ఆంబులెన్స్‌ ఎలా ఉంటుందో తెలీని మనుషులు!

వాగు పొంగితే వారికి ప్రాణాలు దక్కవు!;

Update: 2025-07-28 10:34 GMT
దండుపల్లి లో జబ్బు పడిన యువకుడిని డోలీలో మోసుకు వెళ్తున్న యువకులు

ఇక్కడ రోగం వస్తే నరకమే. అడవిలో కాలి బాటలో 2 కిలోమీటర్లు వాగులు వంకలు దాటి ప్రధాన రహదారికి చేరుకోవాలి. ఒక వేళ భారీ వానలకు

దారిలో పెద్ద వాగు పొంగితే ఇంకా వారికి బైట ప్రంపంచంతో సంబంధాలు ఉండవు. వైద్యం అందదు. చావైనా బతుకైనా అక్కడే ఉండాలి!

తెలంగాణలోని జయశంకర్‌ భూపాల్‌ పల్లి జిల్లా, మహాముత్తారం మండలం, దండు పల్లి ఆవాసం నుండి ‘ ఫెడరల్‌ తెలంగాణ’ ప్రతినిధి అందిస్తున్న మానవీయ కథనం.

.............

దండుపల్లి ఆవాసం నుండి ఇద్దరు యువకులు మంచాన్ని కావడిలా కట్టుకొని మోసుకొంటూ పరుగులు తీస్తున్నారు... ఆ మంచం మీద ఒక యువకుడు ముడుచుకొని పడుకున్నాడు.

‘ ఏమైంది? ’ అని అడిగాం.

‘ జ్వరం ఎక్కువగా ఉంది లేవలేక పోతున్నాడు... ’ బరువును మోస్తూ ఆయాసంగా అన్నాడు వారిలో ఒక యువకుడు.

‘ ఆంబులెన్స్‌కి ఫోన్‌ చేయక పోయారా?’

‘ అవి ఇక్కడకు రావు, మేమే రోడ్‌ వరకు తీసుక పోతం, మధ్యలో వాగు దాటాలి...’ అని వారు వేగంగా వెళ్లి పోయారు.

వానలు లేక ఈ వాగు నిండ లేదు. లేకపోతే వీరు రోగిన తీసుకెళ్లడం కష్టం.

వారి వెనుకే మేము వెళ్లాం . ఒక పెద్ద వాగు అడ్డంగా ఉంది.అదృష్టవశాత్తు ఇంకా వరద నీరు రాలేదు. రోగితో సహా వారు వాగు దాటి మెయిన్‌ రోడ్‌ చేరుకున్నారు.

ఒక ఆటోను ఆపి రోగిని దానిలో పడుకో పెట్టి ఆసుపత్రి వైపు బయలు దేరారు.

కాలి బాటలో దాదాపు 50 నుండి 60కిలోల బరువున్న రోగిని మోయడం చాలా కష్టం.

ఆదివాసీ అభివృద్ధి కాగితాలకే పరిమితమా ? 

ఆయుష్మాన్‌ భారత్‌-ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం అని ప్రభుత్వ సమాచారం.

ప్రధాన రహదారికి చేరుకొని ఆటోలోకి రోగిని చేరుస్తున్న దృశ్యం

ఇది దేశవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మందికి , ప్రత్యేకంగా ఆర్థికంగా వెనుకబడిన మారుమూల ఆదివాసీ ప్రాంతాల్లో కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో, ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 10,000 కోట్లు కేటాయించింది. ఇందులో 60% కేంద్రం మరియు 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ‘ ఆదివాసీ ప్రాంతాలలో, ఈ పథకం ఆసుపత్రి చికిత్సల కోసం ఆర్థిక రక్షణను అందిస్తుంది, ఇది మారుమూల ఆదివాసీలకు కీలకమైనది...’ ప్రభుత్వ వర్గాలు అంటాయి కానీ, మహాముత్తారం వంటి ప్రాంతాలకు ఆ పథకం చేరదు.

