లంక భూముల్లో సాహితీ సేద్యం

జువ్వలపాలెం సాహిత్య పాఠశాల-1

Update: 2025-11-09 07:04 GMT
Image Source: Juvvalapalem facebook page

జువ్వలపాలెం సాహిత్య పాఠశాల అనగానే, కళ్ళ ముందు అనేక సంగతులు కదలాడతాయి. అనేక సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక విషయాలు తళుక్కున మెరుస్తాయి. నా మూలాలున్న ప్రాంతంలోని గ్రామీణ జనజీవితాన్ని నాలుగున్నర దశాబ్దాల క్రితం తొలిసారిగా చూసే అవకాశం కలిగిన సందర్భం అది.

కృష్ణా నది అనేక పాయలుగా చీలి సముద్రుడిలో సంగమించే ప్రాంతంలోని అనేక పల్లెలను లంక గ్రామాలంటారు. నదికి ఆవల కృష్ణా జిల్లా, ఈవల గుంటూరు జిల్లా. నేనక్కడ నివసించకపోయినా, నా మూలాలున్న జిల్లాలవి. గుంటూరు జిల్లాలో నదికి ఆనుకుని ఉన్న లంక గ్రామాల్లో జువ్వలపాలెం ఒకటి.
‘‘జువ్వల పాలెంలో సాహిత్య వర్క్ షాప్ నిర్వహిస్తున్నాం, రండి’’ అన్నారు కొత్త పల్లి రవిబాబు. మానాన్న ఉద్యోగం చేసే పాలిటెక్నిక్ లో వర్క్ షాప్ ను నా చిన్న తనం నుంచీ చూస్తున్నాను. అందులో అనేక సెక్షన్లుండేవి. ‘బ్లాక్ స్మితిలో ఇనుమును కాల్చి, పెద్ద సుత్తితో కొట్టి సాగదీసినట్టు, సాహిత్య వర్క్ షాప్ లో కూడా సాగదీస్తారా! సాన బెడతారా!’ అనే ఊహ అప్పుడు నాలో మెదిలింది. వర్క్ షాప్ అంటే శిక్షణ అనే కదా అర్థం!
జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి రవిబాబు 1980 తొలి రోజుల్లో తిరుపతి వచ్చిన సందర్భం అది. చిత్తూరు జిల్లా నుంచి జనసాహితిలో సభ్యుడిగా ఏ. ఎన్. నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడిగా భూమన్ అప్పటికే ఉన్నారు. రవిబాబు వచ్చిన సందర్భంగా నేను కూడా జనసాహితిలో చేరాను.
గుంటూరు జిల్లా జువ్వలపాలెంలో 1980 జూన్ ఒకటి నుంచి పదవ తేదీవరకు పదిరోజుల పాటు వర్క్ షాప్ జరుగుతుందని చెప్పారు. ఎలా రావాలో వివరించారు. ఆ శిక్షణ తరగతులకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు నా వయసు పాతికేళ్ళు.
తిరుపతిలో రైలెక్కి తెనాలిలో దిగాను. అక్కడి నుంచి బస్సులో వెల్లటూరుకు బయలు దేరాను. కృష్ణా జిల్లాలో పుట్టినప్పటికీ, నాకు ఊహ తెలిసే నాటికి, మా కుటుంబం మహబూబ్ నగర్ జిల్లా వచ్చేసింది. అక్కడి నుంచి రాయలసీమ వచ్చి స్థిరపడింది. తెనాలి నుంచి బస్సులో వెళుతుంటే పంట కాలువలు, పచ్చని పొలాలతో పరిసరాలు ఎంత కనువిందు చేస్తున్నాయో! రాయలసీమలో ఇంత పచ్చని చేలను,ఇన్ని నీళ్ళను నేనెప్పుడూ చూడలేదు. 

