Maharashtra Politics | 4న మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు

ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో డిసెంబర్ 5న ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతల సమక్షంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.

Update: 2024-12-02 12:18 GMT

మహారాష్ట్ర సీఎం పేరును 4వ తేదీ అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఒక రోజు ముందు బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకున్న తర్వాత సీఎం పేరును ప్రకటిస్తారని పార్టీ సీనియర్ కార్యకర్త ఒకరు సోమవారం చెప్పారు. ఇప్పటికే మహారాష్ట్ర లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలను బీజేపీ అధిష్టానం నియమించింది. దీంతో వారు రేపు ముంబై చేరుకుంటారు.

"రూపానీ, సీతారామన్‌ బుధవారం ముంబైలో బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. సమావేశం తరువాత సీఎం అభ్యర్థి పేరును ఢిల్లీలోని సీనియర్ నాయకులకు తెలియజేస్తారు. వారు బీజేపీ నాయకుడిని ప్రకటిస్తారు. ముఖ్యమంత్రి పేరును కూడా ఖరారు చేస్తారు." అని పీటీఐకి చెప్పారు.

ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు..

డిసెంబర్ 5న ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతల సమక్షంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారు చేసినట్లు బీజేపీ సీనియర్ నేత ఒకరు ఆదివారం ప్రకటించారు.

ఇద్దరు డిప్యూటీలు..

మహాయుతి కూటమిలో బీజేపీకి చెందిన రెండు ప్రధాన మిత్రపక్షాలు, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. కొత్త ప్రభుత్వంలో ఒక్కొక్కరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే.. బీజేపీకి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడానికి తాను అడ్డురాబోనని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల ముగిసిన రాష్ట్ర ఎన్నికలలో 288 అసెంబ్లీ స్థానాల్లో 230 స్థానాలను మహాయుతి గెలుచుకుంది. బీజేపీ 132 స్థానాల్లో ఆధిక్యత చాటుకోగా శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు దక్కించుకున్నాయి. 

Tags:    

Similar News