రహదారి లేని ఆవాసాలు ఎన్ని ?

తెలంగాణలో ఆదివాసీలు ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసిఫాబాద్‌, నాగర్‌కర్నూల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కొండ గోండ్‌, కోయ, చెంచు, లంబాడి వంటి ఆదివాసీ తెగలు ఉన్నాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణలో షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ జనాభా సుమారు 31.78 లక్షలు (మొత్తం జనాభాలో 9.34%). వీరిలో చాలా మంది గిరిజన గూడెంలలో నివసిస్తారు, కానీ రహదారి సౌకర్యం లేని ఆవాసాల ఖచ్చితమైన సంఖ్యపై అధికారిక డేటా ఇప్పటి వరకు అందుబాటులో లేక పోవడం ప్రభుత్వ వైఫల్యం.

అనధికారిక నివేదికలు, వార్తా కథనాల ప్రకారం, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌ జిల్లాలో సుమారు 70 నుండి 100 గూడేలు వరకు ఇప్పటికీ పూర్తి స్థాయి రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయని అంచనా.

మారని మన్యం జీవన చిత్రం 

‘ గిరిజన గ్రామాల్లో రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే.మారుమూల ప్రాంతాలు అయితే మరీ అధ్వానం . వానా కాలంలో ఎక్కువ మంది అనారోగ్యాలకు గురవుతుంటారు.

ముఖ్యంగా మలేరియా ,అతిసారం వ్యాధులు వస్తాయి. అదే సమయంలో వాగులు పొంగి చాలా గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి,ఆంబులెన్స్‌లు ,జీపులు కూడా వెళ్ల లేని పరిస్ధితి. ఇలాంటి పరిస్ధితిల్లో గర్భిణీలకు వైద్యం అందటం కష్టమే.డోలీ కానీ,మంచం మీద కాని మోసుకొని వెళ్లాలి.పొంగుతున్న వాగులు దాటలేక ఇవతల వడ్డున

రోగులు చనిపోయిన సందర్భాలు అనేకం చూశాను. ఒకవేళ ఆంబులెన్‌ అందుబాటులో ఉన్నా బురదలో ఇరుక్కు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో కష్టాలు పడి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుకున్నా, అక్కడ కొన్ని సార్లు వైద్యులు ఉండరు,మందులు ఉండవు,పడకలు ఉండవు, జననం, మరణం దైవాధీనం. గత నాలుగు దశాబ్దాలుగా చూస్తున్నాం. ’’ అంటారు డా,విఎన్‌వికె శాస్త్రి.ఈయన 1971 నుండి 2005 వరకు గిరిజన సాంస్కృతిక ,పరిశోధన ,శిక్షణ సంస్ధలో వివిధ హోదాల్లో పని చేశారు.

గత 40 ఏండ్లుగా గిరిజన శాఖలో పనిచేసి, అనేక మూరుమూల గిరిజన గూడేలు పర్యటించిన పరిశోధకుడు.

ఆసుపత్రికి వెళ్లడం నరకం 

‘ రహదారి సౌకర్యాల సమస్యలు వల్ల వైద్య సౌకర్యాల కొరత: రహదారులు లేని ఆవాసాల్లో రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడం పెద్ద సవాలుగా ఉంది. గర్భిణీలు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారిని డోలీలో మోసుకెళ్లడం సర్వసాధారణం. తెలంగాణలోనే కాదు, ఆంధ్రా మన్యంలో కూడా ఈ పరిస్ధితిని చూశాను. రహదారులు లేకపోవడం వల్ల ఈ గ్రామాలకు చెందిన పిల్లలకు చదువు కూడా దూరం అవుతున్నది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, మార్కెట్‌కు యాక్సెస్‌ కూడా ఉండదు. ఇక్కడ తాగు నీరు పెద్ద సమస్య. వాగుల్లో ఇసుక నుండి తోడుకొని నీళ్లను తెచ్చుకుంటారు. ఆ కలుషితమైన నీటి వల్ల తరచూ వీరు రోగాల పాలవుతున్నారు.

