10:09 GMT

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బీజేపీ నుంచి కీలకమైన హోం శాఖను ఆశిస్తు్న్నారని, పోర్ట్‌ఫోలియో కేటాయింపులపై చర్చలు జరుగుతున్నాయని శివసేన ఎమ్మెల్యే, షిండే సన్నిహితుడు భరత్ గోగావాలే తెలిపారు. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలకు ముందు డిసెంబర్ 11 - 16 తేదీల మధ్య మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర రెండో రాజధాని నాగ్‌పూర్‌లో డిసెంబర్ 16 నుంచి శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

"ఉప ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దేవేంద్ర ఫడ్నవీస్ హోం శాఖ చూశారు. సాహెబ్ (షిండే) కూడా హోంశాఖ డిమాండ్ చేశారు. పోర్ట్‌ఫోలియో కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయి" అని గోగావాలే చెప్పారు. ఎవరినుద్దేశించి ఈ డిమాండ్ చేశారన్న ప్రశ్నకు.. అది బహుశా ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని గోగావాలే అన్నారు.

మొదటి నుంచి అయిష్టంగానే..

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సీఎంను ఎంపిక చేసే బాధ్యతను బీజేపీ అగ్రనాయకత్వం తీసుకుంది. దాంతో ఫడ్నవీస్, షిండే, అజిత్‌ పవార్ ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆయనతో సమావేశం ముగిశాక.. సీఎం ఎంపిక పూర్తిగా బీజేపీ అధిష్టానానికి వదిలేశానని మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు షిండే సమాధానం ఇచ్చారు. ఆ పదవికి ఎంపికలో తాను అడ్డంకి కాబోనని కూడా అన్నారు. ఇటు దేశ రాజధాని నుంచి తిరిగొచ్చిన షిండే సతారా జిల్లాలోని తన స్వస్థలం డేర్ గ్రామానికి వెళ్లి ఉపముఖ్యమంత్రి పదవి పట్ల తన అయిష్టతను బయటపెట్టారు.

గురువారం దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగిన భారీ వేడుకలో బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, షిండే, అజిత్ పవార్ (NCP) ఆయన డిప్యూటీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అగ్రశ్రేణి మహాయుతి రాజకీయ నాయకులు మినహా ఇతర నాయకులు ప్రమాణస్వీకారం చేయలేదు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో 288 మంది సభ్యుల అసెంబ్లీలో 230 సీట్లు గెలుచుకున్న మహాయుతి కూటమిలో బీజేపీ, శివసేన, ఎన్సీపీలు భాగస్వామ్య పక్షాలు. 

Tags:    

Similar News