The Two Popes-నిశబ్ద దివ్య దృశ్య సంభాషణ
నన్ను వెంటాడిన సినిమాలు-9 (ఫిల్మ్ క్రిటిక్ రామ్ సి మూవీ కాలమ్);
-రామ్ సి
ఈ సినిమా టైటిల్ లో ‘ది’ (The) అని ఉండడం నన్ను ముందు ఆకర్షించిన సంగతి. ఆలా మొదలైన ఆసక్తి ఈ సినిమాను భావనాత్మకంగా చూడాలా, తాత్వికంగానా, ఆధ్యాత్మిక ధోరణిలోనా అంటూ సాగిన మీమాంస వైనం నాకు నేటికీ గుర్తుంది.ఓ సినిమా చూడ్డానికి ఇంత ఆలోచన ఎందుకనో నాకు అంతుపట్టలేదు. ఆలా మొదలై, నాతొ నిలిచిపోయింది.
The Two Popes చిత్రాన్ని చూడటం ఒక సాధారణ నిజ జీవిత సంఘటన స్పూర్తితో తీసిన బయోపిక్‌ను వీక్షించిన అనుభూతికంటే, ఒక పవిత్రమైన చరిత్ర ద్వారం నెమ్మదిగా తెరుచుకుంటూ మనల్ని ఆ లోకంలోకి ఆహ్వానించినట్టుగా అనిపించింది. ఆ ఆహ్వానం ఆకట్టుకునేది వాటికన్ (Vatican) ప్రాచీనత గాని, సిస్టైన్ చాపెల్ (Sistine Chapel) కళాత్మకత మాత్రమే కాదు, అందులో కనిపించిన పోప్ ల (Popes) మానవత్వం, లోపాలు, ఒత్తిడిలో తడబడి తూలే ఆ మనిషుల గూర్చి తెలుసుకొనేందుకు దొరికే ఓ చిన్న సందర్భ శోధన.
కథ Cardinal Bergoglio (అదేదో నిజమైన pope Francis ఆత్మలోంచి వెలిసినట్టు నటించిన జోనాథన్ ప్రైస్ (Jonathan Pryce) మహా అద్భుతం) తన పదవికి రాజీనామా చేయాలనే కృత నిశ్చయంతో తనకు కబురెట్టిన పోప్ బెనెడిక్ట్ (Pope Benedict) ను (మరో మహానట దిగ్గజం Anthony Hopkins) ఆయన అనుమతి కోసం కలవడంతో మొదలైన వారి సంభాషణ పైకి మృదువుగానే సాగినప్పటికీ, లోపల తీవ్రమైన సిద్ధాంత విభేదాలతో తడిబారిన నిశ్శబ్దం నిండి ఉంటుంది.ఈ సంభాషణలు కేవలం ఆధ్యాత్మిక సిద్ధాంతాల గురించి మాత్రమే కాదు భయం, అపరాధభావం, విసుగూ అంతర్లీనంగా ప్రతిధ్వనించడం వారిని మనకు అతి దగ్గరగా చేరుస్తాయి. పొప్ ను ఇంత గొప్పగా మనకు పరిచయం చేసిన సినిమా లేదు, అందుకేనేమో ఈ సినిమా మనల్ని వెంటాడుతుంది.
మీ రాజీనామా స్వీకరించడం ప్రసక్తే లేదంటూ నేను మిమల్ని పిలిపించింది నేను రాజీనామా చేద్దామనుకున్న నిర్ణయం మీకు చెబుతామని అనడంతో షాక్ గురవ్వడం బెర్గాగ్లియో (Bergoglio) వంతైయితుంది. తన జీవితంలోని అర్జెంటీన మురికి యుద్దం (Argentina’s Dirty War) సందర్భాలను ప్రతిబింబించే ఫ్లాష్‌బ్యాక్‌లు అంతరంగాన్ని చూపించే తీరు, ఒక యువ ప్రబోధకుడిగా తన బాధ్యతలూ, విధేయత మధ్య తడబడడం, అతని నిశ్శబ్దం, కొందరి బాధకు, చావుకు కారణమైందనే నిశ్చలమైన బాధ అతని హృదయంలో వెచ్చని ముద్రలా మిగిలుండటం తెలుస్తుంది.
