ఆకలితో ఉన్న దెయ్యం vs సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
'బకాసుర' రివ్యూ;
పరమేష్ (మన కమెడియన్ ప్రవీణ్) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. హ్యాపీ లైఫే కానీ మనోడి మనస్సులో ఉద్యోగం కాకుండా మరో కోరిక ఉంది. అదేమిటంటే — ఓ సాలిడ్ రెస్టారెంట్ పెట్టి బిర్యానీ నుంచి బటర్ నాన్ వరకూ ఫుల్ బిజినెస్ దంచేయాలి.. కానీ ఫ్యామిలీ సిట్యుయేషన్ అంత బాగాలేక, మోనిటర్ ముందు కూర్చుని కోడింగ్ టైప్ చేస్తూ కాలం గడుపుతున్నాడు.
ఇక మనోడి రూమ్ సీన్ చెప్పాలి అంటే, నలుగురు ఫ్రెండ్స్‌తో ఒకే బ్యాచిలర్ షెల్టర్‌లో ఉంటూంటాడు. అక్కడ వంట కంటే వాషింగ్ పౌడర్ ఖర్చు ఎక్కువ! ఓ రోజు మనోడు తన రెస్టారెంట్ డ్రీమ్ వాళ్లకు చెప్పగానే — “అయ్యా, ఫుడ్ బిజినెస్ పెట్టాలంటే ముందు డబ్బులు కావాలి… డబ్బు కోసం ఘోస్ట్ వీడియోలు చేద్దాం యూట్యూబ్‌లో” అని రొటీన్ ఐడియా చెప్తారు. మొదలెట్టేస్తారు.
మొదటి వీడియో సూపర్ హిట్… సబ్స్క్రైబర్స్ ఎగురుకుంటూ వస్తారు,లైక్స్ ,వ్యూస్ వర్షం కురిపిస్తాయి. రెండో వీడియో కోసం ఓ హాంటెడ్ హౌస్‌కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక పాత తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. “ఇదే మన కెరీర్ కు గోల్డెన్ టికెట్” అనుకుని, పుస్తకంలో ఉన్నట్టు తంత్ర పూజ మొదలెడతారు.
పూజ చేస్తుండగా ఒక నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం చనిపోయిన ఆత్మ లాగిన్ అవుతుంది! కానీ ఈ ఆత్మకి పిచ్చి ఆకలి… ఇంట్లో ఎంత ఫుడ్ ఉంటే అంతా క్లియర్ చేసేస్తుంది — అన్నం, పప్పు, ఫ్రిజ్‌లో పెట్టిన చాక్లెట్ మిల్క్‌షేక్ కూడా!
ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కంట్రోల్ చేసేముందే, రూమ్‌లోకి వచ్చిన అంజిబాబు (ఫణి) శరీరంలోకి ల్యాండ్ అవుతుంది. ఇక మొదలవుతుంది అసలు గందరగోళం. “ఈ ఆత్మ ఎవరిది?” అని ఇన్వెస్టిగేట్ చేస్తే, ఇది అసలే బక్క సూరి అలియాస్ బకాసురుడు (వైవా హర్ష)దని తెలుస్తుంది. బకాసురుడికి ఏ రోగం ఉందో, ఎందుకు 200 ఏళ్లు ఫాస్ట్‌లో ఉన్నాడో, ఇప్పుడు ఎందుకు ఫుల్ మీల్స్ మోడ్‌లో ఉన్నాడో అనేది స్టోరీలోని సీక్రెట్ మసాలా.
పరమేశ్వర్ గ్యాంగ్ ఈ ఆత్మని అంజిబాబు నుంచి బయటకు లాగాలా? లేక ఈ ఆత్మను సూప్ మాస్టర్‌గా వాడుకుని రెస్టారెంట్ స్టార్ట్ చేసారా? చివరికి అంజిబాబు బాడీ ఫ్రీ అయ్యిందా? పరమేశ్వర్ డ్రీమ్ రెస్టారెంట్ ఓపెన్ అయిందా? అన్నది తెలుసుకోవాలంటే బిగ్ స్క్రీన్‌కి వెళ్లాల్సిందే.
విశ్లేషణ
ఈ సినిమాలో “HOOK IDEA = HUNGER COMEDY నే. హారర్ కామెడీల్లో కొత్తదనం చూపించడం కష్టం, కానీ ఇక్కడ ‘తిండిబోతు దెయ్యం’ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది. ఈ హంగర్ ట్రిగ్గర్ను స్క్రీన్‌ప్లేలో మరింత సిట్యుయేషన్లలో ఎక్స్‌ప్లోయిట్ చేసి ఉంటే, మజా డబుల్ అయ్యేది. కొన్ని చోట్ల మాత్రమే దాన్ని ఫుల్‌గా వాడారు, మిగతావి రెగ్యులర్, రొటీన్ కామెడీ గా మార్చేసారు.
