తెలుగు సినిమా పుట్టిన రోజు ఫిబ్రవరి 6

మార్కస్ బారట్లే నుంచి మిరో స్లావ్ కూబా బ్రోజేక్ దాకా....;

Update: 2025-02-06 11:04 GMT

ఇంత పెద్ద దేశాన్ని కలిపి ఉంచింది ఎవరు?

ఇండియా.....భారతీయతను కాపాడిందెవరు?

మహాత్మాగాంధీ ...జవహర్లాల్ నెహ్రూ...

శ్రీరాముడు...శ్రీకృష్ణుడు ...వెంకటేశ్వరస్వామి ..సాయిబాబా ...సినిమా!

మన దేశాన్ని Movie mad Country అంటారు . చదువు తక్కువైనా ఇక్కడి జనం పిచ్చివాళ్ళు కాదు. సినిమా పిచ్చివాళ్ళు. అంటే రసహృదయం వున్నవాళ్ళు, మంచి వినోదం అనే గిలిగింతలు పెట్టే ఎంటర్ టైన్‌మెంట్ కోసం పడి చచ్చిపోయే వాళ్ళు. ఈ దేశాన్ని కలిపి ఉంచినా ఒక ప్రదానమైనా వినోద మాధ్యమం సినిమా.


సత్యజిత్ రాయ్, శ్యామ్ బెనెగల్ అయినా కేవి రెడ్డి, రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా అయినా, కె.ఎ.ఆసిఫ్, రాజ్ కపూర్, కమల్ అమ్రోహి, రమేష్ సిప్పీ అయినా.. మనకి ఒక్కటే? భక్తప్రహ్లాద నుంచి బాహుబలి దాకా అన్ని సినిమాలూ చూస్తాం. కామెంట్ చేస్తాం. అభిప్రాయం రాస్తాం. ఫిబ్రవరి 6 చాలా ప్రధానమైన రోజు. మహానుభావుడు హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’ విడుదలైన రోజు. బొంబాయిలో షూటింగ్ జరుపుకున్న ఈ పూర్తి నిడివి భక్తి సినిమా, అక్కడే సెన్సార్ అయ్యి, అక్కడి నిర్మాతల సొంత థియేటర్ ‘కృష్ణ సినిమా హాలు’ లో 1932 ఫిబ్రవరి 6 న విడుదలైంది. ఈ తొలి తెలుగు టాకీ చిత్రాన్ని జనం ఆశ్చర్యంతో చూశారు. 1933 మార్చి 18 వ తేదిన బెజవాడ దుర్గాకళామందిర్ లో భక్తప్రహ్లాద రిలీజ్ అయింది.

సినిమా అంటే నిర్మాత, దర్శకుడు, హీరో హీరోయిన్లు ఎంత ప్రధానమో ఫోటోగ్రఫీ, సంగీతం కూడా అంతే ముఖ్యం. అస్సలు సావిత్రిని చూడాలి! శ్రీదేవి చేసింది గురూ ...ఎన్టీ రామారావు ఇరగదీసాడుగా...అమితాబ్ డ్యాన్స్ చేసాడు ...అని ఊగిపోతూ మాట్లాడుకుంటాం గానీ సినిమాకి వెలుగునీడల ఆక్సిజన్ ఇచ్చి ప్రాణం పోసే ఫోటోగ్రాఫర్ల గురించి ఆ లెవల్లో మాట్లాడుకోవడం చాలా తక్కువ. కొంతమంది మంచి ఫోటోగ్రాఫర్లను తలచుకుందాం.


తొలి నమస్కారం సూపర్ ఫోటోగ్రాఫర్ మార్కస్ బారట్లేకి –మాయాబజార్ లో ట్రిక్ ఫోటోగ్రఫీ రవికాంత్‌ని నగయిచ్ చేసినా, కొబ్బరాకుల మీది నుంచి జాలువారిన వెన్నెలను నీటి కెరటాల మీద వెలిగించి, లాహిరిలాహిరిలాహిరిలో అంటూ ప్రేమపడవని నడిపించిన కవి మార్కస్ బారట్లే. మిట్టమధ్యాహ్నం ఎండలో షూట్ చేసి, వెండితెర మీద పండువెన్నెల కురిపించిన అసాధారణమైన సాంకేతిక నైపుణ్యముర్తి బారట్లే. 1917 ఏప్రిల్ 22 న మహారాష్ట్రలోని దేవలాలిలో ఒక పెద్ద ఆంగ్లో

