మాధవన్ 'హిసాబ్ బరాబర్' OTT మూవీ రివ్యూ!

రొమాంటిక్ సినిమాల్లో 'సఖి' కు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవల్. పేరుకే డబ్బింగ్ సినిమా గానీ తెలుగులోనూ కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.;

Update: 2025-01-29 11:24 GMT

రొమాంటిక్ సినిమాల్లో 'సఖి' కు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవల్. పేరుకే డబ్బింగ్ సినిమా గానీ తెలుగులోనూ కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ సినిమాతో మాధవన్ కు తెలుగు నాట మంచి మార్కెట్ ఏర్పడింది. ఆయన చేసిన అనేక సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. తాజాగా ఆయన నటించిన ఫైనాన్షియల్ థ్రిల్లర్ 'హిసాబ్ బరాబర్' థియేటర్ రిలీజ్ లేకుండా డైరెక్ట్ ఓటీటీలోకి దిగింది. మాధవన్ సినిమా అంటే మంచి కథాంశాలు, ఫెరఫార్మెన్స్ లు ఉంటాయని అంచనా వేస్తాం. అలాగే దర్శకుడు అశ్వినీ ధీర్ కూడా ఈ సినిమాకు మంచి పాయింటే ఎత్తుకున్నాడు. దాంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే సినిమా అంచనాలకు తగినట్టు ఉందా..అసలు కథేంటి, ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన సినిమా అయ్యిందా వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

రైల్వే టీసీ రాధే మోహన్ (మాధవన్) కు భార్య ఉండదు. దాంతో తన కొడుకు 'మనూ' తో కలిసి ఒంటరి లైఫ్ లీడ్ చేస్తూంటాడు. ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఉండే రాధే మోహన్ CA చేస్తాడు. దాంతో లెక్కల్లో తిరుగుండదు. ట్రైన్ లో అతనికి పోలీస్ ఆఫీసర్ పూనమ్ ( కృతి కుల్హారి)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే లోపల అతని జీవితంలో ఓ సంఘటన జరుగుతుంది.

తన బ్యాంకు అకౌంట్ లో 27 రూపాయల 50 పైసలు తక్కువ ఉండటం గమనిస్తాడు. దాంతో బ్యాంకు చుట్టూ తిరుగుతాడు. బ్యాంకు వారు అతనికి సారీ చెప్పి వెనక్కి ఆ డబ్బు ఇచ్చి, గిప్ట్ కూడా ఇచ్చిన శాంతించాడు. తనలాగే చాలా మంది కస్టమర్ల నుంచి బ్యాంక్ చిన్న చిన్న మొత్తాలు లేపేస్తోందని గమనిస్తాడు. ఆధారాలు సంపాదించి ఆ బ్యాంక్ పెద్ద స్కామ్ కి పాల్పడుతుందనే విషయం పసిగడతాడు. కష్టమర్స్ బ్యాంక్ లో దాచుకున్న డబ్బుకి ఒకటి రెండు రోజుల లేటుగా వడ్డీని కలపటం వలన ఆ బ్యాంక్ వేలకోట్లను దోచుకుంటుందనే విషయం అతనికి అర్ధమవుతుంది. అక్కడ నుంచి బ్యాంక్ తో పోరాటం మొదలెడతాడు.

రాధే మోహన్ పోరాటం ఆ బ్యాంకు చైర్మన్ మెహతా దాకా వెల్తుంది. ఒక సాధారణ రైల్వే టీసీ తన బ్యాంకు మూలాలనే కదిలించాలని ప్రయత్నిస్తున్నాడే విషయం తెలుసుకుని కోపంతో ఊగిపోతాడు. రాధే మోహన్ అంతు చూడటానికి స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత మెహతా వంటి బిగ్ షాట్ నుంచి రాధే మోహన్ కి నిజ జీవితంలోనూ, వృత్తి పరంగానూ ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? చివరకు రాధే మోహన్ ఏం సాథించాడు ? అనేది కథ.

ఎలా ఉంది

శంకర్ టైప్ మెసేజ్ ఓరియెంటెడ్ కథ. అయితే ఇందులో యాక్షన్ ఉండదు. అలాగని మైండ్ గేమ్ ఉండదు. . కథా గమనం చాలా ఫ్లాట్ గా వెళుతుంటుంది. పైగా సన్నివేశాలు నడపడంలో చాలా ల్యాగ్ కనిపిస్తుంది. కేవలం ఓ రైల్వే టీసీ పోరాటం చేస్తూంటాడు. దానికి బ్యాంక్ ఛైర్మన్ అడ్డంకులు సృష్టిస్తూంటాడు. అంతే తప్ప ఎక్కడా బ్యాంక్ చైర్మన్ కు అడ్డంకులు క్రియేట్ చేసే సిట్యువేషన్ చివరి దాకా సినిమాలో లేదు. స్క్రిప్టు అంతా చాలా ప్యాసివ్ గా పేలవంగా సాగుతుంది.

హీరో ఏమి చెయ్యని కథలు బోర్ కొట్టిస్తాయి. అదే ఈ సినిమాలో జరుగుతుంది. హీరోయిన్ కృతి కుల్హరిని ఉన్నట్టుండి పోలీస్ ఆఫీసర్ గా చూపటం కూడా లేజీ రైటింగ్ కు ఉదాహరణగా కనిపిస్తుంది. కథలో ఎక్కడా సరైన కాంప్లిక్ట్ ఉండదు. తీస్తే పూర్తి సహజంగా తీయాలి. లేదా పూర్తి కమర్షియల్ గా తీయాలి. ఈ రెండింటికి మధ్యగా తీసే ఇలాంటి సినిమాలు అటు ,ఇటు కాకుండా ఉండి ఓ రకమైన విసుగుని ప్రేక్షకుడులో కలిగిస్తాయి.

టెక్నికల్ గా

ఈ సినిమాకు స్క్రిప్టే పెద్ద మైనస్. డైరక్షన్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా బోర్ ని ఇంకాస్త పెంచే పని పెట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకా షార్ఫ్ గా వుండే ఛాన్స్ వుంది. సెకండ్ హాఫ్ లో ట్రిమ్ చేయొచ్చు. చాలా సన్నివేశాలు, సంభాషణలు పాలిష్ చేయాలని స్పష్టంగా అర్ధమౌతుంటుంది. ఏదైమైనా కథ, కథనాలు గ్రిప్పింగ్ గా నడపడంలో దర్శకుడు ఇంకాస్త స్ట్రాంగ్ గా పని చేయాల్సింది.

మాధవన్ కి ఇలాంటి పాత్ర చేయడం కొత్త కాదు. తన పర్సనాలిటీ ఆ పాత్రకు ప్లస్ అయ్యింది. కృతి కుల్హారి ది తక్కువ నిడివి వున్న పాత్ర. పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మిగతా పాత్రల్లో విలన్ గా చేసిన నీల్ నితిన్ ముఖేష్ రొటీన్ విలనిజం చూపించాడు.

చూడచ్చా

కేవలం 27 రూపాయల కోసం ఎంక్వైరీ మొదలెట్టి రెండు వేల కోట్ల స్కామ్ ని బయిటపెట్టడం అనే కాన్సెప్టు వినడానికి బాగానే ఉంది కానీ చూడ్డానికి బాగోలేదు. మాధవన్ అభిమానులు అయితే ఓ లుక్కేయచ్చు. లేనివాళ్లు స్కిప్ చేసేయచ్చు.

ఎక్కడుంది

జీ5 ఓటీటీలో తెలుగులో ఉంది

Tags:    

Similar News