14న ప్రముఖ ఒడెస్సీ నృత్యకారిణి మధులితా మొహాపాత్ర ప్రదర్శన
నృత్య ప్రదర్శనకు కొండాపూర్ లోని ధరోహర్ డాన్స్ అకాడమీ ముస్తాబు;
By : The Federal
Update: 2025-09-12 10:45 GMT
ప్రఖ్యాత ఒడెస్సీ నృత్య ప్రదర్శనకు హైదరాబాద్ కొండాపూర్ సిద్ధమైంది. కొండాపూర్‌లోని ధరోహర్ డాన్స్ అకాడమీ వేదికగా ప్రసిద్ధ ఒడిస్సీ నర్తకి మధులితా మోహపాత్ర ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు సాగిన “ఒడిస్సీ ఇంటెన్సివ్ వర్క్‌షాప్” ఈనెల 14న ముగియనుంది.
ఈ సందర్భంగా ప్రముఖ ఒడెస్సీ నృత్యకారిణి మధులితా మొహాపాత్ర ప్రత్యేక సోలో ప్రదర్శన తో అలరించనున్నారు. కొండాపూర్ లోని ధరోహర్ డాన్స్ అకాడమీ, ప్లాట్ 60, B స్ట్రీట్ 3, 3rd క్రాస్, బర్ఫీ ఘర్ పక్కన, శ్రీరామనగర్ – బ్లాక్ B లేన్ లో జరిగే ఈ కార్యక్రమానికి ఒడెస్సీ నృత్య కళాభిమానులందరూ హాజరు కావొచ్చు.
అంతర్జాతీయ వేదికలపై ఒడెస్సీ అడుగులు..
ఒడెస్సీ నృత్యరంగంలో మధులితా మోహపాత్ర కు ప్రత్యేక స్థానం ఉంది. ఒడిస్సీ నృత్యరంగంలో మధులితా మోహపాత్ర అనే పేరు వినగానే కళాభిమానుల హృదయాల్లో ఓ మధురానుభూతి మిగులుతుంది. ఆహ్లాదకరమైన అభినయంతో, సరికొత్త ఆలోచనలతో సాగే నృత్య రచనలతో, మధులిత ఈ తరం ప్రముఖ ఒడెస్సీ ప్రతినిధిగా ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ (కేంద్ర సంగీత నాటక అకాడమీ), యుకే పార్లమెంట్ ఇచ్చిన షీ ఇన్‌స్పైర్స్ అవార్డు 2024, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అందజేసిన దేవి అవార్డు 2024, కెంపేగౌడ అవార్డు – ఇవన్నీ ఆమె ప్రతిభకు నిదర్శనాలు. అంతర్జాతీయ వేదికల నుంచి దేశీయ ఉత్సవాల దాకా ఆమె నృత్యయాత్ర ప్రతిష్ఠను, గౌరవాన్ని చేకూర్చింది.
దూరదర్శన్ A గ్రేడ్ ఆర్టిస్ట్, ICCR ఎంపానెల్ కళాకారిణి అయిన మధులితా, IIDF 2017, BCKA యువ కళా ప్రతిభ, ఆర్యా అవార్డు ఫర్ ఉమెన్ అచీవర్స్, అరతి కళా రత్న (ఫీనిక్స్, అమెరికా), GTF ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ వంటి మరెన్నో గుర్తింపులు పొందారు.
గురు గంగాధర్ ప్రధాన, గురువరాలు అరుణా మొహంతీ, గురువులు పబిత్ర కుమార్ ప్రధాన, కృష్ణచంద్ర సాహూ వద్ద శిష్యరికం పొందిన ఆమె, అభినయ నైపుణ్యంలో విమర్శకుల ప్రశంసలు పొందారు. ఆమె నృత్యానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతారు.
కోణార్క్ ఫెస్టివల్, ముక్తేశ్వర్, ఢౌళి మహోత్సవం, తాజ్ మహోత్సవం, బెంగళూరు ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫెస్టివల్ వంటి అనేక ప్రతిష్ఠాత్మక వేదికలతో పాటు, అమెరికా, మలేషియా, లండన్‌లోనూ ఆమె ప్రదర్శనలు రంజింపజేశాయి. “మ్యాజిక్ ఇన్ మూవ్‌మెంట్స్” (ఫీనిక్స్, USA), “సమాగమ్” (ఇండియన్ హై కమిషన్, లండన్) వంటి వేదికలు ఆమె అడుగులతో కళా సంబరాలుగా మారాయి.
అంతేకాదు, ఆమె రేవా యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా మాస్టర్స్ విద్యార్థులకు ఒడిస్సీ బోధించారు. దక్షిణ భారతంలో, ముఖ్యంగా బెంగళూరులో ఒడిస్సీకి కొత్త ఊపిరి పోసే క్రమంలో ఆమె స్థాపించిన “నృత్యాంతర్” ప్రముఖ పీఠంగా నిలిచింది. శిష్యులను తీర్చిదిద్దడంలోనూ, నృత్యరూపకాన్ని ప్రాచుర్యం చేయడంలోనూ మధులితా నిస్వార్థంగా శ్రమిస్తున్నారు.
ప్రస్తుతం ఆమె నేతృత్వంలోని నృత్యాంతర్ డాన్స్ కర్ణాటకలో అత్యంత ప్రజాదరణ పొందిన శాస్త్రీయ నృత్య బృందాలలో ఒకటి. దేశవ్యాప్తంగా జరిగే ప్రధాన ఆర్ట్ ఫెస్టివల్స్ ఆమె బృందాలను ఆహ్వానించడం వారి ప్రతిభకు మరో గుర్తింపు.
మధులితా మోహపాత్ర ప్రస్థానం ఒడిస్సీ నృత్యాన్ని కేవలం ఒక కళారూపం గాకుండా, మనసును తాకే అనుభూతిగా మలుస్తారనే పేరుంది.