Image Source: Juvvalapalem facebook page 

మాకిన్ని కాలువలూ లేవు, ఇన్ని పంటలూ లేవు. ఒక్క సారిగా అన్ని నీళ్ళను చూసేసరికి మనసు ఉప్పొంగింది. రాయసీమలో తగినన్ని వర్షాలు పడవు. మేం రుతుపవనాలక్కూడా సవతి బిడ్డలం కదా! ఇంత సంపద ఉన్నా, ఇక్కడా పేదరికమే! ఇక్కడా అసమానతలే! బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు ఇక్కడి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ తీరప్రాంత జిల్లాల్లో అతి వృష్టి, రాయసీమలో అనావృష్టి.
తెనాలి నుంచి వెల్లటూరు రావడానికి బస్సులో గంట పట్టింది. వెల్లటూరులో దిగిన మాకు జువ్వలపాలెం దారి చూపించడానికి కోటేశ్వరరావు సహా మరి కొందరున్నారు. అక్కడి నుంచి జువ్వలపాలెం వెళ్ళడానికి ఆరోజుల్లో బస్సు లేదు. నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. లేదా ఎద్దుల బండ్లలో వెళ్ళాలి. వచ్చిన మిత్రులతో కబర్లు చెప్పుకుంటూ నడక మొదలు పెట్టాం.
ఎద్దుల బండ్ల దారిలో నడిచి వెళితే చాలా సేపు పడుతుంది. పంటపొలాలకు అడ్డంగా పడి, చేల గట్ల వెంబడి నడుచుకుంటూ వెళుతున్నాం. వరితో పాటు అరటి తోటలు బాగా ఉన్నాయి. పసుపు కూడా వేశారు. అక్కడక్కడా మామిడి తోటలు ఉన్నాయట కానీ, దారిలోఅవి మాకు కనిపించలేదు.
ఇవ్వన్నీ సారవంతమైన లంక భూములు. నది పొంగినప్పుడు కొట్టుకు వచ్చిన ఒండ్రు మట్టితో భూములు సారవంతమవుతాయి. అది ప్రకృతి ప్రసాదించిన వరం. ఈ సారవంతమైన భూముల వెనుక, పచ్చని పంటల వెనుక ఎన్నో విషాదాలున్నాయి. రైతుల జీవన్మరణ పోరాటాల కన్నీళ్ళున్నాయి.
రైతుల భూములను ఆక్రమించుకున్న చల్లపల్లి జమీందార్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలున్నాయి. బ్రిటిష్ పాలన అంతిమ దశలో కొన్ని పోరాటాలు జరిగాయి. స్వాతంత్య్రానంతరం కూడా కొన్ని పోరాటాలు జరిగాయి. నాటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరిగిన పోరాటాల్లో ఎంతో మంది అన్న దాతల రక్తతర్పణ వల్లనే రైతులకు భూములు దక్కాయి.
నాటకాలకు రెండవ ఉత్తమ ప్రేక్షకుణ్ణి : ఏ.ఆర్. కృష్ణ !?

నిఖిలేశ్వర్ ని వెల్లటూరి నుంచి ఎద్దుల బండిలో తీసుకొచ్చి జువ్వలపాలెంలో దించారు దివికుమార్ . మేం నాలుగు కిలోమీటర్లు నడిచి ఆ గ్రామానికి చేరుకున్నాం. మా కంటే ముందు కొందరు, మా తరువాత మరికందరు వచ్చారు. అంతా 43 మంది విద్యార్థుల వరకు చేరారు. అది కృష్ణానదికి సమీప గ్రామం. గ్రామమంతా వ్యవసాయ దారులే. కొన్ని పెంకుటిళ్ళు, కొన్ని డాబా ఇళ్ళు, ఎక్కువ భాగం పూరిళ్ళు.

స్కూ ల్లో మాకు బస ఏర్పాటు చేశారు. దానికి అనుబంధంగా పెద్ద తాటాకుల పాక/కొట్టం కూడా ఉంది. అక్కడ కూడా కొందరు దిగారు. నేలపైన పరచిన జంపఖానా పైనే మాపడక. చేదబావుల దగ్గరే స్నానాలు. పొలాలే మాకు మరుగు దొడ్లు. ఆ గ్రామస్తులే మాకు అన్న దాతలు. కొందరు గ్రామస్తులు తరగతి గదిలోకి వచ్చి కూర్చుని పాఠాలు విన్నారు.


ఏఆర్  కృష్ణ (నవంబర్ 13, 1926 - నవంబర్ 10, 1992)

ఈ పాఠశాల అనేక గొప్ప అనుభూతులను, అనుభవాలను మిగిల్చింది. ఎందరో సాహితీ వేత్తలు, భాషా వేత్తలు, మరెందరో సాంస్కృతిక రంగ ప్రముఖులైన కళాకారులను ఒక్క చోటే కలిసే అవకాశం, వారితో సంభాషించే అవకాశం కలిగించింది. మా ఆలూరి భుజంగరావు బాబాయిని తొలిసారిగా కలిసి ముచ్చటించింది ఈ జువ్వలపాలెం సాహిత్య పాఠశాలలోనే. ఆయన మా నాన్నకు పెదనాన్న కొడుకు అయినా, ఆ రోజుల్లో మాకుటుంబాల మధ్య పెద్దగా రాకపోకలు లేవు. గుడివాడలో మా బాబాయి ఇంటికి అప్పుడప్పుడూ మా నాన్న మాత్రం వెళ్ళి వస్తుండే వాడు.

ప్రముఖ నాటకరంగ ప్రయోక్త ఏ.ఆర్. కృష్ణ చివరి మూడు రోజులూ మాతోనే ఉన్నారు. ఒక సజీవ వీధి నాటకాన్ని అక్కడే రూపొందించారు. విద్యార్థులందరినీ కూర్చోబెట్టి మా వివరాలడిగారు. ఈ నాటకంలో ‘నువ్వు నటిస్తావా?’ అంటూ ఒక్కొక్కరినీ అడుగుతూ వస్తున్నారు. నా వంతు వచ్చింది. ‘‘నాకు నాటకాలు చూడడమే తప్ప నటించాలని లేందడి. ఉత్తమ ప్రేక్షకుడిగా ఉండిపోతా.’’ అని అన్నాను. ఆ మాటలకు నవ్వుతూ ఎంత ఆనందపడిపోయారో ఏ.ఆర్. కృష్ణ!

