ఆడ వేషంలో అసలు నిజం: ‘Mr. Rani’ రివ్యూ!

ఈ ప్రయోగం నిజంగా కలిసొచ్చిందా, నవ్వించిందా లేక భావోద్వేగాలను తాకిందా? చూద్దాం.;

Update: 2025-07-15 11:06 GMT

హీరోలు ..ఆడ పాత్రలో కనిపించటం కొత్తేమీ కాదు. గతంలో భామనే సత్యభామనే (కమల్ హాసన్),మిసెస్ డౌట్‌ఫైర్ (రాబిన్ విలియమ్స్), మేడమ్ (రాజేంద్రప్రసాద్) రీసెంట్ గా లైలా (విశ్వక్సేన్), రెమో (శివకార్తికేయన్),గోవిందా ఆంటీ నం.1లో ఇలా ఎన్నోసార్లు మగ హీరోలు ఆడవేషాలు వేసి కామెడీ పండించే ప్రయత్నాలు చేసారు. కొన్ని అటూ ఇటూ అయినా చాలా సార్లు సక్సెస్ అయ్యారు., ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటిదే ఇప్పుడు మరో సినిమా ‘Mr. Rani’ . వేషధారణ ముసుగులో ఓ వ్యక్తిత్వ ప్రయాణాన్ని చూపించాలన్న కన్నడ దర్శకుడు మధు చంద్ర, కమల్ హాసన్ స్ఫూర్తితో ఈ ప్రయోగానికి తెరలేపారు. ఈ ప్రయోగం నిజంగా కలిసొచ్చిందా, నవ్వించిందా లేక భావోద్వేగాలను తాకిందా? చూద్దాం.

స్టోరీ లైన్

నటన, స్టార్‌డమ్… అంటే రాజా (దీపక్ సుబ్రమణ్య)కి చిన్ననాటి నుంచే ప్రాణం. కానీ అతని తల్లిదండ్రులకు మాత్రం అవి "కాలక్షేపం", నిజజీవితంలో ఎలాంటి భవిష్యత్తు లేని కలలుగా అనిపిస్తాయి. వారి ఆశ – తమ కొడుకు ఇంజినీర్‌గా ఎదిగి, కుటుంబ స్థితిని మార్చే స్థాయికి చేరాలి. కానీ రాజా తన కలను మాత్రం విడిచిపెట్టడు. కుటుంబానికి తెలియకుండా, నటుడవ్వాలన్న తన లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరుతాడు. అమెరికా వెళ్లినట్లు నాటకమాడి సినిమా ప్రపంచంలో అడుగుపెడతాడు.

కానీ, ఆ డ్రీమ్ వరల్డ్‌లో అడుగుపెట్టిన కొన్ని రోజులుకు అతనికి అర్దమైన విషయం — “నటన అంటే కళ కాదు, కన్నీటి ఖర్చుతో కూడిన యుద్ధం.” అని. ఈలోగా అనుకోకుండా ఒకప్పుడు కాలేజ్ స్కిట్‌లో ఆడ వేషం వేసిన రాజా వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అది ఓ ప్రముఖ దర్శకుడి దృష్టికి చేరుతుంది. అతనికి ఆ మహిళా పాత్రలో కనిపించిన "రాణి" నచ్చేస్తుంది. వెంటనే ఆమెనే తన నెక్ట్స్ చిత్రానికి హీరోయిన్‌గా రాజాని అమ్మాయి అనుకుని ఎంపిక చేస్తాడు.

రాజా తొలుత ఈ తప్పుడు గుర్తింపుతో కెరీర్‌లోకి ఎంటర్ కావాలంటే ఇష్టం లేకపోయినా… చివరకు నటన పట్ల ప్రేమ వల్ల ఆ పాత్రను స్వీకరిస్తాడు. అనుకోకుండా క్లిస్ అయ్యిపోతాడు. ఈ ఆడవేషానికి భారీగా అబిమానులు ఏర్పడిపోతాడు. ఆ నటనకు డైరక్టర్స్, ప్రొడ్యూసర్స్ క్యూలు కడతారు. ఇది చాదలన్నట్లు తనను మొదట పిలిచి ఎంకరేజ్ చేసిన డైరక్టర్ ప్రేమలో పడిపోతాడు. అంతేనా ఈ రాణి రాకవల్ల, ఇప్పటివరకు టాప్‌ ఫేమ్‌లో ఉన్న దీపికా (పార్వతీ నాయర్) కెరీర్ కుదేలై పోతుంది.