అసలు అత్యంత దిగ్భ్రాంతికరమైన దృశ్యం , Pope Benedict తన పాపాలను ఒప్పుకొని Bergoglio వద్ద కనెఫెషన్ (confession) అభ్యర్థించే దృశ్యం. అందులో ముఖ్యంగా వారిద్దరూ మాట్లాడుకొంటున్నా, మనకు వినపడకపోవడం, గబ్బుకున్న ఆ గది వెలుపలకు కెమెరా తీసుకెళ్లి పోయి, లోపల పొప్ ఏమి పంచుకొన్నారో ,మనకు తెలియకుండా చేయడం నన్ను కుదిపేసింది. సామాన్యుడికే చేసిన తప్పులు ఒప్పుకోవాలంటే చలించిపోతాడు, అటువంటిది పొప్ విషయానికొస్తే అది ఏంతో గౌరవంగా దర్శకుడు మలిచిన తీరు, మనం ఆ సినిమా చూసే ప్రేక్షకులం కాదని ద్రువీకరించబడుతుంది. ఒక Pope, సంప్రదాయపరంగా సంపూర్ణ అధికారాన్ని సూచించే స్థానంలో ఉన్నవాడు, గతంలో తాను సందేహించిన వ్యక్తిని మోక్షానికి మధ్యవర్తిత్వం చేయమని అడగడం, అది వినయానికి పరాకాష్ఠ.
ఈ రెండు ఆత్మల మధ్య సంభాషణలు మెఖేలింజిలోస్ లాస్ట్ జడ్డ్ మెంట్ (Michelangelo’s Last Judgment) గీసిన చిత్రానికి కింద చోటు చేసుకుంటాయి, అది దర్శకుడి ప్రతిభకు తార్కాణం. అక్కడ వాళ్లకు మధ్య జరిగేది వాదం కాదు, ఆత్మ పరిశీలన. ఏది క్షమించాలి, ఏది మర్చిపోవాలి అన్న తపన. ఎవరి కదలికలలోనూ శబ్దం లేదు, కానీ సారం నిండినది. ఇంకా కొన్ని మధుర క్షణాలు Benedict తన తళతళలాడే మృదుస్వర పియానోతో అతిథికి వినిపించడం, ఇద్దరూ కలసి అర్జెంటనీ వర్సెస్ జర్మనీ (Argentina vs Germany) ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ఆస్వాదించడంలో కనిపించిన చలాకి మరిచిపోలేనివి. ఈ సంఘటనలన్నీ వారి గౌరవహోదాలో దాగిన సాధారణతను బహిర్గతం చేస్తాయి. వారు పోపు లు కావచ్చు, కానీ అంతకు ముందు వారు మనలాగే మాంసమున్న ఆశలున్న మనుషులు.
Jonathan Pryce మరియు Anthony Hopkins పాత్రలు పోషించలేదు, వారు అందులో నిజంగా స్పర్శించారు. సినిమా ఆసాంతం ఎరుపు, తెలుపు, నలుపు దుస్తులతో జరగబోయే సన్నివేశాల లోతుకు ప్రతీకగా కనిపిస్తాయి. వారి చూపుల్లో, నిశ్శబ్దంలో, చిరునవ్వుల్లో,చేతుల్లో, ప్రేమలో, కినుకులో, కోపంలో, ఆర్ద్రత పలకరిస్తుంది, శాంతి ,మంచి,క్షమభావం అవసరం తెలుపుతూ, ఒక ఆత్మీయ మైత్రీగా మారడానికి మనం సాక్షులమౌతాం.
The Two Popes మనకు Vatican మాత్రమే చూపించదు,మనల్ని వారి సంభాషణల మధ్య మమేకం చేస్తుంది. సుసంపన్న భావనలు కప్పేస్తాయి. ఊరెడుతూ ఓ తండ్రిని కౌగిలించుకోవడంలోని వెచ్చదనం మనల్ని తాకుంది. ఆ తండ్రి సువాసన మనతో ప్రయాణిస్తుంది.అదే ఈ చిత్రంలోని అసలైన మహత్మ్యం. చివరికి ఇది మనకు ఒక నిజాన్ని మృదువుగా చెప్పుతుంది: తెల్లని వస్త్రాలలో కనిపించే శక్తిమంతుల హృదయాల్లోనూ ఎర్రటి భయాలుంటాయి, నల్లని పాపాలుంటాయి, పశ్చాత్తాపాలుంటాయి. వారు కూడా క్షమ కోరతారు. వారు కూడా మానవులే.
మనిషికి మనిషి ఓ గొప్ప ఆస్తి. హోదా. నమ్మకం. దేవుడు తరువాతి వరుసలో వచ్చేవాడని చెప్పే కథా శైలి అమోఘం.
పలుకు మౌనమైతే బంగారం. సంభాషణ నిశ్శబద్దమైతే విస్ఫోటనం. అది తెలుసుకుంటే దివ్య తేజ అనుభూతి. అది నేటికీ నా మనసులో అలానే ఉంది.