‘‘మనం నాటకాలు వేసేది ప్రేక్షకుల కోసమే కదా! ప్రేక్షకులు లేకపోతే నాటకం ఎవరి కోసం వేస్తాం? నాటకాలకు ఉత్తమ ప్రేక్షకులు చాలా అవసరం. రాఘవ మొదటి ఉత్తమ ప్రేక్షకుడైతే, నేను రెండవ ఉత్తమ ప్రేక్షకుణ్ణి’’ అనేశారు చాలా సీరియస్ గా. అంతా నవ్వుకున్నారు. నేను ఏ.ఆర్ . కృష్ణను చూట్టం ఇది రెండవ సారి. వనపర్తిలో నేను చదువుకుంటున్న రోజులవి. టెన్త్ క్లాస్ పరీక్షలు రాసి 1971లో దసరాబుల్లోడు సినిమా చూద్దామని, హైదరాబాదులో మా అక్క ఇంటికి వెళ్ళాను. హైదరాబాదు చూడడం అదే తొలిసారి.

మా బాబాబాయి ధర్మవరపు రాం గోపాల్ రంగస్థల నటుడు. మానాన్నకు పిన్ని కొడుకు. వనపర్తిలో మా ఇంట్లోనే ఉండి పాలిటెక్నిక్ చదువుకున్నాడు. నాటకాల్లో ఏ.ఆర్. కృష్ణకు శిష్యుడు. మా భూమి, ఒక ఊరి కథ, స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్, పెళ్ళికాని పెళ్ళి వంటి కళాత్మక, వ్యాపార సినిమాల్లో కూడా నటించాడు. ‘‘పబ్లిక్ గార్డెన్స్ లో ‘మాలపల్లి’ నాటకం వేస్తున్నాం సాయంత్రం రా రా’’ అని అన్నాడు మా బాబాయి. మా బావ ర్యాలీ సైకిల్ వేసుకుని, సైదాబాద్ నుంచి పబ్లిక్ గార్డెన్స్ కు ఆ రోజు వెళ్ళాను.

పబ్లిక్ గార్డెన్స్ లో ఉన్నవ లక్ష్మినారాయణ గారి ‘మాలపల్లి’ నాటకానికి అర్ధ చంద్రాకారంలో నాలుగైదు స్టేజిలు కడుతున్నారు. మా బాబాయి సహా నటులంతా స్టేజీలు కట్టే పనిలో నిమగ్నమయ్యారు. వారిలో ఏ.ఆర్.కృష్ణ కూడా ఉన్నారు. టెన్త్ పరీక్షలు రాశాను కనుక, అప్పుడే నిక్కర్ల నుంచి ఫ్యాంట్లకు నాకు ప్రమోషన్ వచ్చింది. ఏ.ఆర్.కృష్ణ నన్నుచూసి ‘ఇటు రా అబ్బాయ్’ అని పిలిచారు. వెళ్ళాను. ‘ఎవరబ్బాయివి?’ అని అడిగాడు. ఫలానా అని చెప్పాను. ‘‘ అలా కూర్చుంటే ఎలా? నాతోపాటు స్టేజి కట్టడానికి రా..’’ అన్నాడు. వెళితే నాచేత కూడా స్టేజి పనులు చేయించాడు. అంటే ప్రేక్షకులను కూడా నాటకంపనిలోకి దింపే స్వభావం ఆయనది.

మరొక సారి విద్యుత్ సౌదాలో చో రామస్వామి రాసిన ‘తుగ్లక్’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు కూడా ఏ.ఆర్.కృష్ణ ను చూశాను. ఎవరైనా నటులు రాకపోతే, ఆ పాత్రలోకి దూరేస్తారు. అది ఏ పాత్రైనా పరవాలేదు. తాను ఆ పాత్రకు సరిపోతానా లేదా అని కూడా చూడరు. ‘తెలుగు నాటక రంగం చేసుకున్న అదృష్టం ఏ.ఆర్.కృష్ణ ’ అని ‘ఉదయం’ పత్రికలో ఊరికే రాయలేదు.

జువ్వల పాలెం పాఠశాలలో ఏ.ఆర్.కృష్ణ నాటకం కోసం నటులను ఎంపిక చేస్తున్నప్పుడే వాసిరెడ్డి నవీన్ ఆయన దృష్టిలో పడ్డారు. ‘‘తెల్లగా జామ పండులా మిసమిసలాడుతున్నావ్. సినిమాల్లోకి వస్తావా!’’ అని అడిగారు. నవీన్ ఒక నవ్వు నవ్వేసి ఊరుకున్నారు. జువ్వలపాలెం పాఠశాలలో ఇవ్వన్నీ కొన్ని సరిగమలు. (సశేషం)



Tags:    

Similar News