కాలువ మల్లయ్య రచనల్లో హక్కుల భావన

పీడితులకు, వెనుకబడిన వారికి స్పూర్తి, ఉత్తేజం, మార్గదర్శనం చేయడం కాలువ మల్లయ్య సాహిత్యంలో కనిపిస్తుంది.

Update: 2025-11-05 07:30 GMT
ప్రముఖ రచయిత కాలువ మల్లయ్య

బడుగు బలహీన వర్గాల హక్కులకు భంగం కల్గించే కుట్రలు, కుతంత్రాలు ప్రముఖ కథా రచయిత కాలువ మల్లయ్య సాహిత్యంలో ప్రముఖంగా కనిపిస్తాయి. హక్కల సాధన భావన కథల్లో ఒక తాత్విక ధోరణిగా రూపొందడం ఆయ కథల్లో చూడవ్చు.  ఈ కోణం నుంచి ఆయన రాసిన కొన్ని కథలను పరిశీలిద్దాము.

"వీల్లనెవరు ముట్టుకోవద్దు, ముట్టుకుంటే స్నానం చేయాలి, చర్మకారులుగా, వెట్టివారుగా, తాల్లుపేనేవారుగా, పాలేర్లుగా అనేక పనులు చేస్తారు." (వేర్లు కథలో) బడుగు వర్గాల ప్రజలు తమకు పాలేర్లుగా ఉండడం తమ హక్కు అని పెద్దవాల్ల భావన. చిన్న వాళ్ళు పెద్దవాల్లను గౌరవించడం పెద్దవాళ్లు తమ హక్కుగా భావిస్తారు. పెద్ద వాళ్లంటే కులంలో, డబ్బులో, అధికారంలో, సాంఘిక హోదాలో పెద్ద వాళ్ళు. చిన్న వాళ్ళు ఎట్టి చేయడం పెద్ద వాళ్ళు తమ హక్కుగా భావిస్తారు. చిన్న వాళ్ళను దోచుకోవడం పెద్ద వాళ్ళు తమ హక్కుగా భావిస్తారు.