ఇండియన్ కుటుంబంలో పుట్టాడు. తండ్రి తరచూ రాత్రి పూట వేట కోసం అడివిలోకి వెళ్ళేవాడు కొడుకుని తీసుకుని. అర్థరాత్రి గలగలలాడుతున్న రకరకాల చెట్ల ఆకుల మీద మిలమిల మెరుస్తున్న వెన్నెల కుర్ర బారట్లేని కవిగా మార్చింది. ఆ చిన్ననాటి వెన్నెల జ్ఞాపకాలే ఆ తర్వాత వెండి తెర మీద కావ్యాలుగా మారాయి. ప్రేక్షకుల్ని పరవశింపజేశాయి. 1945 లో వచ్చిన ‘స్వర్గసీమ’లో నవయవ్వన భానుమతి సౌందర్యాన్ని చూడాలి. ఓహోహో పావురమా...అంటూ కుర్రాళ్ళని కవ్వించిన భానుమతి గుర్తుందా? ఆ అందాన్ని తెర మీద పరిచినవాడు మార్కస్ బారట్లే. కెమేరా… ఫోటోగ్రఫీ –అంటుంటాం గానీ, అసలు ఆయువుపట్టు లైటింగ్ లో వుంటుంది. ఒక సన్నివేశం మనం మరిచిపోలేనంత అందంగా కుదిరిందంటే ,అది సెన్సిబుల్ లైటింగ్ ఎఫెక్ట్స్ వల్లనే!పాతాళ భైరవి (1951)మాయాబజార్ (1957)... నిండైన నవ్వుతో ఎన్టి ఆర్ ,డైలాగ్ విసురుతూ నిలువెత్తు ఎస్వీఆర్, వయ్యారంతో మురిపిస్తూ సావిత్రి, కొంటె మాటల రేలంగి, కోపంగా సూర్యాకాంతం, సురభికమలాబాయి –ఇలా అని చెబుతూ లెజెండరీ కేవి రెడ్డి … ఆ మూడ్‌ని ,ఆ భావోద్వేగాన్ని, బ్లాక్ అండ్ వైట్ మేజిక్ గా మార్చగలిగే సృజనాత్మకమైన ‘కన్ను’ మాత్రం మార్కస్ బార్‌ట్లేది.

జాతీయ అవార్డు పొందిన తకలి శివ శంకరపిళ్ళై ‘చెమ్మీన్ ‘(రొయ్యలు)నవల 1965 లో సినిమాగా వచ్చి కలకలం రేపింది. దాని ఫోటోగ్రాఫరూ బార్‌ట్లే. 1984 లో వచ్చిన ‘జిందగీ జీనే కేలియే’ దాకా భారతీయ వెండితెర సౌందర్యాన్ని కొత్త వెలుగు దారుల్లో నడిపించినవాడాయన. మన సాంకేతిక జ్ఞానం కుంటినడకలు నడుస్తున్న కాలంలోనే డీప్ ఫోకస్, సహజమైన కాంతి, సున్నితమైన కేమేరా కదలికలు, లెన్స్‌తో సయ్యాట, కళాత్మకమైన కంపోజింగ్ తో కళ్ళు చెదిరేలా సినీనిర్మాణ విలువల్ని ఆకాశమంత ఎత్తుకు తీసికెళ్ళగలిగిన తొలి విప్లవకారుడు మార్కస్ బార్‌ట్లే.


తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ల వివరాలతో 2023 లో ‘విజువల్ స్టోరీ టెల్లర్స్’ అనే ఒక అందమైన పుస్తకం అచ్చు వేసింది. ఖరీదైన ఆర్ట్ పేపర్ మీద, 24 మంది తెలుగు సినీ ఫొటోగ్రాఫర్ల జీవిత విశేషాలతో, ఫోటోలతో ఎంతో శ్రద్ధగా దీన్ని ముద్రించారు. తెర మీద డ్యూయెట్లు, ఫైట్లు, ఛేజింగ్, చిరంజీవి, జయసుధ, విజయశాంతి, ఊపిరాడనివ్వని క్లయిమాక్స్.. చూడ్డానికి అద్భుతంగా ఉంటాయి గానీ ఆ వెనక ఫోటోగ్రాఫర్ల కష్టం అంతాయింతా కాదు. అది దారుణమైన చాకిరీ, దుస్సాహసాలు చెయ్యాలి, నిద్రలేని రాత్రుల్లో ఎడతెగని పనిఒత్తిడి. మనం ఈజీగా హాయిగా ఆహా ఫోటోగ్రఫీ అనేస్తాం గానీ ...

