'14 డేస్ .. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో' ఓటిటి మూవీ రివ్యూ

కంటెంట్ పై మీద నమ్మకంతో వచ్చిన ఈ సినిమా చూసినవారికి ఆనందపరిచిందా. రొమాంటిక్ కామెడీగా చెప్పబడుతున్న ఈ కథ కితకితలు పెట్టించిందా?;

Update: 2025-04-22 06:56 GMT

చాలాసార్లు చిన్న సినిమాలకి మంచి అడ్వాంటేజ్ వుంటుంది. వాటిపై పెద్ద అంచనాలు వుండవు. చూస్తున్నంత సేపు కాలక్షేపమైపొతే చాలు అనుకుని థియేటర్ కు వస్తారు. ఆ మేరకు ఉంటే పాసైపోయినట్లే. అందులోనూ యూత్ కు పట్టే రొమాంటిక్ కంటెంట్ ఉన్న సినిమా ఇంకాస్త ఎక్కువ ఎడ్వాంటేజడ్. బహుశా ఇదే నమ్మకంతో ఈ సినిమా బాక్సాఫీసు ముందుకు వచ్చినట్లుంది. అయితే అక్కడ పెద్దగా బజ్ చేయలేదు. దాంతో నెల రోజుల వ్యవథిలోనే ఓటిటిలోకి వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది. కంటెంట్ పై మీద నమ్మకంతో వచ్చిన ఈ సినిమా చూసినవారికి ఆనందపరిచిందా. రొమాంటిక్ కామెడీగా చెప్పబడుతున్న ఈ కథ కితకితలు పెట్టించిందా?

స్టోరీ లైన్

హర్ష(అంకిత్ కొయ్య) ఫిల్మ్ మేకర్ అవ్వాలి అనే ఉత్సాహంలో క్రిందా మీదా పడుతూంటాడు. మరో ప్రక్క యూత్ టైమ్ వేస్ట్ చేయటం ఎందుకుని డేటింగ్ యాప్ లో ఆహాన(శ్రియ కొంతం) అనే అమ్మాయి చూస్తాడు. ఆమె ప్రొఫైల్ చూసి తనతో పరిచయం పెంచుకుంటాడు. ఆమె కూడా కొద్దగా స్పీడే. ఆహాన పేరెంట్స్ ఒక పెళ్లికి వెళ్లడంతో హర్షను ఇంటికి రమ్మంటుంది.

అలా గర్ల్ ఫ్రెండ్ ను కలవడానికి వెళ్లిన హర్ష అదే ఇంట్లో 14 రోజులు ఉండాల్సి వస్తుంది. ఆహాన తల్లిదండ్రులకు, తాతకు తెలియకుండా అన్ని రోజు హర్ష ఇంట్లోనే ఎలా మేనేజ్ చేసాడు? హర్షను దాచిపెట్టడంలో ఆహాన ఎలాంటి పాట్లు పడింది, ఎన్ని ట్విస్ట్ లు పడ్డాయి? పెళ్లికి వెళ్లికి వెళ్లిన పేరెంట్స్ ఎందుకు త్వరగా తిరిగి వచ్చారు? ఆహానకు వచ్చిన మరో పెద్ద సమస్య ఏంటీ? దాని నుండి ఆహానా,హర్ష ఎలా బయటపడ్డారు,ఈ కథలో క్రియేట్ క్రిస్ (వెన్నెల కిషోర్) పాత్ర ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

కుర్రాళ్ల కబుర్లల్లోకి తొంగి చూస్తే ఎన్నో క‌థ‌లు క‌నిపిస్తాయి. వాటిల్లోనే కొన్ని సంతోషాలు,సరదాలు, బాధ‌లుంటాయి. ఎమోష‌న్ ఉంటుంది. న‌వ్వులూ అక్క‌డే దొరుకుతాయి. '14 డేస్ .. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో' అలాంటి క‌థలాగే చేద్దామని ప్రయత్నించారు. ఓ కుర్రాడు అనుకోకుండా 14 రోజులు పాటు తన గర్ల్ ప్రెండ్ ఇంట్లోనే ఉండిపోతే ఏం జ‌రుగుతుంది? అనే విష‌యాన్ని క్యాప్చ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. సింపుల్ పాయింట్ ని తెరమీదకు తేవడంలో దర్శకుడు చాలా వరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

హీరో ఇంట్లో లాక్ అవడం. అక్కడి నుంచి కథ రొమాంటిక్ థ్రిల్లర్ గా మారటంతో ఇంట్రస్టింగ్ గానే ఉంటుంది. హీరో దొరికిపోతాడేమో అన్న టెన్షన్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. టీనేజ్ పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛను దుర్వినియోగ పరచుకోవడం అనే పాయింట్ అందరు కనెక్ట్ అయ్యే అవకాసం ఉంది. అయితే సినిమా అంతా ఒకే ఫ్లాట్ లో జరగడం వలన సీన్స్ రిపీటెడ్ అవుతున్న ఫీల్ వస్తుంది.

అలాగే క్లైమాక్స్ లో వచ్చే చిన్న ట్విస్ట్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. గుర్తుండిపోయి కథను మలుపు తిప్పేలా ఉండదు. ఇది ఇప్పటివరకూ రాని కొత్త కధేం కాదు. చూసిన కథ, తెలిసిన పాత్రలనే కాస్త ఫ్రెష్ గా ప్రజెంట్ చేశాడు. ఈ సినిమాకి బలం కామెడీ. ఆ కామెడీ గేర్ లోకి రావడానికి కాస్త టైం పట్టింది. అలాగే సెకండాఫ్‌లో కామెడీ అంత‌గా వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. కొన్ని సాగ‌దీత స‌న్నివేశాల్లానే క‌నిపిస్తాయి. కొన్ని సీన్లు లాజిక్ కు అంద‌వు. మ‌రీ ఓవ‌ర్ ది బోర్డ్ గా అనిపిస్తాయి.

టెక్నికల్ గా..

చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణంలో రాజీపడలేదు. మ్యూజిక్, కెమరాపనితనం అద్బుతం కాదు కానీ బాగానే వున్నాయి. పాటలు అంతగా ఆకట్టుకోవు. దర్శకుడు శ్రీ హర్ష మన్నే కొత్తవాడైనా కథను నడిపించిన తీరు మెప్పించింది. కామెడీతో పాటు క్లైమాక్స్ లో ఎమోషన్స్ కూడా బాగా హ్యాండిల్ చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ ఓకే. యూత్ రిలేట్ చేసుకునేలా మాటలు రాసుకున్నారు. అంకిత్ బాగా చేశాడు. త‌ను మంచి యూత్ హీరో కాగ‌ల‌డు. వెన్నెల కిషర్ సినిమాను తనదైన కామెడీ టైమింగ్ తో నిలబెట్టాడు.

చూడచ్చా

ఓ సారి ట్రై చేయచ్చు. మరీ గొప్పగానూ లేదు. బోర్ కొట్టదు. నడిచిపోతుంది. అలాగే టైటిల్ చూసి ఏదోదో ఊహించుకోవద్దు.

ఎక్కడ చూడచ్చు

'అమెజాన్ ప్రైమ్'లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.

Tags:    

Similar News