'అడ్డాలనాడు' కథలో మంగళి వృత్తి చేస్తూ బతికే గౌరయ్య తన కొడుకును ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగస్థునిగా చేయాలనేది గౌరయ్య కోరిక. గౌరయ్య కొడుక్కు ఫీజు కట్టడానికి పెత్తందారి దగ్గరకు అప్పు కోసం వెల్తే " ఇప్పుడు పీసులకే బాకిల్చేత్తే అటెనుకేడదెత్తవు...?కట్టపడి సదివిత్తే వాడు నీ తల పుండ్లు కడుగుతార్ర...?సదువుకున్నోన్ని నమ్మద్దు. అటెనుక రెక్కలచ్చిన పచ్చోలే ఎగిరిపోతే గప్పుడేర్పడతిరా నీకు... పైసల్లెవెంలెవ్వుపో..."బెదిరించిండు పెత్తందారు. పెత్తందారు ఎన్ని కుట్రలు చేసిన గౌరయ్య బెదరలేదు. గౌరయ్య తన కొడుకును చదివించడానికే పూనుకొని మరో వ్యక్తి దగ్గర అప్పు తెచ్చి కొడుకును కాలేజీలో చేర్పించినాడు. ఇంజనీరింగ్ చదివిన కొడుకును చూసి గౌరయ్య గర్వించినాడు.
కానీ గౌరయ్య కొడుకులో మార్పు తెచ్చింది పెత్తందారి వ్యవస్థ.
సామాన్యజనులను ఎదగకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాల్నో అన్ని ప్రయత్నాలు చేశారు. ఉద్యోగం రాగానే గౌరయ్యను తండ్రిలాగా కాకుండా ఒక పాలేరు కంటే హీనంగా చూస్తాడు.
గౌరయ్య కొడుకుతో దొరలు, పెత్తందార్ల పిల్లలు స్నేహం చేస్తారు. గౌరయ్య కొడుకును చెడగొడుతారు. గౌరయ్య బలహీనుడు. బలహీనున్ని మరింత బలహీనున్ని చేయడం పెత్తందార్లు తమ సహజ హక్కుగా భావిస్తారు.
సహజ హక్కులు అనే భావనను బెంథాల్ వంటి మేధావులు విమర్శించారు. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు సంఘటితమైన సమాజం లేనప్పుడు సహజ హక్కులు అనుభవించారన్న అభిప్రాయం అందులో ఉంది. హాబ్స్ సహజ హక్కుల భవనను అంగీకరించలేదు. సార్వభౌములు అంగీకార ముద్రవేసి అమలు చేసే సర్వజనామోదం పొందిన చట్టం అనేది లేకపోతే సహజ హక్కులే ఉండవు అనేది హాబ్స్ భావన.
అయితే జానులాక్, రూసో, జే.ఎస్. మిల్ మాత్రం సహజ హక్కులు అనే భావనను సమర్థించినారు.
ప్రకృతి పరంగా పుట్టుకతో వచ్చే హక్కులే సహజ హక్కులు. సహజ హక్కులు సర్వజనీనమైనవి. మానవులందరికి ఒకే విధంగా వర్తిస్తాయి అనేది సిద్దాంతం.
శ్రామిక కులాల, దళితులు, మహిళలు, పీడిత వర్గాల కార్మిక వర్గాల జీవితాలు కూడా ఆయా సాహిత్యాల్లోకి స్వీకరించి పరిశీలించడం, ఎదగదల్చుకున్న ఆయా పీడితులకు, వెనుకబడిన వారికి స్పూర్తి, ఉత్తేజం, మార్గదర్శనం చేయడం కాలువ మల్లయ్య సాహిత్యంలో కనిపిస్తుంది.
'దేశంలో దొంగలు పడ్డారు' కథలో పేదలను నిరుపేదలుగా మార్చడం, రైతులను రైతు కూలీలు మార్చడం తమ సహజ హక్కు అనే భావనలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో వివరించాడు కాలువ మల్లయ్య.
స్త్రీల హక్కుల గురించి గలుమ, నిరీక్షణ సగటు మద్య తరగతి ప్రజల సహజ హక్కుల గురించి జీవచ్చం, అల్లంరబ్బ, చావు లాంటి కథల్లో వివరించారు. రైతుల సహజ హక్కుల గురించి నేలతల్లి, సృష్టికర్తకలు, బోధివృక్షం మొదలైన కథలను రాశారు.
గౌడులు గౌడవృత్తిని తమ సహజ హక్కుగా భావిస్తారు. కాని గౌడవృత్తిని విధ్వంసం చేయడానికి పన్నిన కుట్రలు అనేకం.
"ఇది సురాపానం. దేవతలు తాగేది."
"దేవతలసొంటొల్లు తాగిన దాన్ని మనుషులెందుకు బందుచెయ్యాలి."
"గివన్ని ఓట్ల రాజకీయాలు. కల్లు బందువెడితే గవుండ్ల ఓట్లు వోతాయని భయం."
"ఎంతైనా బ్రాందీ లేకుంటే మజే లేకుంట పోయింది. ఇంటికి చుట్టమత్తే ఓ సీస తెచ్చి కోన్ని కోసి ముక్కలద్దుకుంట తింటే అదో మజా. కల్లు చిల్లరగాల్లు తాగేది." 'ఊరుమ్మడి బతుకులు' కథలో దేవతలకు ఇష్టమైన సురను బందు చేయడానికి ప్రభుత్వాలు చేసే కుట్రలు ఈ కథలో కనిపిస్తాయి. విదేశీ మద్యం తాగడం గౌరవంగా భావిస్తారు. తాటికల్లు,ఈతకల్లు తాగడం నామోసిగా భావించే జనం ఆలోచనను ఈ కథలో చూడవచ్చు. సూటి పోటీ మాటలతో గౌడుల సహజ హక్కులకు భంగం కల్గించే విధంగా ప్రజలు ప్రవర్తించడం కనిపిస్తుంది. బడుగు బలహీన వర్గాల హక్కులకు భంగం కల్గించే కుట్రలు, కుతంత్రాలు ఎన్నో కాలువ మల్లయ్య సాహిత్యంలో కనిపిస్తాయి.


Tags:    

Similar News