‘సైయారా’ వైరల్ సక్సెస్ సీక్రెట్
హృదయాన్ని తాకిన కథనా? హృదయాన్ని టార్గెట్ చేసిన స్ట్రాటజీనా?;
మీ సోషల్ మీడియా ఫీడ్‌ని స్క్రోల్ చేస్తున్నప్పుడు థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకున్న టీనేజర్లు, థియేటర్ల బయట చొక్కాతో కన్నీళ్లు తుడుచుకుంటున్న అబ్బాయిలు, సీట్లలో ఐవీ డ్రిప్స్‌తో కూర్చున్నవారిని చూసారా? అలాంటి మాంటేజ్ లు మీ ఫీడ్ లో తెగ కనిపిస్తున్నాయా,
ఓ ఎమోషనల్ రోలర్‌కోస్టర్‌లా కనబడుతోందా? — భయపడకండి. కంగారుపడకండి... ఇది మానసిక అస్థిరత కాదూ... ప్రేమలో పాడైపోయిన కొత్త తరం బాధ కాదు... ఇది "‘సైయారా’ ఎఫెక్ట్".
కొంతకాలంగా కె-డ్రామాలూ, ఇంటర్నేషనల్ ఫ్రాంచైజీల వైపు ఆకర్షితులైన యువత ఇప్పుడు ఈ సినిమాతో మళ్లీ బాలీవుడ్ వైపు తిరుగుతున్నారు — అదీ భారీగా. ఒక్క సినిమా... ఒక్క ప్రేమ కథ... ఇంతలా హృదయాలను తాకుతుందా,వేరేది ఏమైనా ఉందా అనేది అర్థం చేసుకోవాలంటే, దీని వెనుక ఉన్న కథన శక్తిని,మార్కెటింగ్ యుక్తిని గమనించాల్సిందే.
2025లో విడుదలైన ‘సైయారా’ అనే చిన్న సినిమా, ఊహించని విధంగా బాలీవుడ్ సినీ చరిత్రలో ఒక మైలు రాయిగా మారుతోంది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై వచ్చిన ఈ భావోద్వేగాత్మక ప్రేమకథ, వరల్డ్ వైడ్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినిమాకే సరికొత్త మార్కెటింగ్ వ్యూహాల పాఠాలు నేర్పుతోంది. ఈ నేపధ్యంలో ఓ ప్రశ్న – ఇది నిజమైన ఎమోషనల్ రెస్పాన్సా? లేక దీని వెనుక ఉన్నది ఒక అద్బుతమైన పీఆర్ స్క్రిప్టా? జెనరేషన్ Z భావజాలాన్ని హైజాక్ చేస్తూ మన ముందుకు వచ్చిన వ్యూహమా?
“Publicity is like electricity – it powers only what’s already built strong.”
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్వెంటిన్ టరంటీనో ఓ ఇంటర్వూలో సినిమాకు పబ్లిసిటీ అవసరాన్ని ప్రస్తావిస్తూ ఈ మాట చెప్తారు. ఇది అంతకు ముందు ఎంతో మంది మార్కెటింగ్ వాళ్లు చెప్పిందే అయినా సినిమాకు కూడా బాగా వర్తిస్తుంది. ముఖ్యంగా స్ట్రాంగ్ గా ఉన్న సినిమాకి పబ్లిసిటీ పవర్ అందిస్తుంది అని.
‘సైయారా’ సినిమా విజయం కేవలం ఓ బ్లాక్‌బస్టర్ కథే కాదు – ఇది సినిమా భావోద్వేగాలను ఎలా వ్యూహాత్మకంగా "అనుభూతులుగా" ప్యాక్ చేసి, జనాల గుండెల్లో నాటవచ్చో చూపించిన పాఠంగా బాలీవుడ్ ట్రేడ్ ఇప్పుడు పరిశీలిస్తోంది. ప్రేక్షకుల రియాక్షన్లు కాస్తంత నాటకీయంగా ఉండటంతో , సినిమా వాళ్లు మౌనంగా వాటిని ఎనాలసిస్ చేసుకునేలా చేస్తోంది. ‘సైయారా’ అనే ఫినామెనాను లోతుగా విశ్లేషిస్తూ – జెనరేషన్ Z భావజాలం, వైరల్ కల్చర్, మార్కెటింగ్ మానిప్యులేషన్ ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఈ సినిమాతో అర్దం అయ్యిందంటున్నారు.
థియేటర్స్ లో అంతమంది ఎందుకు ఏడుస్తున్నారు? ఎడిట్లు ఎవరు వైరల్ చేస్తున్నారు? ఇది బాలీవుడ్‌కు తిరిగొచ్చిన సక్సెస్ యేనా? లేక మనమంతా ఒక అద్బుతమైన మాయాజాలం ఇరుక్కుంటున్నామా?