నిజానికిది కళాత్మకమైన నరకయాతన! లారీలు ఎగిరి తిరగబడి పోతుంటాయి. లోయల్లోకి కార్లు దొర్లిపోతుంటాయి. తుపాకులు పేల్తూనే ఉంటాయి. మనుషులు గాల్లోకి ఎగురుతుంటారు. అమ్జాద్ ఖాన్ని అమితాబ్ ఎత్తి విసిరేస్తూ ఉంటాడు ... అరుపులూ...కేకలూ..నెత్తురూ ...ఈ బీభత్సాన్నంతా శ్రద్ధగా, హడావుడిగా రికార్డ్ చేస్తూ ఫోటోగ్రాఫర్లు! చచ్చేంత పని అంటే ఇదే మరి.

‘విజువల్ స్టొరీ టెల్లర్’, రచయిత, దర్శకుడు విందా ఆలోచన. మామిడి హరికృష్ణ చొరవతో, సురేంద్ర చాచా వేసిన బొమ్మలతో వచ్చిన ఈ అరుదైన డిజైనర్ పుస్తకంలో మన ఫోటోగ్రాఫర్లు ఎ.విన్సెంట్, కె.ఎస్.ప్రకాష్, ఎం.వి.రఘు, లోక్ సింగ్, ఎస్.గోపాల్ రెడ్డి, చోటా కె.నాయుడు, రసూల్ ఎల్లోర్, కె.కె.సెంథిల్ కుమార్, హరి అనుమోలు.. మొత్తం 24 మంది జీవితమూ, కృషిని రికార్డు చేశారు. తెలుగు వెండి తెరను కాన్వాస్‌గా మార్చి వేలాది పెయింటింగ్‌లు వేసిన ఈ నేపథ్య చిత్రకారులందరినీ ఎంతో ఇష్టంగా, ప్రేమగా తలుచుకున్నారు.

దేవదాసు, బాటసారి, శ్రీకృష్ణపాండవీయం, నర్తనశాల, మల్లీశ్వరి, బ్లాక్ అండ్ వైట్ వండర్స్... శంకరాభరణం, సిరివెన్నెల, అన్వేషణ, సత్య, క్షణక్షణం, బాహుబలి, మహానటి... మరపురాని మల్టీకరల్ మేజికల్, త్రిల్లర్స్-ఫొటోగ్రఫీపరంగా! పరమతుక్కు, చిల్లర, మెలోడ్రమెటిక్, కమర్షియల్ ఓవర్‌యాక్షన్, సెక్స్ సినిమాలని కూడా విజువల్‌గా స్టన్నింగ్‌గా తీసి కలెక్షన్లు కురిపించిన పాపాత్ములు కూడా ఈ ఫొటోగ్రాఫర్లే! సిల్క్‌స్మిత, జయమాలిని అయినా సమంత, రష్మిక మందనా అయినా ప్రేక్షకులు గింజుకు చచ్చేలా తెరపైన వాళ్ల అందాన్ని ఎలా ఎక్స్‌పోజ్ చేయాలి? ఒక్క అల్లరి నవ్వుతో, ఒక్క పదునైన చూపుతో, ఒక క్లీవేజ్ శృంగార భంగిమతో ప్రేక్షకుణ్ణి పడగొట్టడం ఎలా అనే ఆడదాని శరీర శాస్త్రం మీద ఒక్కో ఫొటోగ్రాఫరూ వంద పీహెచ్‌డీలు చేసి ఉంటారు.

నాటి ఆంగ్లోఇండియన్ మాస్టర్ ఫొటోగ్రాఫర్ మార్కస్ బారట్లే కి, బాలూ మహేంద్రకీ నిజమైన వారసునిగా మిరోస్లావ్ కూబా బ్రోజెక్ మెరుపులా దూసుకొచ్చాడు. ఆ పోలిష్ కళాకారుడే బ్లాక్‌బస్టర్ సుకుమార్ ‘పుష్ప’ ఫొటోగ్రాఫర్. ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ని కూడా అందుకున్నాడు. హింసనీ, ఉద్వేగాన్నీ, ఆకుల కదలికల్లోని కవిత్వాన్ని అంతే ఉత్రిీక్తంగా, అంతే సౌందర్యవంతంగా పట్టుకుంటాడు. వేడినెత్తురు నరాల్లో పరిగెత్తేలా అంతుచిక్కని ఫొటో ఫ్రేమింగ్‌తో హార్ట్‌ఎటాక్ తెప్పించగల అత్యాధునిక కెమెరా కవి మిరోస్లావ్ బ్రోజెక్. వేల కోట్లకి ఎదిగిన తెలుగు కమర్షియల్ సినిమా వాళ్లకి ఎప్పుడూ రుణడి ఉంటుంది...

అది ఎన్నటికీ తీర్చలేని రుణం.

Tags:    

Similar News