’అన్నా డీఎంకే‘ కార్యకర్తపై పరువు నష్టం దావా వేసిన నటి త్రిష
తనపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే కార్యకర్త, ఏవీ రాజుపై నటి త్రిష కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు.;
తనకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు తనుపడిన మానసిక వేదనకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టును కోరింది.ఐదు లక్షల కాపీలకు పైగా సర్క్యూలేషన్ ఉన్న ఏదైన ప్రముఖ ఆంగ్ల, తమిళ దినపత్రికలో తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొంది. అలాగే క్షమాపణ కోరుతూ యూట్యూబ్ వీడియోలను సైతం విడుదల చేయాలని, ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్వ్యూలను సైతం విడుదల చేయాలని నోటీసుల్లో కోరింది.
ఏవీ రాజుకు అతని సొంత అడ్రస్ కలిగిన సేలం చిరునామాలో నోటీస్ అందజేయబడింది. ఈ లీగల్ నోటీసులో త్రిష పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించి, మానసిక వేదనకు కారణమైనందుకు నోటీస్ అందిన నాలుగు రోజుల్లో క్షమాపణ చెప్పాలని అందులో ఉంది.
— Trish (@trishtrashers) February 22, 2024
ఇంతకుముందు కూడా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సహ నటుడు మన్సూర్ అలీఖాన్ ను, త్రిష క్షమించింది. కానీ ఈ సారి అన్నాడీఎంకే కార్యకర్త తన హద్దులు దాటి మరీ ప్రవర్తించారు. దీనిపై త్రిషతో పాటు మరికొంతమంది నటులు కూడా ఘాటుగా స్పందించారు.
ఏవీ రాజు ఇటీవల ఓ వీడియోలో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యే జి వెంకటాచలం త్రిషను పట్టుబట్టి రిసార్ట్స్ లకు తీసుకొచ్చేవారని వ్యాఖ్యానించారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై త్రిష సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. " అధిష్టానం మెప్పు కోసం ఎంతటి నీచానికైనా దిగజారే మనుషులను పదేపదే చూడడం నాకు అసహ్యంగా ఉంది. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ పనిని నా లీగల్ టీమ్ చూసుకుంటుంది " అని ఘాటుగా సమాధానమిచ్చింది.
చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు కూడా రాజు వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాజకీయ నాయకులు తాము ఎదిగేందుకు మహిళలను ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సోషల్ మీడియా యూజర్ మాట్లాడుతూ.. రిపోర్టర్లు కూవత్తూర్ రిసార్ట్ వెలుపల ఉన్నారు. వారి కళ్లపడకుండా ఒక ప్రముఖ నటిని అక్కడికి ఎలా తీసుకురాగలరు. ఇటువంటి ఆరోపణలు చేయడం ఒక వ్యక్తి ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా విపరీతమైన బాధను కలిగిస్తాయని చెప్పాడు. నటుడు,దర్శకుడు చేరన్ మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాలు లేకుండా త్రిషపై పుకార్లు వ్యాప్తి చేసినందుకు ఏవీ రాజును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు.
ఆ ఆరోపణలను తీసివేయండి
రాజుకు ఇచ్చిన లీగల్ నోటీస్ లో త్రిష తన స్వంతం ఖర్చుతో వివిధ మీడియాలో తన పై వచ్చిన ఆరోపణలను తొలగించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది. అవి తీయడంలో విఫలం అయితే తదుపరి సివిల్, క్రిమినల్ చర్యలకు ప్రారంభిస్తామని హెచ్చరించింది.