AI తో చిరంజీవి హనుమాన్ చిత్రం ప్రకటన
మైథాలజీని రక్షించే దేవుడు AIనా? లేక దాన్ని చంపే రాక్షసుడా? ఈ కొత్త ట్రెండ్ కలిసొచ్చేదేనా?;
భారతీయ సినీ రంగం ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. మహావతార్ నరసింహ ఘనవిజయం సాధించిన తరువాత, ప్రొడ్యూసర్లు మైథాలజీని “Pan-India గోల్డ్‌మైన్”గా చూస్తున్నారు. ఈ తరంగంలో భాగంగా Abundantia Entertainment మరియు Collective Media Network కలిసి చిరంజీవి హనుమాన్ – ది ఎటర్నల్ అనే పూర్తిగా AI ఆధారిత యానిమేషన్ ఫిల్మ్ ను ప్రకటించారు.
ఈ చిత్రం 2026 హనుమాన్ జయంతి న రిలీజ్ కానుంది. లార్డ్ హనుమాన్ లెజెండ్‌ను 100% AI జనరేటెడ్ రూపంలో స్క్రిప్ట్ నుంచి విజువల్స్ వరకు పూర్తి చేయడం ఇదే మొదటిసారి.
కానీ ఇప్పుడు సినిమావారి మనస్సులో ఉదయిస్తున్న ప్రశ్న ఏమిటంటే — “మహావతార్ నరసింహ విజయం భక్తుల గర్జన అయితే, చిరంజీవి హనుమాన్ ఆ గర్జనను AI ప్రతిధ్వనిగా నిలబెడుతుందా? లేక కేవలం డిజిటల్ శబ్దంగా మిగులుస్తుందా?” అనేది ఇప్పుడు అంతటా ఆలోచనలో పడేస్తున్న ప్రశ్న.
ఇక ఏఐ సినిమాలపై ఇప్పటికే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీతో ఎమోషన్స్ పండించలేము. కేవలం మనుషుల ద్వారా మాత్రమే ఎమోషన్స్ పండుతాయి.చాలా మంది తక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో ఇలా ఏఐ టెక్నాలజీని వాడి ప్రాణం లేని బొమ్మలను క్రియేట్ చేసి సినిమాలు తీసేసి ప్రేక్షకులను మోసం చేద్దాం అనుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. అంతేకాదు ఏఐ టెక్నాలజీతో రాబోతున్న చిరంజీవి హనుమాన్ మూవీ యూనిట్ పై కూడా ఆయన ఫైర్ అయ్యారు.
ఈ క్రమంలో ఏఐ సినిమాల వల్ల మైథాలజీకు ఏ మేరకు ప్లస్ అవుతుంది, ఎంత మేరకు నష్టం అవుతుంది. ఇది కలిసొచ్చే ప్రయత్నమేనా చూద్దాం.
“సినిమా అంటే మనం ఏమి చూపిస్తామన్నది కాదు, ప్రేక్షకుడు ఏమి ఫీలవుతాడన్నది.” : రాజ్‌కుమార్ హిరానీ
(ఇదే AI డిబేట్‌లో కేంద్రబిందువుగా మారింది.)
* ప్లస్ పాయింట్స్ – AI మైథాలజీకి చేసే ఉపయోగాలు
1. తక్కువ ఖర్చుతో భారీ విజన్
సెట్‌లు, వేల ఎక్స్‌ట్రాలు, భారీ VFX లాంటి వాటికి వందల కోట్లు ఖర్చు అవుతుంది. AI వల్ల ఈ ఖర్చు బాగా తగ్గుతుంది. ఒక ట్రేడ్ అనలిస్ట్ మాటల్లో:
“ఒక రాజ్యం నిర్మించడానికి ₹500 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు, ఒక అల్గోరిథమ్ ఒక్క రాత్రిలో క్రియేట్ చేస్తుంది.”
2. స్పీడ్ & ఎక్స్‌పెరిమెంటేషన్
డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు కొన్ని రోజుల్లోనే వందల స్క్రిప్ట్‌లు, విజువల్ స్టైల్‌లు టెస్ట్ చేసుకోవచ్చు.
3. గ్లోబల్ రీచ్
AI సులభంగా భాషా అనువాదం, డబ్బింగ్, సబ్‌టైటిల్స్ చేస్తుంది. దీనివల్ల మైథాలజీ Marvel లాంటి గ్లోబల్ లెవెల్‌కి వెళ్ళే అవకాశం ఉంది.