సైలెంట్ ప్రమోషన్ – భారీ ప్రభావం
సాధారణంగా బాలీవుడ్‌లో లాంచ్ అయ్యే స్టార్స్‌ను ఎన్నో పాడ్‌కాస్ట్‌లు, ఇన్‌ఫ్లుఎన్సర్ రీల్స్, బ్రాండ్ టై-అప్స్‌కి తీసుకెళ్లడం రివాజు. కానీ ‘సయ్యారా’ కోసం ఆ ట్రాక్ పూర్తిగా వదిలేశారు.
ఎలాంటి హడావుడి ఇంటర్వ్యూలు లేవు.
రెడ్ కార్పెట్ మెరుపులు లేవు.
ట్రెండ్ అవ్వాలనే ఉద్దేశంతో చేసే పిచ్చి పనులు లేవు.
ఇవన్నీ కాకుండా, సినిమా ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు. ఆ తర్వాత వారం రోజుల ముందే హృద్యమైన మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేశారు. డైరెక్టర్ మోహిత్ సూరి ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు తప్ప, స్టార్ కాస్ట్ దాదాపుగా కనిపించలేదు. ఇది చాలా గొప్ప వ్యూహంగా నిలిచింది. మెల్లిమెల్లిగా ఏదో జరుగుతోంది. ఈ సినిమా ఏదో బాగుండేటట్లు ఉందే అనే ఫీల్ కలగచేసారు. హై ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ చేయలేదు. ఎలాంటి అతి ప్రచారం లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి, తమ హృదయ విరహాన్ని, మధుర జ్ఞాపకాలను, ఇన్‌స్టాగ్రామ్ లో వేసుకునేందుకు చోటు ఇచ్చింది.
అదే సమయంలో కొన్ని వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం మొదలైంది. ఎమోషన్ కి తట్టుకోలేక స్క్రీనింగ్ మధ్యలో ఏడుస్తూ బయిటకు వెళ్ళిపోతున్న అమ్మాయిలు… ఛాతీలో టేపుతో ఐవీ డ్రిప్ పెట్టించుకుని సినిమా చూస్తున్న అబ్బాయి… ఫస్ట్ హాఫ్ ఆఖర్లోనే ప్రేమజంటలు థియేటర్‌లో డాన్స్ చేయడం మొదలుపెట్టడం, రిలేషన్ బ్రేకప్ అవుతుంటే వచ్చే అరుపులు, ఎమోషనల్ బ్రేక్డౌన్లు థియేటర్స్ లో ప్రత్యక్షంగా వినిపిస్తున్నాయి. అలాగే క్లైమాక్స్‌కి టైం కాగానే, ఓ బాయ్‌ఫ్రెండ్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను తిప్పుతూ, “ఫిల్మీ” మోమెంట్‌కి ట్రిబ్యూట్ ఇవ్వటం...ఇలాంటి వీడియోలు వైరల్ అవ్వటం మొదలయ్యాయి. ఆ క్లిప్ ఇప్పుడు మీమ్‌ల్లో సెటిల్ అయిపోయింది…
ఇవన్ని విన్నపుడు “ఓవర్ హైప్” అనిపించొచ్చు. చూస్తున్నప్పుడు లైట్ అనిపించవచ్చు. కానీ ఏదో మనకు తెలియకుండా జరిగిపోతోంది. మనం ఆ ఎక్సపీరియన్స్ ని మిస్ అవుతున్నాం, ఆ తీపి జ్ఞాపకాలను మనకు కావాలి అంటూ థియేటర్స్ కు పరుగెడుతున్నారు. చూస్తూ వాళ్లు అలాంటి వీడియోలు పెడుతున్నారు. తాము గొప్ప ప్రేమికులమే అని చెప్పుకోవటానికి ఇదో వేదికగా మార్చుకుంటున్నారు. దాంతో మొదటవారంలోనే ‘సినిమా చూసిన అనుభవం’ కాదు — ఒక ఎమోషనల్ లో ఒక జెనరేషన్ మునిగిపోవడం మొదలైంది.
అసలు ప్రశ్న ఇదే –‘సైయారా’ నిజంగానే అంత ఎమోషనల్ ఫిల్మా? లేక ఇది ఓ సంస్కృతి సంచలనం అనిపించే మాయగా కనిపించే, గొప్ప పీఆర్ వ్యూహమా?
ఒక్క విషయం మాత్రం క్లియర్ — థియేటర్లలో ఎమోషనల్ బ్రేక్‌డౌన్‌ల వీడియోలు సినిమాకు ఓ రేంజిలో పబ్లిసిటీ తెచ్చాయి. కానీ... అదే వీడియోలు, అదే థీమ్‌లో వస్తున్న ఇనిస్టగ్రామ్ ఎడిట్లు క్రమంగా ఒక పీఆర్ ప్రచారంలా అనిపించడంతో మొదలైంది సందేహం. రెడ్డిట్ వేదికగా కొందరు చెప్తున్నది ఒకటే — ఇది ఒక రెగ్యులర్ గా ఫార్ములా గాసిప్ పేజీలను ఆశ్రయించలేదు. చిన్న ఎడిట్ పేజీలను, ఆడియెన్స్ టేస్ట్‌ను షేప్ చేసే అకౌంట్లను టార్గెట్ చేసింది.