ఇదిలా ఉంటే రాజాకు ..దీపికా అంటే ఇష్టం. ఆమెను మూగగా ప్రేమిస్తూంటాడు. అయితే ఇప్పుడు ఆమెకు తెలియకుండా ఆమె కెరర్ ని కూలదోసి ఆమె స్దానాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు నేనే రాజా ని,రాణిని కాదు ... నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే నిజాన్ని బయటపెట్టలేకపోతున్నాడు. ఈ మోసం, ఈ మౌనం, ఈ ద్రోహం అన్నీ ఒకే సమయంలో అతన్ని మానసికంగా తొక్కేస్తుంటాయి.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే – దీపికా తన స్థానాన్ని కోల్పోయిన బాధలో ఉండగా, రాజా ఆమెను ప్రేమిస్తున్నానని ఎలా చెప్తాడు. ఈ పరిస్థితిని రాజా ఎలా ఎదుర్కొంటాడు? అని, అదెలాగో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

కన్నడ దర్శకుడు మధు చంద్ర ఇప్పటివరకు తీసిన సినిమాలు సామాజికంగా సందేశాలను హాస్య రీతిలో చెప్పడంలో ప్రత్యేకత చూపిస్తూ వస్తున్నాయి. ‘వాస్కోడిగామా’లో విద్యా వ్యవస్థపై, ‘సెల్ఫీ మమ్మీ గూగుల్ డాడీ’లో మొబైల్‌ అడ్డిక్షన్‌పై కథలు చెప్పిన ఆయన, ఇప్పుడు ‘Mr Rani’లో కూడా అదే తరహాలో ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు – విద్యా, కెరీర్ విషయంలో కుటుంబ ఒత్తిడికి లోనవకుండా, మన నిజమైన అభిరుచులను అనుసరించాలి అనే సందేశం. కానీ, ఈ సందేశాన్ని చెప్పేందుకు ఆయన ఎంచుకున్న కథంత మాత్రం బాగా ఓపెన్ గా, అతిగా ఉండటంతో, ఆ అసలు ఉద్దేశం మనకు ఎక్కుక ముందే పలచబడిపోతుంది.

అయినా ఈ సినిమా కాన్సెప్టు 1993 నాటి అమెరికన్ కామెడీ 'Mrs Doubtfire' లోదే. అయితే ఇక్కడ వాతావరణానికి దాన్ని మార్చే ప్రయత్నం చేసారు. కానీ పెద్దగా వర్కుట్ కాలేదనే చెప్పాలి. నవ్వించే ప్రయత్నం చేసారు కానీ నవ్వించలేకపోయారు. హీరో ఓ మహిళలా నటిస్తున్న నేపథ్యంలో, ఆ పాత్రను ‘అమ్మాయిలా’ చూపించే సన్నివేశాల్లో దర్సకుడు పూర్తి కమర్షియల్ ధోరణిలోకి జారిపోయారు — తడిమే కడుపు, బహిరంగ క్లీవేజ్ షాట్లతో ప్రేక్షకులకి కిక్కు ఎక్కించే ప్రయత్నం చేశారు.

అయితే చూసేవారికి తెలుసు కదా..తాము చూస్తోంది ఓ మగవాడని అని. ఎందుకు ఎంజాయ్ చేస్తారనే విషయం మర్చిపోయారు. కామెడీ టైమింగ్ కాస్త ఫోర్స్‌డ్‌గా, స్క్రీన్‌ప్లే ఒత్తిగా, ఎమోషన్స్ ఎక్కడా మనని కదిలించలేని ఫార్ములాగా అనిపిస్తుంది.

ఈ చిత్రంలో డైరక్టర్ మధు చంద్ర స్వయంగా ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఓ యంగ్ దర్శకుడిగా కనిపించే మధు పాత్రకి, సినిమాలో చీప్ డైలాగ్స్ ఎక్కువగా రావడం గమనార్హం.

టెక్నికల్ గా ...

స్టోరీ లైన్ పరంగా ఇది ఒక బలమైన థీమ్ కావచ్చు… కానీ ఫిల్మ్‌ మేకింగ్ లో ఇది జోక్‌గా మిగిలిపోయింది. సినిమాకి ఎడిటింగ్ మంచి స్పీడ్ ఇచ్చే ప్రయత్నం చేసినా, కథలో ఒత్తిడి లేకపోవడం వల్ల తేలిపోయింది. సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల కామెడీ షో ఫీల్ ఇస్తుంది. స్టైలీష్‌ అనిపించాల్సిన సీన్లు కూడా దారుణంగా ఉన్నాయి అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల రివర్స్ లో వినిపిస్తుంది. హార్ట్‌ఫుల్ ఎమోషన్స్ ఉన్న చోట గలాటా మ్యూజిక్, హాస్యసన్నివేశాల్లో సైలెన్స్ ఇవ్వాల్సిన చోట ఊరికే బీట్ వాడటం కనిపిస్తుంది.

ఫైనల్ థాట్

"When your dream demands a disguise, will you still recognize yourself in the mirror?" అనే తాత్వికమైన క్వచ్చిన్ ని మన ముందు ఉంచాల్సిన ఈ సినిమా, ఓ చిన్న తడబాటు, చీప్ కామెడీతో నవ్వించలేక నవ్వులు పాలైంది. హృదయాన్ని హత్తుకోలేకపోయింది. నిజాయితీ లేని ప్రయత్న ఫలితం ఎప్పుడూ నిరాశజనకమే.

చూడచ్చా

అక్కడక్కడా కొద్ది పాటి నవ్వులు ఉన్న సినిమా మరీ ఖాళీగా ఉన్నప్పుడు ఓ లుక్కేయవచ్చు. అంతకు మించి ఎక్సపెక్ట్ చేయద్దు.

ఎక్కడ చూడచ్చు

LinonsGate Play ఓటిటిలో తెలుగులో ఉంది.

Tags:    

Similar News