ఇక్కడ తాగునీటికి ఇలా వాగుల పక్కన కలుషిత ఊట నీటిని తోడుకొని తాగాల్సిందే.

ప్రభుత్వ సేవలు: రహదారులు లేని ఆవాసాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్‌, ఇతర సేవలు సకాలంలో చేరడం కష్టం.’ అంటాడు సంతోష్‌ ఇస్రం.

ఆదివాసీ గ్రామాల సమస్యల పై తెలంగాణ.ఆంధ్రాలో అధ్యయనం చేస్తున్న సంతోష్‌ ఇస్రం

ఈ యువకుడు ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ జర్నలిజం చేశాడు. ఆదివాసీల జీవనం పై అధ్యయనం చేస్తున్నాడు.

ప్రభుత్వం ఏమి చేస్తుంది ? 

తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ, పంచాయతీ రాజ్‌ , ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద గ్రామీణ రహదారుల నిర్మాణం జరుగుతున్నప్పటికీ , ఆదివాసీ ప్రాంతాల్లో అటవీ చట్టాలు, భూ సేకరణ సమస్యలు, నిధుల కొరత వంటి కారణాల వల్ల పురోగతి లేదు.

2021-2022లో తెలంగాణ ప్రభుత్వం 47 గ్రామ పంచాయతీలకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు ప్రకటించింది, కానీ ఈ గ్రామాల్లో ఎన్ని ఆదివాసీ గూడెంలు ఉన్నాయనే వివరాలు స్పష్టంగా లేవు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అటవీ గ్రామాలు, ముఖ్యంగా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో రహదారి సౌకర్యాలు లేని గూడెంలు ఉన్నాయి.

కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని గిరిజన గూడెంలలో కొన్ని రహదారులు లేకపోవడం వల్ల వర్షాకాలంలో గ్రామస్థులు పూర్తిగా ఒంటరిగా మిగిలిపోతారు. వైద్య సేవలు, విద్యా సౌకర్యాలు అందడం కష్టంగా ఉంది.

హైటెక్‌ హైదరాబాద్‌కి ఎంత దూరం? 

ఆధునిక ఆరోగ్య వసతులతో ఉండే హైదరాబాద్‌ మహా నగరానికి, మహాముత్తారం దాదాపు 250 కిలోమీటర్లు.ఇక్కడ గొత్తి కోయ కుటుంబాలు అక్కడక్కడా చిన్న ఆవాసాలుగా ఏర్పిడి పోడు వ్యవసాయం చేస్తుంటారు.దండు పల్లి ఆవాసంలో దాదాపు 50 కుటుంబాలుంటాయి.

వారికి వైద్యమే కాదు, విద్య కూడా అందనంత దూరం. అందుకే ఇక్కడి పిల్లలు చదువు అందదు.

ఇదీ పరిష్కారం 

తెలంగాణ ప్రభుత్వం రహదారి సౌకర్యం లేని ఆదివాసీ ఆవాసాలపై సమగ్ర సర్వే నిర్వహించి, ఖచ్చితమైన గణాంకాలను విడుదల చేయాలి. అటవీ చట్టాలను సడలించి,

The Pradhan Mantri Gram Sadak Yojana( PMGSY ) వంటి పథకాలను వేగవంతం చేయడం ద్వారా రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయాలి.

ప్రత్యామ్నాయాలు: రహదారులు నిర్మించే వరకు, అవకాశం ఉన్న మేరకు ఆవాసాల్లో చదువుకున్న నిరుద్యోగులను ఆశావర్కర్లుగా నియమించాలి. డ్రోన్‌ ద్వారా ఔషధాల రవాణా, మొబైల్‌ ఆసుపత్రులు వంటి తాత్కాలిక పరిష్కారాలను అమలు చేయవచ్చు.

Tags:    

Similar News

నువ్వే!