ఇది సాధారణ “పెయిడ్ ప్రోమో” కాదు. ఆ వ్యూహం తలదన్నే స్థాయిలో ప్లానింగ్‌తో నడిచింది.ఇవి వ్యూహాత్మకంగా చిన్నా చితకా జెన్యూన్ ఎడిటింగ్ పేజీలతో కలిసి పనిచేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీలు తమ ఫాలోవర్స్‌కు నిజమైన విజువల్ టేస్ట్‌ను పరిచయం చేసే సత్తా ఉన్నవి. దాంతో వాటి పోస్ట్‌లు ప్రచారం అనిపించకుండా ఆర్గానిక్‌గా విస్తరించాయి. ఇది PR కి ఒక కొత్త మలుపు, జెన్యూయన్ ఫీల్ ఉన్న ప్రొమోషన్.
సాధారణంగా ... "Gen Z ప్రేక్షకులు చాలా త్వరగా తీర్పు చెప్పేస్తారు. ఏదైనా కంటెంట్ ఫేక్ లేదా ఒరిజనల్ ఎమోషన్ అనేది కనిపెట్టేయగలరు. కానీ వాళ్లకు ఇష్టమైన ఎడిట్ పేజీ, వాళ్లే ఫాలో అయ్యే విజువల్ టేస్ట్‌ను నిర్ణయించే అకౌంట్, సయ్యారా సీన్‌ను ఎడిట్ చేస్తే... అప్పుడు అది నకిలీగా అనిపించదు కదా? ఇదే అసలైన గేమ్ ఛేంజర్.”
కొత్త తరహా పీఆర్ వ్యూహం – ఖర్చు తక్కువ, ఎఫెక్ట్ ఎక్కువ
LinkedInలో జీత్ ఠాకూర్ అనే యూజర్ ఒక ఆసక్తికరమైన విషయం పోస్ట్ చేశాడు:
“సయ్యారా మేకర్స్ చిన్న మొత్తాలు చెల్లించి, తక్కువ ఆదాయ వర్గానికి చెందిన యూత్‌ను థియేటర్లకు రప్పించారట. వాళ్లంతా సినిమాలో హైపరాక్టివ్‌గా ఆనందించటం, చప్పట్లు కొట్టటం, సెల్ఫీలు తీయటం మొదలైనవి చేసి... ఇంటర్నెట్‌లో బజ్ క్రియేట్ చేసారు.”
ఒక పద్ధతిగా ఈ ప్రచారం కనిపించినా, ఇది పనిచేసిందని ఆయన చెబుతున్నాడు. అందులో నిజమెంత అనేదాని కన్నా ఓ కొత్త పీఆర్ వ్యూహం ఎప్పుడూ గెలుస్తుంది. సినిమావాళ్లు కొత్త వ్యూహాలు పన్నక పోతే కష్టం అని తేల్చి చెప్పేస్తోంది.
ఇవన్నీ ఎలా ఉన్నా , సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రం ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే లోపు ‘సయ్యారా’ రూ.172.71 కోట్లు (ఇండియాలో) వసూలు చేసింది. 2025లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లను సయ్యారా దాటి వేసింది.
బాలీవుడ్ ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నాహటా మాట్లాడుతూ ‘సైయారా’ ను యాష్‌రాజ్ ఫిలింస్‌కు చెందిన ఆధునిక డీడీఎల్‌జే (Dilwale Dulhania Le Jayenge) గా పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే – ఈ సినిమా టైర్ 2, టైర్ 3 నగరాల్లో ప్రేక్షకుల మనసును ఎంత లోతుగా తాకిందో చెప్పేలేం! గత 15 ఏళ్లలో, ప్రత్యేకించి కరోనా అనంతరం, ఇలాంటి స్పందన చూడలేదు,” అని ఆయన అన్నారు.
అయితే మొదటే చెప్పుకున్నట్లు సినిమాలో విషయం లేకపోతే ఎంత పబ్లిసిటీ కూడా ఏమీ చెయ్యలేదు.
‘Saiyaara’ అనేది చూసే సినిమా కాదు – ఓ మౌన ప్రేమ లేఖ గా యూత్ ఫీల్ అవుతున్నారు కాబట్టే ఈ స్దాయిలో వర్కవుట్ అవుతోంది. ఇక్కడ మనం గమనించాల్సిన కొత్త పాఠం: ఈనాటి ప్రేక్షకుడు ప్రేమకథల కోసం మాత్రమే థియేటర్లలోకి రావడం లేదు — వాళ్లు వాళ్ల అంతర్గత మనస్తత్వాన్ని అద్దంలా చూసే మాధ్యమంగా సినిమాలను స్వీకరిస్తున్నారు. సయ్యారా వాళ్లు ఎమోషనల్ కావాలనుకునే మార్గాలను నిర్మించింది. ఆ మార్గాలపై వాళ్లు నడుస్తున్నారు.
సినిమా ఇప్పుడు కథ కాదు, ఒక carefully constructed sentiment. And sentiment sells. Especially when it cries.