సాధారణంగా హారర్‌ను ముందుగా రాయ్, కామెడీని తరువాత మిక్స్ చేయ్ అనేది ఈ తరహా కామెడీల ఓపెన్ రైటింగ్ సీక్రెట్. అంటే భయం పంచే సీన్లను సీరియస్‌గా రాయాలి, దాని మీదే ఫన్ సిట్యుయేషన్ కామెడీగా రాసుకోవాలి. అంటే దెయ్యం భయంకరంగానే ఉండాలి, కానీ దాని ప్రాబ్లమ్ ఫన్నీగా ఉండాలి. అంతేకాదు భయపడే క్యారెక్టర్ నిజంగా టెన్షన్‌లో ఉంటేనే ఫన్ వర్కవుట్ అవుతుంది. Forced jokes avoid చేయగలిగాలి. ఇవేమీ ఈ సినిమాలో జరగలేదు.
ఫస్ట్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లే ఎక్కువగా కామెడీ బీట్‌లపై నడుస్తుంది. ఫన్ ఉన్నా, రిపీట్ ప్యాటర్న్ వల్ల కొంతసేపు “ ఇదంతా సరే బ్రో, ఘోస్ట్ ఎక్కడ?” అని అడగాలనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో పేస్ పికప్ అవుతుంది — మిడ్‌పాయింట్ (అంజిబాబులోకి దెయ్యం రావటం) తర్వాత స్టోరీకి ఫ్రెష్ డైనమిక్స్ వచ్చి, ఆడియెన్స్ అటెన్షన్ మళ్లీ గ్రాబ్ అవుతుంది.
ఇక బక్క సూరి ఫ్లాష్‌బ్యాక్ ఎమోషనల్‌గా ఉంది, కానీ పేస్‌ను కొద్దిగా బ్రేక్ చేసింది. హారర్ కామెడీలో ఫ్లాష్‌బ్యాక్ ఇన్సర్ట్ సరిగ్గా టైమ్ చేసి, ఫన్ మూడ్‌ని డిస్టర్బ్ కాకుండా పెట్టాలి — ఇక్కడ అది కొంచెం ఆగిపోయిన ఫీలింగ్ ఇచ్చింది. ఆత్మను వాడుకుని డబ్బులు సంపాదించే సన్నివేశాలు — గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కామెడీ సెట్‌పీస్. కానీ ప్రీక్లైమాక్స్‌లో మల్టీ-గోస్ట్ ట్రాక్ హిట్టవ్వాల్సిన చోట, క్రింజ్ వైపు వెళ్లింది. స్క్రీన్‌ప్లేలో హారర్ కామెడీ బీట్ అనేది build–build–payoff కావాలి; ఇక్కడ payoff బలహీనమైంది. దాంతో ఆ సీన్స్ అన్ని తేలిపోయాయి.
టెక్నికల్ వాల్యూస్
దర్శకత్వం: ఎస్.జే. శివ చిత్రంలో ఎమోషనల్ కంటెంట్ బాగా పండించినా, కథనం ఆసక్తికరమైన ప్లోట్‌లో ముందుకు సాగకపోవడం వల్ల ఇంపాక్ట్ తగ్గింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే.. పాటలు వినసొంపుగా, సన్నివేశాలకు సరిపడేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ: లొకేషన్స్ న్యాచురల్ విజువల్స్‌తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ వాటిని అందంగా ఫ్రేమ్ చేశారు. ఎడిటింగ్: కట్‌లు స్మూత్‌గా, కథ పేస్‌ను మెంటైన్ చేస్తూ ఉన్నాయి. నిర్మాణ విలువలు: నిర్మాతలు లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి పాటించిన ప్రొడక్షన్ స్టాండర్డ్స్ బాగున్నాయి.
ఫైనల్ థాట్
“చూసేవాడికి దెయ్యం నిజమనే నమ్మకం రానంత వరకూ, దాని చుట్టూ అల్లిన కామెడీ కిక్ ఇవ్వదు. భయం రియల్ అయితేనే ఫన్ రియల్ అవుతుంది.” ఇదే హారర్ కామెడీలో ప్రధానమైన విషయం. ఆ విషయం మర్చిపోయిన సినిమాలు అంతంత మాత్రంగానే భయపెడతాయి..నవ్విస్తాయి.