4. కల్చరల్ ప్రిజర్వేషన్
అమర్ చిత్ర కథ 20వ శతాబ్దంలో మైథాలజీని ఆర్కైవ్ చేసినట్లే, 21వ శతాబ్దంలో AI సినిమాలు కొత్త తరం కోసం ఆర్కైవ్‌గా నిలుస్తాయి.
* మైనస్ పాయింట్స్ – AI తీసుకొచ్చే సమస్యలు
1. మానవ భావోద్వేగాలు అంతగా పండవు
మైథాలజీ కేవలం స్పెక్టకిల్ కాదు – అది భక్తి, భావన, సంస్కారం . ఒక అల్గోరిథమ్ ప్రహ్లాదుడి కన్నీళ్లను నిజంగా చూపగలదా?
ఒక సీనియర్ డైరెక్టర్ మాటల్లో: “పిక్సెల్‌కి భక్తి రాదు.” ఏదో ఒకటి వర్కవుట్ అయ్యినంత మాత్రాన అన్ని కలిసి రావు.
2. కళాకారుల ఉపాధి సంక్షోభం
రచయితలు, యానిమేటర్లు, టెక్నీషియన్లు వేలమంది ఉద్యోగాలు కోల్పోతారని భయం. హాలీవుడ్‌లో కూడా ఇదే ఆందోళనతో Writers’ Strike జరిగింది.
3. ఓవర్-సాచ్యురేషన్ రిస్క్
90వ దశకంలో మైథాలజీ సీరియల్స్ ఎక్కువగా రావడం వల్ల వాటి ఇంపాక్ట్ తగ్గినట్లే, AI వల్ల తరుచుగా మైథాలజీ సినిమాలు వస్తే ప్రత్యేకత పోతుంది. కొన్నాళ్లకి బోర్ కొట్టేస్తుంది. టీవీల్లో యానిమేషన్ సీరియల్లు చూసినట్లు ఉంటుంది.
4. ఎథికల్ & కల్చరల్ ఆటెంటిసిటీ
AI డేటా సెట్‌ల నుండి నేర్చుకుంటుంది. తప్పు సమాచారం లేదా పాశ్చాత్య దృక్కోణాలు కూడా రిజల్ట్‌లో రావచ్చు. ఎందుకంటే మైథాలజీ కేవలం కంటెంట్ కాదు, అది పవిత్రమైన సంప్రదాయాలతో కూడిన కథలు,గాధలు.
* గ్లోబల్ కోణం
హాలీవుడ్‌లో ఇప్పటికే AI స్క్రిప్టింగ్, CGI టెస్టులు జరిగాయి. జపాన్ యానిమేషన్ లో కూడా AI ప్రయోగాలు మొదలయ్యాయి. కానీ చిరంజీవి హనుమాన్ మాత్రం పూర్తిగా AI ఆధారంగా తీస్తున్న మొదటి మైథాలజికల్ ఫీచర్ ఫిల్మ్ .
విజయం సాధిస్తే – ఇది ప్రపంచవ్యాప్తంగా AI కల్చరల్ సినిమాలకి ద్వారం తెరుస్తుంది.
విఫలమైతే – “మైథాలజీ + మెషిన్” కలయిక సరిపోదు అనే హెచ్చరికగా గుర్తుండిపోతుంది.
ఫైనల్ థాట్:
మైథాలజీ అనేది కేవలం కథ కాదు – అది భక్తి, సంస్కృతి, భావోద్వేగాల సమ్మేళనం. AI ఈ కథలను మరింత గొప్ప విజువల్స్‌తో, తక్కువ ఖర్చుతో అందించగలదు. కానీ అదే సమయంలో, మనుషుల సృజనాత్మకత, ఆత్మీయత, భావోద్వేగం లేకపోతే, అది కేవలం డిజిటల్ ప్రదర్శనగానే మిగిలిపోతుంది. “మైథాలజీకి మెషిన్ తోడ్పడాలి – భర్తీ చేయకూడదు.
ఏదైమైనా స్టీవెన్ స్పీల్బర్గ్ చెప్పినట్లు... “టెక్నాలజీ టూల్స్ ఇస్తుంది కానీ ఆత్మను ఇవ్వదు.” అనేది మాత్రం ఇక్కడ మర్చిపోకూడదు.